జగనన్న సంబరాలకు విద్యార్థుల తరలింపు
ABN, First Publish Date - 2022-12-14T23:37:43+05:30
విశాఖపట్నంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలకు ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో ఆడిటోరియం నింపడానికి వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులను తరలించడం విమర్శలకు తావిచ్చింది. దానిపై ఆ శాఖ మంత్రి రోజా కూడా అసహనం వ్యక్తంచేయడం కనిపించింది.
ఆడిటోరియం నింపేందుకే...
పిల్లలను తరలించడంపై తల్లిదండ్రుల అసంతృప్తి
అధికారులపై మంత్రి రోజా అసహనం
విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలకు ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో ఆడిటోరియం నింపడానికి వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులను తరలించడం విమర్శలకు తావిచ్చింది. దానిపై ఆ శాఖ మంత్రి రోజా కూడా అసహనం వ్యక్తంచేయడం కనిపించింది.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులకు జోన్ల వారీగా పోటీలు నిర్వహించి, రాష్ట్రస్థాయిలో బహుమతులు ఇవ్వాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల వారికి విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో మంగళవారం నుంచి పోటీలు ప్రారంభమయ్యాయి. దీనికి మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మొదటిరోజు కార్యక్రమానికి పోటీలో పాల్గొన్నవారు, వారి సహాయకులు తప్ప ఇంకెవరూ రాలేదు. ఆడిటోరియం మొత్తం ఖాళీగా కనిపించింది. అంతా చూసుకుంటే 50 మంది కూడా లేరు. ఈ విషయం గమనించి మంత్రి రోజా చిన్నబుచ్చుకున్నారు. బుధవారం పోటీలకు జనాలు వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై పత్రికల్లో ‘ఎవరి కోసం ఈ సంబరాలు’ అంటూ వార్తలు రావడంతో అధికారులు గతుక్కుమన్నారు. బుధవారం ఉదయం అధికార పార్టీ నాయకులు మొత్తం కట్టగట్టుకొని దీనికి హాజరయ్యారు. ఆడిటోరియం మొత్తం నిండిపోయేలా సమీపంలోని పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను యూనిఫారాల్లోనే తీసుకువచ్చి కూర్చోబెట్టారు. పోటీలు కళాకారులకైతే...పాఠశాలల సమయంలో విద్యార్థులను తీసుకురావడంపై తల్లిదండ్రులు పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నందుకు అధికార పార్టీ సభలకు మేము వెళ్లక తప్పడం లేదు. చదువుకునే పిల్లలను కూడా ఇలా పార్టీ కార్యక్రమాలకు తీసుకుపోతారా?’ అంటూ పలువురు విమర్శలు గుప్పించారు. ఇదిలావుండగా యూనిఫారాలతో వస్తున్న విద్యార్థులను గమనించిన మంత్రి రోజా తన శాఖ అధికారులను పిలిచి...‘విద్యార్థులను తీసుకురావద్దని అనుకున్నాం’ కదా?...అంటూ అసహనం వ్యక్తంచేశారు. అయితే అక్కడికి వచ్చిన అధికార పార్టీ నేతలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా యథాప్రకారం...ప్రసంగించి అక్కడి నుంచి నిష్క్రమించారు.
Updated Date - 2022-12-14T23:37:44+05:30 IST