రోడ్డు విస్తరణ.. సాగేనా?
ABN, First Publish Date - 2022-11-13T00:07:06+05:30
అది రాజాం మున్సిపాలిటీలోని కీలక రహదారి. మూడు జిల్లాలను కలిపే కూడళ్లు ఉన్న రోడ్డు. నిత్యం ట్రాఫిక్ స్తంభించడంతో పాటు గోతుల వల్ల ప్రమాదాలకు నిలయంగా మారింది. అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు.. వేదనలు.. ఆరోపణలు.. ఆందోళనలు వ్యక్తంకావడంతో ఎట్టకేలకు రోడ్డు విస్తరించాలని నేతలు, అధికారుల్లో చలనం అయితే వచ్చింది కానీ పనులు మాత్రం కావడం లేదు. మరోవైపు వ్యాపారులు, నివాసితులు గగ్గోలు పెడుతున్నారు. నిర్మాణాలు తొలగించేందుకు అంగీకరించడం లేదు. ముందుగా పరిహారం చెల్లించాలని పట్టుబడుతున్నారు. బాండ్‌లు అందజేస్తామని యంత్రాంగం చెబుతోంది.
సంవత్సరాలుగా చలించని రాజాం నేతలు, అధికారులు
ఇప్పుడు వ్యాపారులు, నివాసితుల గగ్గోలు
పరిహారం చెల్లించాలని డిమాండ్
బాండ్‌లు అందజేస్తామంటున్న యంత్రాంగం
అది రాజాం మున్సిపాలిటీలోని కీలక రహదారి. మూడు జిల్లాలను కలిపే కూడళ్లు ఉన్న రోడ్డు. నిత్యం ట్రాఫిక్ స్తంభించడంతో పాటు గోతుల వల్ల ప్రమాదాలకు నిలయంగా మారింది. అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు.. వేదనలు.. ఆరోపణలు.. ఆందోళనలు వ్యక్తంకావడంతో ఎట్టకేలకు రోడ్డు విస్తరించాలని నేతలు, అధికారుల్లో చలనం అయితే వచ్చింది కానీ పనులు మాత్రం కావడం లేదు. మరోవైపు వ్యాపారులు, నివాసితులు గగ్గోలు పెడుతున్నారు. నిర్మాణాలు తొలగించేందుకు అంగీకరించడం లేదు. ముందుగా పరిహారం చెల్లించాలని పట్టుబడుతున్నారు. బాండ్‌లు అందజేస్తామని యంత్రాంగం చెబుతోంది.
రాజాం, నవంబరు 12:
రాజాం ప్రధాన రహదారి విస్తరణ పనులకు అడుగడుగునా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మన్యం జిల్లా పాలకొండకు వెళ్లే రోడ్డులోని జిఎమ్‌ఆర్‌ఐటీ నుంచి చీపురుపల్లి రోడ్డులోని గాయిత్రీకాలనీ వరకూ రహదారి విస్తరణకు ప్రభుత్వం తాజాగా రూ.20 కోట్లు మంజూరు చేసింది. 80 అడుగుల వెడల్పున రహదారి విస్తరణకు నిర్ణయించింది. రహదారికి ఇరువైపులా కాలువలతో పాటు డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్‌తో తీర్చిదిద్దాల్సి ఉంది. రోడ్డు పనులు చేపట్టాలంటే 80 అడుగుల పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలి. ఇందుకోసం రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇటీవల కొలతలు వేసి మార్కింగ్ ఇచ్చారు. అయితే బాధితులకు నేరుగా పరిహారం అందించకుండా టీడీఆర్(ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్)బాండ్లు ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిని బాధితులు వ్యతిరేకిస్తున్నారు. గృహాలు పోగొట్టుకున్నాక పరిహారం అందజేయకపోతే ఎలానని ప్రశ్నిస్తున్నారు. పరిహారం ఇస్తే ఎక్కడైనా స్థలం కొనుగోలు చేసుకొని ఇళ్లు నిర్మించుకుంటామంటున్నారు.
ఫ గతంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు బాధితులకు ఎంతమందికి పరిహరం చెల్లించాలనే విషయంలో నివేదిక తయారు చేశారు. అయినా మున్సిపాలటీ అధికారులు మళ్లీ పట్టణ ప్లానింగ్ విభాగం అధ్వర్యంలో మార్కింగ్ చేసి కొలతలు వేస్తున్నారు. దీని వెనుక అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో భవనాల తొలగింపు ఓ ప్రహసనంగా మారే అవకాశం కన్పిస్తోంది. అయితే బాధితుల నుంచి ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు ఊహించి తెలివిగా లిఖిత పూర్వకంగా వారి నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. భవనాల యజమానులు ఎవరికి వారే నిర్మాణాలు తొలగించుకొంటే మంచిదని, మున్సిపల్ అధికారులు తొలగిస్తే ఇబ్బందులు ఉంటాయని చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు.
తెరపైకి భూముల వివాదం
డోలపేట సమీపంలో ఉన్న భూములన్నింటినీ దేవదాయశాఖ అధికారులు తమ శాఖకు చెందినవని చెప్పడం విడ్డురంగా ఉందని, తాము నివాసం ఉంటున్న భూములకు పూర్తి ఆధారాలు ఉన్నాయని బాధితులు బంకి తమ్మినాయుడు, భుజంగరావు తదితరులు చెబుతున్నారు. ఇళ్లున్న స్థలాలు తమ పేరున ఉన్నాయని, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన ప్లాన్ అనుమతులు, ఇంటిపన్నుల రశీదులూ ఉన్నాయంటున్నారు.
యజమానులే తొలగించుకోవాలి
జిరాయితీ స్థలంలో భవనాలను యజమానులే తొలగించుకోవాలి. బాధితులందరికీ టీడీఆర్ బాండ్లు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ బాండ్ల రాష్ట్రంలో ఎక్కడైనా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. హక్కులను బదిలీ చేయించుకోవచ్చు. దీనిపై ఈ నెల 2న విజయవాడలో సమావేశం జరిగింది. ప్రస్తుతం కొలతలు సరిచూస్తున్నాం. ఈప్రక్రియ పూర్తయిన తరువాత నిర్మాణాలను యజమానులు మాత్రమే తొలగించుకోవాలి.
- డీటీవీ కృష్ణారావు, కమిషనర్, మున్సిపాలిటీ, రాజాం
Updated Date - 2022-11-13T00:09:28+05:30 IST