ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు తప్పే!
ABN, First Publish Date - 2022-05-30T08:34:44+05:30
ఆకునూరి మురళి.. అతి పిన్న వయసులోనే గ్రూప్-1 కొలువు సాధించి.. ఆర్‌అండ్‌బీలో ఇంజినీర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కలెక్టర్‌గా పనిచేసి ప్రజల్లో మంచి

ఏపీలో గమ్మత్తు వ్యవస్థ ఉంది
సలహాదారుగా నాకే లంచం ఇవ్వ జూపారు
కులం పేరుతో ఓట్ల రాజకీయం దుర్మార్గం
దొంగలే రాజకీయ నేతలవుతున్నారు
‘కాళేశ్వరం’ అంత మూర్ఖపు ప్రాజెక్టు లేదు
స్వరాష్ట్రంలో నా సేవలు వాడుకోలేదు
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సంతృప్తిగా పనిచేస్తున్నా
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి
ఆకునూరి మురళి.. అతి పిన్న వయసులోనే గ్రూప్-1 కొలువు సాధించి.. ఆర్‌అండ్‌బీలో ఇంజినీర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కలెక్టర్‌గా పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. తెలంగాణ సర్కారు ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చి, పక్కన బెట్టడంతో.. వీఆర్‌ఎస్ తీసుకున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విద్యా శాఖ సలహాదారుగా అవకాశమిచ్చింది. ప్రస్తుతం ఏపీలో సంతృప్తిగా పని చేస్తున్నానని చెబుతున్న ఆయన.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తన మనసులోని విషయాలను పంచుకున్నారు.
నమస్కారం మురళి గారు.. ఎందుకని ఉన్నట్టుండి వీఆర్‌ఎస్ తీసుకోవాలనిపించింది?
మురళి: నమస్కారం ఆర్కే గారు.. నేను ఏ శాఖలోకి వెళ్లినా నన్ను బాగా ఉపయోగించుకోవాలని హెచ్‌వోడీలు, ప్రభుత్వం అనుకునేవాళ్లు. తెలంగాణ వచ్చాక కూడా మొదట్లో బాగానే ఉన్నా. సీఎంతో క్లోజ్‌గా ఉండేవాడిని. స్వరాష్ట్రం వచ్చిందని చాలా హ్యాపీగా పనిచేశా. నేను మొదట పాఠశాల విద్య కమిషనర్ పోస్టు అడిగితే ఇవ్వలేదు. తర్వాత.. ఎస్సీ కార్పొరేషన్‌లో పోస్టింగ్ అడిగా. అప్పటి సీఎస్ రాజీవ్ శర్మకు చెప్పగానే.. ఆయన సీఎం దగ్గరికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఇవ్వలేదు. ఇదే నా ఆవేదన. నిజానికి తెలంగాణ రాకముందు అందరూ నాకు మంచి పోస్టులు ఇచ్చారు. కారణమేంటో తెలియదుగానీ ఉన్నట్టుండి కేసీఆర్ ప్రాధాన్యం తగ్గించారు. మొత్తంగా పక్కనబెట్టేశారు.
అసలు మీ ఇద్దరికీ ఎక్కడ చెడింది..?
నా గురువు కొప్పుల రాజు. మేమిద్దరం కలిసి 13-14 ఏళ్లు పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో పని చేశాం. నేను ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయనను కలుస్తుంటాను. ఆయన కాంగ్రె్‌సలో చేరారు. ఇది ఒక కారణమని కొంత మంది మంత్రులు చెప్పారు. సరే.. చూద్దాంలే అని ఏడాదిన్నర ఎదురుచూశా. ఏమీ జరగలేదు. ఇక్కడుండి సమయం వృథా అని.. అనవసరంగా జీతం తీసుకోవడం ఎందుకని బయటకొచ్చేశా. అయితే, నేను రాజీనామా చేసిన వారంలోనే ఏపీ ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వెళ్లి ఏపీలో జాయిన్ అయ్యా. విద్యా శాఖ సలహాదారుగా సంతృప్తిగా పనిచేస్తున్నా.
ఏపీలో ఏం చేస్తున్నారు?
‘నాడు-నేడు’ అని పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఒక మంచి కార్యక్రమం. అది చేసుకుంటూ.. నాణ్యమైన విద్య, ఇంకా విద్యాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై పనిచేస్తున్నాను.
ఆంధ్రాలో ఐఏఎస్ అధికారులు రోజు విడిచి రోజు కోర్టుకెళతారు.. కోర్టు ధిక్కరణ కేసుల్లో..
అక్కడ ఇంత దారుణంగా లేదు. అయితే, అక్కడ గమ్మత్తు వ్యవస్థ ఉంది. నేను చాలా దగ్గరగా చూశా. నేను ఐఏఎస్ అధికారులతో కలిసి అక్కడ సీఎంతో ప్రతి వారం సమావేశమవుతా. అక్కడ పరిస్థితి వేరు. అక్కడ పనిచేసే అధికారులను సీఎం బాగానే ఉపయోగించుకుంటున్నారు.
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలకు రంగులేయడం తప్పా కాదా?
రంగులేయడం తప్పే. నైతికంగా, రాజకీయంగా కూడా అది సరికాదు. కానీ, అది కాగితాల మీద జరగదు. స్థానిక కాంట్రాక్టర్ అధికార పార్టీ వ్యక్తి అయితే ఆ రంగు వేయించే అవకాశం ఉంది. లేదా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. ఆ పని చేయించే అవకాశం ఉంది.
ఏయే రంగులు వేయాలో జీవోలో పెట్టారు.. దానినే కదా.. కోర్టు తప్పుపట్టింది?
అలా చేయడం తప్పే. గతంలో కాంగ్రెస్ హయాంలోనూ ఇలానే జరిగింది. ఏదేమైనా అలా చేయడం తప్పే. ముఖ్యమంత్రి, మంత్రులు నిజాయితీగా ఉంటే దేనినైనా అరికొట్టొచ్చు.
మరి ఎందుకు కేసులు ఎదుర్కొంటున్నారు..?
నిజానికి ఓపెన్‌గా మాట్లాడాలంటే జ్యుడీషియల్ వ్యవస్థలోనూ రాజకీయాలు వచ్చాయి.
చట్టం అమలైందా లేదా అన్నదే జ్యుడీషియరీలో చూస్తారు కదా..?
ఈ మధ్య చాలా సంక్లిష్టతలు వచ్చాయి. మొన్న 8 మంది ఐఏఎ్‌సలను జైలుకు పంపారు కదా.. అందులో వారి ప్రమేయమే లేదు.
దళిత బంధుపై మీ అభిప్రాయం
ఎస్సీలలో పేదలు ఉన్నారు. బీసీల్లో పేదలు ఉన్నారు. కులం పేరుతో సంక్షేమం చేయడం తప్పు. కేవలం కులం పేరుతో భారీ కార్యక్రమం చేసి ఓట్లు వేయించుకుంటాను. అధికారంలో ఉంటాననేది దుర్మార్గపు ఆలోచన.
సంక్షేమ పథకాలు ఎంతకాలం ఇవ్వగలరు?
సంక్షేమ పథకాల(స్కీం)తో ప్రజలను మభ్యపెడుతున్నారు. రాజకీయ నాయకులకు ఇది అలవాటుగా మారిపోయింది. దొంగలే రాజకీయ నేతలై, ఎమ్మెల్యేలై.. మళ్లీ మళ్లీ సంపాయించుకుంటున్నారు. రాజకీయం దొంగ బిజినెస్ అయిపోయింది. వీరికి తగ్గినట్టుగానే సీఎంలు కూడా వ్యవహరిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారా..?
అది దొంగ స్కీం. నేను భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేశా. దాని డీపీఆర్ డిజైన్ చేసినప్పుడు సీఎం గారు 36 లక్షల ఎకరాల ఆయకట్టు అని చెప్పారు. ప్రారంభించినప్పుడు 42 లక్షల ఎకరాలన్నారు. ఆ ప్రాజెక్టు నీరు ఎన్ని ఎకరాల్లో పారుతుందని నేను రేపు ఆర్టీఐ పెడతాను. 15 లక్షల ఎకరాలు పారుతుందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధం. ప్రపంచంలోనే ఇంత మూర్ఖపు ప్రాజెక్టు లేదు.
ఇప్పుడు మీరు కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా.. ప్రజలను చైతన్యం చేసే టార్చ్ బేరర్‌గా మారాలనుకుంటున్నారా..?
నేను ఆల్రెడీ మారాననే అనుకుంటున్నాను.
Updated Date - 2022-05-30T08:34:44+05:30 IST