Amazon Layoffs: లే-ఆఫ్స్ వేళ ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
ABN, First Publish Date - 2022-11-23T16:48:23+05:30
గత కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT Layoffs) రంగంలో లే-ఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. టెక్ అండ్ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్(Amazon) ప్రపంచవ్యాప్తంగా..
గత కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT Layoffs) రంగంలో లే-ఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. టెక్ అండ్ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్(Amazon) ప్రపంచవ్యాప్తంగా ఉన్నపళంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన పరిణామం ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత్‌లో లే-ఆఫ్స్‌కు సంబంధించి అమెజాన్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఏ.అంజనప్ప ఈ నోటీసులపై స్పందిస్తూ.. అమెజాన్ పబ్లిక్ పాలసీ మేనేజర్ స్మితా శర్మ నవంబర్ 23న బెంగళూరులో జరగనున్న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
కార్మిక చట్టాలను ఉల్లంఘించి అమెజాన్ సంస్థ ఉద్యోగులను తప్పించిందని Nascent Information Technology Employees Senate (NITES) అనే ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడంతో అమెజాన్‌కు సదరు మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అమెజాన్ ఉద్యోగులను ఆ సంస్థ బలవంతంగా గెంటేసిందని NITES ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. అమెజాన్ సంస్థ తొలగించిన ఉద్యోగులకు Voluntary Separation Programme(VSP) గడువు నవంబర్ 30తో ముగియనుంది. Industries Disputes Act ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక ఉద్యోగిని తొలగించే అధికారం సంస్థకు ఉండదని ఆ ఫిర్యాదులో NITES గుర్తుచేసింది. NITES ప్రెసిడెంట్ హర్ప్రీత్ సలౌజా మీడియాతో మాట్లాడుతూ.. అమెజాన్‌లో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులకు న్యాయం జరిగేలా యూనియన్ తరపున పోరాడతామని తెలిపారు.
‘న్యూయార్క్ టైమ్స్’ రిపోర్ట్ ప్రకారం గత వారం కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో పనిచేస్తున్న 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు అమెజాన్ ప్రకటించింది. జనవరి 17 నుంచి ఈ Job Cuts వర్తిస్తాయి. ఉద్యోగం కోల్పోయిన వారిలో డేటా సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కార్పొరేట్ వర్కర్లు ఉన్నారు. ఇండియాలో కూడా అమెజాన్ లే-ఆఫ్స్ ప్రభావం తీవ్రంగానే ఉంది. అమెజాన్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. భారత్‌లో ఈ-కామర్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ప్రైమ్ వీడియోకు సంబంధించిన డేటా సెంటర్స్ కార్యకలాపాలను అమెజాన్ నిర్వహిస్తోంది. అయితే.. ఫేస్‌బుక్ ఇతర సంస్థల లే-ఆఫ్స్‌తో పోల్చితే అమెజాన్ లే-ఆఫ్స్ ప్రభావం భారత్‌లో అంత ప్రభావం చూపదని ఐటీ వర్గాల సమాచారం.
Updated Date - 2022-11-23T16:52:06+05:30 IST