భూ ఆక్రమణపై స్పందించారు..
ABN, First Publish Date - 2022-12-03T01:12:53+05:30
రమణక్కపేటలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని శుక్రవారం తహసీల్దార్ దాసరి సుధ, సీనియర్ అసిస్టెంట్ చంద్ర శేఖర్‌రావు పరిశీలించారు.
ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందన
ముసునూరు, డిసెంబరు 2 : రమణక్కపేటలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని శుక్రవారం తహసీల్దార్ దాసరి సుధ, సీనియర్ అసిస్టెంట్ చంద్ర శేఖర్‌రావు పరిశీలించారు. ‘ప్రభుత్వ భూమి ఆక్రమణ’ శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆక్రమించుకున్న 30 సెంట్ల భూమికి సంబంధించిన ఎటువంటి రికార్డులు లేనట్టు గుర్తించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆర్‌ఎస్ నం. 86లో ఎకరం 80 సెంట్లు వాగు పోరంబోకు ప్రభుత్వ భూమి అని, దీనిలో 30 సెంట్లు భూమిని ఆక్రమించుకుని, రేకుల షెడ్డువేసి విని యోగించుకుంటున్న మాట వాస్తవమేనని ఆమె ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గతంలో పనిచేసిన తహసీల్దార్ ఈ ఆక్రమణ తొలగించాలని నోటీసులు జారీ చేశారన్నారు. అయితే ఈ వాగుపోరంబోకు భూమి పక్కనే ఆక్రమణ దారుడికి పట్టాభూమి ఉందని, ఆ భూమికి సంబంధించిన పట్టా నంబర్‌తో ఆక్రమణలో ఉన్న రేకులషెడ్డుకు విద్యుత్‌మీటర్‌కు దరఖాస్తు చేసుకున్నాడని తెలిపారు. ఈ ఆక్రమణ భూమిలో విద్యుత్‌మీటర్ ఏర్పాటుకు ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వవద్దని పంచాయతీ కార్యదర్శి జానకిని తహసీల్దార్ ఆదేశించారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. వీఆర్వో విజయకుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
‘గోతులను మట్టితో పూడ్చి మమ’పై..
నూజివీడు టౌన్: నూజివీడు పట్టణంలో ధ్వంసమైన రహదారులపై బారీ గోతులను వ్యర్థాల మట్టితో పూడుస్తున్న వైనంపై ‘గోతులను మట్టితోపూడ్చి మమ’ శీర్షికన గురువారం నాడు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆర్ అండ్ బి అధికారులు స్పందించారు. గోతులలోని మట్టిని తొలగించి వెట్‌మిక్స్‌తో పూడ్చారు. త్వరలో ప్యాచ్‌వర్క్‌ను చేపడతామని నూజివీడు ఆర్‌అండ్‌బీ డీఈ సిహెచ్ బాబురావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Updated Date - 2022-12-03T01:12:54+05:30 IST