Adani : పెట్రో కెమికల్స్‌లోకి అదానీ
ABN, First Publish Date - 2022-11-26T03:07:19+05:30
ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది.
రూ.32,800 కోట్లతో గుజరాత్‌లో ప్లాంట్
న్యూఢిల్లీ : ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా పెట్రో కెమికల్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. గుజరాత్‌లో 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.32,800) పెట్టుబడితో పెట్రో కెమికల్స్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. దీంతో ముకేశ్ అంబానీ నిర్వహణలోని రిలయన్స్ ఇండస్ట్రీ్‌సలా అదానీ గ్రూప్ పెట్రో కెమికల్స్ రంగంలోకీ ప్రవేశించినట్లవుతుంది. గుజరాత్‌కే చెందిన ఈ రెండు పారిశ్రామిక దిగ్గజాల మధ్య ఎప్పటి నుంచో ‘ప్రచ్ఛన్న’ వ్యాపార యుద్ధం నడుస్తోంది.
త్వరలో సూపర్ యాప్
టెక్ రంగంలోనూ మరో సంచలనానికి అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో ఒక సూపర్ యాప్ విడుదల చేస్తామని గౌతమ్ అదానీ వెల్లడించారు. ఈ యాప్ ద్వారా తమ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే ప్రయాణికులు, అదానీ గ్రూప్‌లోని ఇతర కంపెనీల సేవల కోసం కనెక్ట్ కావచ్చన్నారు.
ఎన్‌డీటీవీ కొనుగోలు ఒక బాధ్యత
ఎన్‌డీటీవీ టేకోవర్‌పైనా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. వ్యాపార దృష్టితో కాకుండా ఒక ‘బాధ్యత’గా మాత్రమే ఎన్‌డీటీవీని కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ మీడియా దిగ్గజంగా దీన్ని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని అదానీ వెల్లడించారు.
ఎన్‌డీటీవీ ప్రమోటర్లు అయిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ఈ విషయంలో అదానీ గ్రూప్‌తో కలిసి రావాలని గౌతమ్ అదానీ పిలుపునిచ్చారు.
రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓ
మరోవైపు రూ.20,000 కోట్ల భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ (ఎఫ్‌పీఓ)కు అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ బోర్డు ఆమోదం తెలిపింది. దేశంలో ఒక లిస్టెడ్ కంపెనీ ఇంత పెద్ద ఎఫ్‌పీఓకు రావడం ఇదే మొదటిసారి. వ్యాపార విస్తరణ కోసం ఈ ఎఫ్‌పీఓ తలపెట్టినట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.
Updated Date - 2022-11-26T03:07:20+05:30 IST