నీరసించిన నిర్మాణరంగం
ABN, First Publish Date - 2022-12-30T00:07:05+05:30
జిల్లాలో నిర్మాణరంగం నీరసించింది. నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో అనేక మంది ఇళ్ల నిర్మాణానికి ఆసక్తిచూపడం లేదు. అటు ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. సిమెంట్, ఇసుక, ఇనుము, రాయి. చిప్స్, ఇటుక వంటి భవన నిర్మాణ సామగ్రి ధరల స్థిరీకరణ లేదు.
నీరసించిన నిర్మాణరంగం ‘ఉపాధి గగనం’
జిల్లాలో గృహనిర్మాణం అంతంతమాత్రం
నిర్మాణ సామగ్రి ధరలు పెరగడమే కారణం
పనులు దొరకక కార్మికులకు అవస్థలు
ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఇక్కట్లు
ఉన్న పరిశ్రమలు మూత.. కొత్త పరిశ్రమలు రావు
సుదూర ప్రాంతాలు వలసపోతున్న శ్రమజీవులు
(సాలూరు)
సాలూరు మెంటాడ వీధిలో ప్రతిరోజూ కనిపించే దృశ్యమిది. ఉదయం 7 గంటలకు పరిసర ప్రాంతాలకు చేందిన కార్మికులు 100 మంది వరకూ ఇక్కడికి చేరుతారు. ఎక్కడైనా పనులుంటే మేన్ పవర్ కాంట్రాక్టర్ వచ్చి మాట్లాడుకుంటాడు. పని కుదిరితే డబ్బులు. లేకుంటే నిరాశతో ఇంటికి తిరుగుముఖం పట్టాల్సిందే. నెలలో వారం, పదిరోజులు కూడా పని దొరకదని కార్మికులు ఎంతోమంది ఉన్నారు.
జిల్లాలో నిర్మాణరంగం నీరసించింది. నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో అనేక మంది ఇళ్ల నిర్మాణానికి ఆసక్తిచూపడం లేదు. అటు ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. సిమెంట్, ఇసుక, ఇనుము, రాయి. చిప్స్, ఇటుక వంటి భవన నిర్మాణ సామగ్రి ధరల స్థిరీకరణ లేదు. ఏరోజుకారోజు పెరుగుతూ వస్తున్నాయి. ముడి సరుకుల ధరలను సాకుగా చూపి ఉత్పత్తి సంస్థలు ధరలు పెంచుతున్నాయి. ఇదే అదునుగా కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సృష్టించి దోచుకుంటున్నారు. దీంతో ధరలు పెరిగి నిర్మాణదారులపై ఆర్థికభారం పడుతోంది. నియంత్రించాల్సిన ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. వీటిన్నింటి ప్రభావంతో కూలీలకు పని దొరక్కుండా పోతోంది. దీంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని 15 మండలాల ప్రజలు లవలసబాట పడుతున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు వలసపోతున్నారు. కుటుంబసభ్యుల వద్ద పిల్లలను ఉంచి దంపతులిద్దరూ వలసబాట పడుతున్నారు. స్థానికంగా ఏదో పనిచేసి ఉపాధి పొందుతుమనుకున్నవారికి మాత్రం పనులు దొరకడం లేదు.
ధధధరలు పైపైకి..
ఇప్పటికే ఇనుము, సిమెంట్ ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గురువారం నాటికి సిమెంట్ బస్తా ధర రూ.320గా ఉంది. టన్ను ఇనుము ధర రూ.60 వేలు. ఇసుక ధర చెప్పనక్కర్లేదు. లభ్యత ఉన్న దగ్గర ఒకలా.. సుదూర ప్రాంతాల్లో మరోలా ధర ఉంది. పారదర్శకంగా ఇసుకను నిర్దేశించిన ధరకే అందిస్తున్నట్టు ప్రభుత్వం వారం వారం పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నా..వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇసుక గరిష్ట అమ్మకపు ధర టన్నుకు రూ.475 చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ట్రాక్టరు ఇసుక ధర రూ.3,000 పైమాటే. దూరాన్ని బట్టి మరీ ఎక్కువ. జిల్లాలో నాగావళి, వేగావతి నదుల్లో రీచ్‌లకు అనుమతిచ్చినా.. విశాఖ, విజయనగరం అవసరాల పేరిట తరలించుకు పోతున్నారు. దీంతో నిర్మాణదారులు అధిక ధరకు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. నదుల్లో నీరు తగ్గిన వెంటనే మరికొన్ని రీచ్‌లను ప్రారం భిస్తామని ప్రభుత్వం చెప్పినా.. అటువంటి కార్యాచరణేదీ కనిపించడం లేదు. దీంతో జిల్లాలో ఇసుక లభ్యత లేని ప్రాంతాల్లో నిర్మాణదారులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఇప్పటికైనా ప్రభుత్వం గృహ నిర్మాణ సామగ్రి ధరల విషయంలో నియంత్రణ పాటించాల్సిన అవసరముంది.
ఒక్కో పరిశ్రమ మూత
జిల్లాలో పరిశ్రమలు కూడా లేవు. రైస్‌మిల్లులే అధికంగా ఉన్నాయి. వాటిలో కొద్దిపాటి మందికే ఉపాధి దొరుకుతోంది. సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, వస్తు రవాణా తగ్గడంతో లారీ పరిశ్రమ నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. దీంతో లారీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు సైతం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. సుదూర ప్రాంతాలు వలసపోతున్నారు. సాలూరు మండలంలోని జీగిరిం జూట్ పరిశ్రమ సైతం మూతపడింది. దీంతో ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి పొందుతున్న రెండువేల కార్మిక కుటుంబాలు ఉపాధికి దూరమయ్యాయి. బొబ్బిలి గ్రోత్ సెంటర్, సీతానగరం ఎన్‌సీఎస్ చక్కెర కార్మాగారంలో వేలాది మంది కార్మికులు పనిచేసేవారు. గ్రోత్ సెంటర్‌లో ఫెర్రో అల్లాయీస్‌తో పాటు ఇతర పరిశ్రమలు మూతపడ్డాయి. ఎన్‌సీఎస్ పరిశ్రమ సైతం మూతపడడంతో కార్మికులు వీధినపడ్డారు. వీరు కూడా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు చూస్తున్నారు.
పట్టణాల్లో కానరాని ‘ఉపాధి’
గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనులు దొరుకుతున్నా.. పట్టణాల్లో ఉన్నవారికి ఆ అవకాశం లేదు. మరోవైపు గ్రామాల్లో ఉపాధి పనులు కొంతవరకూ ఆసరాగా నిలుస్తున్నాయి. పట్టణాలు, మునిసిపాల్టీల్లో మాత్రం ఉపాధి పనులకు అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో పార్వతీపురం, సాలూరు మునిసిపాల్టీలతో పాటు పాలకొండ నగర పంచాయతీ ఉంది. ఈ మూడూ పట్టణాలు అన్న మాటే కానీ.. వ్యవసాయానికి దగ్గరగా ఉంటాయి. ఉపాధి పనులు కల్పించాలని ఈ మూడు పట్టణాల ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నా ఫలితం లేకపోయింది.
పని దొరికితే సంతోషం
మాది సాలూరు పట్టణం సమీపంలోని గుమడాం. స్థానికంగా వ్యవసాయ పనులు లేకపోవడంతో భవన నిర్మాణ పనుల కోసం వచ్చాను. ఉదయం 6 గంటలకే క్యారేజీలో భోజనం పట్టుకొని బయలుదేరాను. 10 గంటల వరకూ ఇక్కడే ఉంటాను. పని దొరికితే సంతోషం. రూ.500 వరకూ సంపాదిస్తాను. లేకుంటే క్యారేజీలో భోజనం ఇక్కడే తినేసి వెళ్లిపోతాను.
-శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మికుడు, గుమడాం
నెలలో సగంరోజులే..
మా వీధిలోని పనులు చేపట్టే మేస్ర్తీ ఒక ఆమె ఉంది. ఎక్కడైనా పనులు కుదిరితే ఆమె చెబుతుంది. ఆ రోజు మాకు పండుగే. ఉపాధి దొరుకుతుందన్న సంతోషం. లేకుంటే మాత్రం పస్తులే. ప్రస్తుతం పనుల అన్ సీజన్ నడుస్తోంది. నెలలో సగం రోజులు పనులు దొరకని పరిస్థితి. భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పనులు చేసేందుకు నిర్మాణదారులు ఆసక్తి చూపడం లేదు.
- లక్ష్మి, భవన నిర్మాణ కార్మికురాలు, సాలూరు
Updated Date - 2022-12-30T00:07:07+05:30 IST