జూట్ మిల్లులో అగ్ని ప్రమాదం
ABN, First Publish Date - 2022-12-13T23:54:48+05:30
తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేటలోనున్న ఉమా జూట్‌మిల్లులో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం సంభవించింది.
కొత్తవలస: తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేటలోనున్న ఉమా జూట్‌మిల్లులో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం సంభవించింది. రాత్రి 9 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత మిల్లులోని ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకై మంటలు వచ్చాయి. ఈ మంటలు పక్కనే ఉన్న గోగునారకు సంబంధించిన బండిల్స్‌కు అంటుకోవడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోగునార మెత్తబడేందుకు ఆయిల్, నీళ్లు, డిటర్జంట్ కలుపుతారు. ఈ కలిపిన మిశ్రమాన్ని ట్యాంకులో ఉంచగా ట్యాంకులో నుంచి ఆయిల్ లీకై గోగునార బండిల్స్‌పై పడింది. అదే సమయంలో విద్యుత్ షార్టు సర్య్కూట్ కారణంగా మంటలు రావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద సమాచారాన్ని స్థానిక అగ్నిమాపక కేంద్రానికి ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.5లక్షలు విలువైన గోగునార అగ్నికి ఆహుతి అయినట్టు సిబ్బంది తెలిపారు. సకాలంలో మంటలను అదుపు చేయకపోతే భారీ ప్రమాదం జరిగి ఉండేదని అగ్నిమాపక అధికారి కనకారావు తెలిపారు.
Updated Date - 2022-12-13T23:54:54+05:30 IST