చచ్చిపోతున్నారు సార్!
ABN, First Publish Date - 2022-11-06T00:44:14+05:30
రైన రోడ్లు లేవు. వాహనాలు అస్సలు రావు. అత్యవసరమైతే రాళ్లపైనే నడక. డోలీలే అంబులెన్స్‌లు. 10-20 కి.మీ. మోయాలి. ఆలోపే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. చచ్చిపోతున్నా అధికారులకు పట్టదు. ప్రజాప్రతినిధులూ కన్నెత్తి చూడరు. ఓట్లు తప్ప హామీలేవీ గుర్తుండవు. రోడ్లు వేయించండి మహాప్రభో.. అని మొత్తుకుంటున్నా కనికరించరు. చచ్చిపోతున్నాం సార్.. అంటున్నా ఉలకరు.. పలకరు. వాళ్లు గిరిజనులే కదాని చిన్నచూపేమో! ఎట్లాగూ నిలదీయలేరని నిర్లక్ష్యమేమో!
రాళ్లు, గుంతలు తేలి అధ్వానంగా రోడ్లు
గిరిజనులకు సకాలంలో అందని వైద్యం
ఆసుపత్రులకు వెళ్లేసరికి గాల్లో కలుస్తున్న ప్రాణాలు
ప్రతిపాదన దశలోనే దబ్బగుంట-పల్లపుదుంగాడ రోడ్డు
గిరిజనులను మభ్యపెడుతున్న నేతలు, అధికారులు
సరైన రోడ్లు లేవు. వాహనాలు అస్సలు రావు. అత్యవసరమైతే రాళ్లపైనే నడక. డోలీలే అంబులెన్స్‌లు. 10-20 కి.మీ. మోయాలి. ఆలోపే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. చచ్చిపోతున్నా అధికారులకు పట్టదు. ప్రజాప్రతినిధులూ కన్నెత్తి చూడరు. ఓట్లు తప్ప హామీలేవీ గుర్తుండవు. రోడ్లు వేయించండి మహాప్రభో.. అని మొత్తుకుంటున్నా కనికరించరు. చచ్చిపోతున్నాం సార్.. అంటున్నా ఉలకరు.. పలకరు. వాళ్లు గిరిజనులే కదాని చిన్నచూపేమో! ఎట్లాగూ నిలదీయలేరని నిర్లక్ష్యమేమో!
శృంగవరపుకోట, నవంబరు 5:
- ఇది శృంగవరపుకోట మండలం దారపర్తి గ్రామ పంచాయతీ కొండ శిఖర గ్రామాలకు వెళ్లే రోడ్డు. మూల బొడ్డవర పంచాయతీ దబ్బగుంట నుంచి పల్లపు దుంగాడ వరకు సుమారు 6 కిలోమీటర్లు రాళ్లపైనే రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు నిర్మిస్తున్నామంటూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతోంది. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కనీసం భూమిపూజా చేయలేదు. అడిగితే నిధులు సిద్ధంగా వున్నాయంటున్నారు. మూడేళ్లలో ఈ పంచాయతీ పరిధిలోనే సకాలంలో ఆసుపత్రికి చేరలేక పది మంది వరకు కన్నుమూశారు.
- ఇది వేపాడ మండలం కరకవలస శివారు మారికకొండ శిఖర గ్రామానికి వెళ్లే రోడ్డు. ఐదేళ్ల క్రితం రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి. మైదాన ప్రాంతం వరకు రోడ్డు నిర్మించారు. కొండశిఖరం వద్దకు వచ్చేసరికి పనులు ఆపేశారు. అటవీశాఖ అనుమతులు లేవని ఒకరు.. నిర్మాణ వ్యయం పెరిగిందంటూ కాంట్రాక్టర్ వదిలేశాడని ఇంకొకరు చెబుతూ నేతలు తప్పించుకుతిరుగుతున్నారు. చేసేదిలేక గిరిజనులు రోడ్డును కొద్దిగా చదును చేసుకుని వినియోగిస్తున్నారు.
- గంట్యాడ మండలం దిగువ కొండపర్తి గ్రామంతో పాటు 12 శివారు గ్రామాల ప్రజలు మండల, జిల్లా కేంద్రమైన విజయనగరానికి వెళ్లాలంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిలకల గెడ్డ గ్రామం వరకు సుమారు 12 కిలోమీటర్లు నడుచుకుని రావాలి. చుట్టూ కొండలు, తాటిపూడి రిజర్వాయర్ వుంది. చిలకలగెడ్డపై వంతెన నిర్మించి వీరికి రోడ్డు సదుపాయం కల్పిస్తే తప్ప కష్టాలు తప్పవు. ఆవైపుగా నేతలు ఆలోచించడం లేదు.
శృంగవరపుకోట, వేపాడ, గంట్యాడ, లక్కవరపుకోట, కొత్తవలస, మెంటాడ, బొండపల్లి తదితర మండలాల పరిధిలో కొండశిఖర గ్రామాలున్నాయి. ఇప్పటికీ ఆ గ్రామాలకు రహదారి లేక కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. ఐదు కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం రాళ్లు, పొదల్లో నుంచి నడుస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, ఇతర రోగులను డోలీ కట్టి తరలించాల్సిందే. తీసుకువెళ్లడంలో జాప్యం జరిగితే ప్రాణాపాయమే. దారి మధ్యలో ప్రాణాలు విడిచిన వారెందరో. రహదారి సదుపాయం ఉంటే సకాలంలో వైద్యం అంది బతికేవారని గిరిజనులు వాపోతున్నారు. కళ్ల ముందే తన వారు చనిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. శృంగవరపుకోట మండలం దారపర్తి గ్రామానికి రహదారి నిర్మించాలని దశాబ్దకాలంగా పోరాటం చేస్తున్నారు. దబ్బగుంట వచ్చిన అప్పటి కలెక్టర్ వీరబ్రహ్మయ్యను అడ్డుకున్నారు. పలుమార్లు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో రోడ్డు నిర్మాణానికి కదలిక వచ్చింది. అయితే అటవీ భూమి కావడంతో ఆశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోడ్డు నిర్మించేస్తామని చెబుతుండడమే కాని ఆచరణలో కనిపించడం లేదు. పైగా ఇప్పుడు అటవీశాఖ అభ్యంతరాలు లేవు. ఈ భూమికి బదులు మండల పరిధిలోని పేదఖండెపల్లిలో రెవెన్యూ శాఖ భూమిని అప్పగించింది. దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడ వరకే రోడ్డు వేసేందుకు ప్రతిపాదించారు. దీనిని కూడా నిర్మించకుండా కాలయాపన చేస్తున్నారు.
సగంలో ఆపేశారు
వేపాడ మండలం మారిక కొండ శిఖర గ్రామానికి చేపట్టిన రోడ్డును సగంలో ఆపేశారు. మధ్యలో నుంచి నడక పాట్లే. ఈ రోడ్డుకు ఇరువైపులా వున్న భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొనేందుకు ఉపయోగపడ్డాయి. గిరిజనుల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. వారికి భూములు లేకుండా చేశారు. జిల్లా విభజన తర్వాత ఇక్కడి గిరిజన గ్రామాలేవీ సబ్‌ప్లాన్ ఏరియాలో లేవు. దీంతో 1/70 యాక్టు వర్తించకపోవడంతో గిరిజనేతరులు ఈ భూములను కాజేస్తున్నారు.
ఆపదలో డోలీలే గతి
గంట్యాడ మండలం దిగవ కొండపర్తి పరిధిలో 13 శివారు గ్రామాలున్నాయి. మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. గ్రామాల చుట్టూ కొండలు, ఓ పక్క తాటిపూడి రిజర్వాయర్, మరో పక్క ఆండ్ర రిజర్వాయర్‌లు హద్దుగా వున్నాయి. దీంతో వీరంతా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిలకల గెడ్డవరకు నడిచి వస్తారు. చిలకలగెడ్డపై వంతెన నిర్మించి ఆదుకోవాలని ఏళ్లుగా కోరుతున్నారు.
- దారపర్తి పంచాయతీ శివారు కురిడి గ్రామానికి చెందిన కె.సన్యాసమ్మ, దారపర్తి గ్రామానికి చెందిన ఎస్.బుదరయ్య, ఎస్.బాబు, పి.లచ్చన్న, బి.రమణలు సకాలంలో వైద్యం అందక ఇటీవల మరణించారు. డోలీతో తరలించి ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయిందని గిరిజన నాయకుడు జె.గౌరిష్ అవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సదుపాయం కల్పించకపోవడంతో వైద్యం అందుకోలేకపోతున్నామని వాపోయారు.
అటవీ శాఖకు భూమి ఇచ్చాం
దారపర్తి రోడ్డు నిర్మాణం కోసం మండల పరిధిలోని పెదఖండెపల్లి గ్రామ పరిధిలోని రెవెన్యూ భూమిని అటవీ శాఖకు అప్పగించాం. కలెక్టర్ ఆదేశాల ప్రకారం అటవీ శాఖ కోల్పోతున్న భూమికి బదులుగా 60 ఎకరాల వరకు అందించాం.
- డి.శ్రీనివాసరావు, తహసీల్దార్, ఎస్.కోట
రోడ్డుకు రూ.489.08 లక్షలు మంజూరు
దారపర్తి కొండశిఖర గిరిజన పంచాయతీ పరిధిలో రోడ్డు నిర్మించేందుకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) నిధులు రూ.489.08 లక్షలు మంజూరయ్యాయి. దబ్బగుంట నుంచి పల్లపు దుంగాడ వరకు 6 కిలోమిటర్ల పరిధిలో రోడ్డు నిర్మించనున్నాం. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల సూచన మేరకు భూమిపూజకు నిర్ణయం తీసుకుంటాం.
- సత్యనారాయణ, మండల ఇంజనీరింగ్ అధికారి, ఎస్.కోట
Updated Date - 2022-11-06T00:45:24+05:30 IST