రొయ్య రైతుల వలవిల
ABN, First Publish Date - 2022-10-31T00:17:51+05:30
రొయ్యలకు ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినా.. పెంచేదే లేదన్నట్టు వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. పెంచకపోగా రోజురోజుకూ తగ్గిపోవడంతో.. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కిలో రూ.240 నుంచి 180కి పతనం
వ్యాపారుల మాయాజాలం
సిండికేట్ అయ్యి రూ.50 తగ్గింపు
ప్రభుత్వ జోక్యంతో పెరగడం మాని తగ్గిన ధరలు
ఉత్పత్తి తక్కువగా ఉన్నా కొనుగోలు చేసేవారు లేరు
తీవ్ర నష్టాల బారిన రొయ్య రైతులు
రొయ్యలకు ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినా.. పెంచేదే లేదన్నట్టు వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. పెంచకపోగా రోజురోజుకూ తగ్గిపోవడంతో.. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆక్వా రైతులను ఆదుకుంటా మని ప్రభుత్వం వేసిన మంత్రుల కమిటీ 100 కౌంటు రొయ్యల ధర కేజీ రూ.240గా నిర్ణయించింది. 14 రోజులు కావొస్తున్నా ధరలు పెరగకపోగా ప్రస్తుతం రూ.50 తగ్గి రూ.180కి చేరింది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వం ధర నిర్ణయించినప్పటికీ వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి మార్కెట్‌లో ధరలు తగ్గించినట్లు కనిపిస్తోంది.
అనుకోని ఆపద
ఆక్వా రంగంలో అనుకోని పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడిని సాధిస్తూ లాభాలు ఆర్జించవచ్చని ఆక్వావైపు మరలు తున్న రైతుల పరిస్థితి రోజురోజుకూ దయ నీయంగా మారుతోంది. పెరిగిన పెట్టు బడులు, మేత, మందుల ధరలు, నాణ్యత లేని సీడ్, వైరస్ ప్రభావం నుంచి పంటను కాపాడుకుని దిగుబడులు సాధిస్తే పత నమైన ధరలతో తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు ఆక్వా చెరువులపై అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల ఆర్థికంగా, మానసి కంగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆక్వా సాగులో విద్యుత్ వినియోగం ఎక్కువ. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవు. జరగరానిది జరిగితే బాధిత కుటుంబీకులు వెంటనే యజమానిని చుట్టు ముట్టి అసభ్య పదజాలాలు, రూ.లక్షల్లో నగదు డిమాండ్లు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో లాభ నష్టాలు బేరీజు వేసుకోకుం డా చేసే ఆక్వా సాగులో రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మధ్యవర్తుల సమక్షంలో రాజీ కుదుర్చుకోవడం, ఈలోపు పోలీసులు రంగ ప్రవేశం చేసి పోస్టు మార్టానికి, అధికారుల ఖర్చులు యజమా నులే భరించాల్సిన పరిస్థితి. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆర్థికంగా పరిపుష్టి లేని కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు.
రొయ్యలు మాయం
చెరువులో అర్ధరాత్రి దొంగతనం.. రూ.10 లక్షల సొత్తు అపహరణ
ముదినేపల్లి, అక్టోబరు 30 : ముదినేపల్లి మండ లం పెదగొన్నూరులోని ఓ రొయ్యల చెరువులో దొంగలు పడ్డారు. ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్ సరఫరాను నిలిపి వేసి రొయ్యలను పట్టేశారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రైతులు చెరువుల వద్ద నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన సమయంలో గ్రామానికి చెందిన శ్రవణం శివప్రసాద్‌కు చెందిన మూడెకరాల రొయ్యల చెరువులో ఈ దొంగతనం జరిగింది. వలలు, వాహనాలతో వచ్చిన దుండగులు చెరువు లోని రొయ్యలను పట్టుకుపోయారు. ఆదివారం రైతు శివప్రసాద్ చెరువు వద్దకు వెళ్లగా, పలు చోట్ల చెరువులోకి మనుషులు దిగిన ఆనవాళ్లు, గట్లపై రొయ్యలు కనిపించాయి. అనుమానంతో వలలు వేసి చూడగా, అంతకుముందు ఉన్న కౌం ట్ రొయ్యలు కనిపించలేదు. ధర తక్కువగా ఉ న్నందనే కారణంగా మరో రెండు రోజుల్లో రొయ్య లను పట్టి అమ్ముదామనుకున్నానని ఈలోగా చెరువులోని రొయ్యలను అపహరించారని, వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, చెరువును పరిశీలించారు.
ఆక్వా సమస్యలపై ఉద్యమం
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు
కైకలూరు, అక్టోబరు 30 : ఆక్వా రైతుల సమస్య లపై ఉద్యమం చేసేందుకు టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం కైకలూరు టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జగన్మోహన రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలను దోచుకుతింటున్నారని, ఆయన పాలనపై ప్రజలతోపాటు వైసీపీ నాయకులు సైతం విముఖత చూపుతున్నారన్నారు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి, నేడు యూనిట్ చార్జీలు రూ.5.30 వసూలు చేస్తున్నారని దీనితో రైతులకు లక్షల్లో కరెంటు బిల్లులు కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రొయ్యలు 100 కౌంట్‌కు రూ.220 నుంచి రూ.240కు పెంచినట్లు ప్రకటనలు చేసుకోవడమే తప్ప క్షేత్రస్థాయిలో రైతుల వద్ద 100 కౌంటును రూ.200కే కొనుగోలు చేస్తున్నారని దీనితో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
Updated Date - 2022-10-31T00:17:54+05:30 IST