ABC Cleantech: గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు కోసం ఏబీసీ క్లీన్‌టెక్ రూ. 50 వేల కోట్ల పెట్టుబడి
ABN, First Publish Date - 2022-11-03T20:50:46+05:30
దేశంలోని పునరుత్పాదక విద్యుత్ సంస్థల్లో ఒకటైన యాక్సిస్ ఎనర్జీ గ్రూపులో భాగమైన ఏబీసీ క్లీన్‌టెక్ (ABC Cleantech) ప్రైవేటు
బెంగళూరు: దేశంలోని పునరుత్పాదక విద్యుత్ సంస్థల్లో ఒకటైన యాక్సిస్ ఎనర్జీ గ్రూపులో భాగమైన ఏబీసీ క్లీన్‌టెక్ (ABC Cleantech) ప్రైవేటు లిమిటెడ్ భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది. ‘ఇన్వెస్ట్ కర్ణాటక 2022’లో భాగంగా కర్ణాటక (Karnataka) ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు ఏబీసీ క్లీన్‌టెక్ తెలిపింది. ఏడాదికి 0.2 మిలియన్ టన్నుల హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంతోపాటు 5 గిగావాట్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టులతో ఏడాదికి మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయబోతున్నట్టు వివరించింది. ఇందుకోసం రూ. 50 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. ఈ తయారీ కేంద్రాల ద్వారా వచ్చే పదేళ్లలో 5వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) సమక్షంలో బసవరాజ్ బొమ్మై సమక్షంలో ఏబీసీ క్లీన్‌టెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌తోపాటు కర్ణాటక అదనపు ముఖ్య కార్యదర్శి సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఈవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ప్రత్యేక విదేశీ పెట్టుబడులు (FDI) పొందిన రాష్ట్రం కర్ణాటక అని అన్నారు. ఇన్వెస్ట్ కర్ణాటక 2022 ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. పునరుత్పాదక శక్తి ద్వారా మాత్రమే పర్యావరణ సమతౌల్యతను కాపాడుకోగలమని, దాంతోపాటు భావి తరాలకు ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని అందించగలమని అన్నారు. ఏబీసీ క్లీన్‌టెక్ సీఎండీ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇన్వెస్ట్ కర్ణాటక 2022లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సృష్టించే ఉద్యోగావకాశాలు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు.
Updated Date - 2022-11-03T20:50:48+05:30 IST