కొందరికే కొళాయిలు!
ABN, First Publish Date - 2022-10-31T23:51:15+05:30
ఎప్పటి నుంచో గ్రామాల్లో నివశిస్తున్న కుటుంబాల కోసం ప్రారంభించిన ఇంటింటికీ కొళాయిల పథకాన్ని ప్రభుత్వం మధ్యలో ఆపేసింది. కొత్త పల్లవి అందుకుని జగనన్న కాలనీల్లో కొళాయిలు ఇస్తామంటోంది.
25శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన చోటే!
గ్రామాల్లో పథకాన్ని మధ్యలో నిలిపేసిన వైనం
ఇంటింటికీ కొళాయిపై ప్రభుత్వం కొత్త పల్లవి
జలజీవన్ మిషన్ నిధులతో పనులు
ఎస్.కోట, గుంకలాం లేఅవుట్‌లలో పనులు చేపట్టేందుకు తీర్మానాలు
ఎప్పటి నుంచో గ్రామాల్లో నివశిస్తున్న కుటుంబాల కోసం ప్రారంభించిన ఇంటింటికీ కొళాయిల పథకాన్ని ప్రభుత్వం మధ్యలో ఆపేసింది. కొత్త పల్లవి అందుకుని జగనన్న కాలనీల్లో కొళాయిలు ఇస్తామంటోంది. తాగునీరు కావాలంటున్న వారికి మానేసి ఇంకా ఇళ్ల నిర్మాణాలు పూర్తికాని కాలనీల్లో ఇంటింటికీ కుళాయిలేంటని పేదలు ప్రశ్నిస్తున్నారు. ఆ కాలనీల్లోనూ అందరికీ కొళాయిలు ఇవ్వడం లేదు. కొందరికే పరిమితం చేస్తున్నారు. 25శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన కాలనీలకే నిధులు వెచ్చించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన జలజీవన్ మిషన్ ఆశయం పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
శృంగవరపుకోట, అక్టోబరు 31:
జలజీవన్ మిషన్ ద్వారా ఎస్.కోట మండలంలోని 58 ఆవాసాల్లో ఇంటింటికీ కుళాయిలు నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. వాటిలో తొలి విడతగా 20 గ్రామాల్లో పనులు చేపట్టారు. మిగిలిన 38 గ్రామాల్లో ఇంటింటి కుళాయిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో వారికి షాక్ తగిలింది. గ్రామాల్లో కొళాయిల పనులను ప్రభుత్వం పక్కన పెట్టేసి జగనన్న కాలనీల్లో చేపడుతోంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని 777 జగనన్న కాలనీల్లో 14385.96 లక్షలతో ఇంటింటికీ కుళాయిలను నిర్మించేందుకు యంత్రాంగం నిర్ణయించింది. ఒక్కోచోట రూ.కోటి పైబడి నిధులు వెచ్చిస్తున్న కాలనీలకు ఇంటింటికి తాగునీరు సరఫరా చేసే కుళాయిల నిర్మాణానికి తప్పనిసరిగా పంచాయతీ, మున్సిపాల్టీల తీర్మానాలు అవసరం కావడంతో సోమవారం ఎస్.కోట పంచాయతీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ పంచాయతీ పరిధిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో అతిపెద్ద లే అవుట్ ఉంది. 1100 మంది లబ్ధిదారులకు ఇక్కడ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారు. సగం ఇళ్లు కూడా పూర్తికాలేదు. వాటిలోనూ చాలా వరకు పునాది, స్లాబ్ స్థాయిల్లో వున్నాయి. ఈకాలనీలో రూ.250.92లక్షలతో ఇంటింటికీ కుళాయిలను నిర్మించనున్నారు. జిల్లాలోని మున్సిపాల్టీలో విజయనగరం గుంకలాం లేఅవుట్ అతిపెద్దది. అక్కడ 11వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థల పట్టాలను ఇచ్చారు. రూ.58కోట్ల నిధులతో ఇంటింటికీ కుళాయిలను వేస్తామంటున్నారు.
- ప్రతి మనిషికీ సరిపడా తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్రం వాటాగా 50శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 50 శాతం నిధులతో పథకాన్ని ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సమకూర్చడంలో పిల్లిమొగ్గలు వేస్తోంది. తొలివిడతగా కొన్ని చిన్నచిన్న గ్రామాలు, శివార్లలోని ఆవాసాల్లో కుళాయిలను నిర్మించాలనుకుంది. కొన్నిచోట్ల పనులను ప్రారంభించింది. అంతలోనే వాటిని కాదని కొత్తగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో ఇంటింటికీ కొళాయిలను నిర్మించేందుకు పూనుకుంటోంది. ఇక్కడ పూర్తి చేసిన తరువాత మిగతా వారికి దశలవారీగా అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతుతుండడంతో గ్రామాల్లో ఎప్పటి నుంచో నివశిస్తున్న కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా ఓ మెలిక వుంది. 25శాతం నిర్మాణాలు జరిగిన కాలనీలకు మాత్రమే నిధులు వెచ్చించనున్నారు. డిసెంబర్ నెలలో సామూహిక గృహ ప్రవేశాల సమయానికి ఇళ్లల్లో నివశించేందుకు సిద్ధపడి వచ్చిన కుటుంబాలకే కొళాయిలను నిర్మించి ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
- జిల్లాలోని జగనన్న కాలనీల్లో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు కావడం లేదు. గ్రామాలకు దూరంగా వుండడం, నిర్మాణ వ్యయం పెరగడంతో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న నిధులు చాలకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. పట్టాలను రద్దు చేస్తామని బెదిరిస్తుండడంతో కొందరు అప్పు చేసి కడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆశించిన రీతిలో నిర్మాణాలు లేవు. ఈ నేపథ్యంలో జలజీవన్ మిషన్ పథకం అక్కడ ఎంతవరకు అమలవుతుందో చూడాలి.
ఇదేం పద్ధతి?
గ్రామాల్లో సంవత్సరాలుగా నివశిస్తున్న కుటుంబాలకు తాగునీరు సరఫరా చేయకపోవడం అన్యాయం. ఇంకా నిర్మాణాలు పూర్తికాని కాలనీల్లో కుళాయిలు ఏర్పాటు చేసేందుకు పూనుకోవడమేంటి? పన్నులు చెల్లిస్తూ వస్తున్న ఇళ్లకు కాదని కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లకు సదుపాయాలు కల్పించడం సమంజసం కాదు. గ్రామానికంతటికీ పథకం వర్తింప చేయాలి.
- సరిపల్లి రామకృష్ణ, వార్డు సభ్యుడు, ఎస్.కోట పంచాయతీ
కొళాయిల ఏర్పాటుకు తీర్మానం
జగనన్న కాలనీల్లో ఇంటింటి కుళాయిల నిర్మాణానికి తీర్మానం చేశాం. ఇందుకోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఇక్కడ ఇంటింటి కొళాయిలను నిర్మించేందుకు నిధులు కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన నిధులను వినియోగించుకోవడం పంచాయతీ విధి.
- గనివాడ సంతోషి కుమారి, సర్పంచ్, శృంగవరపుకోట
Updated Date - 2022-10-31T23:51:18+05:30 IST