Email On Layoffs: ఒకేసారి 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిన దిగ్గజ సంస్థ..!
ABN, First Publish Date - 2022-11-17T12:43:53+05:30
అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ అమెజాన్(Amazon) భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. వ్యయ భారాన్ని తగ్గించుకునే వంకతో గత కొన్ని రోజులుగా..
అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ అమెజాన్(Amazon) భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. వ్యయ భారాన్ని తగ్గించుకునే వంకతో గత కొన్ని రోజులుగా ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు పూనుకున్న సంగతి తెలిసిందే. అమెజాన్ కూడా తాజాగా ఇదే బాటను ఎంచుకుంది. ఒకరిద్దరిని కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో పనిచేస్తున్న పది వేల మంది ఉద్యోగులను ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని అమెజాన్ సంస్థ నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. ఈ వారంలోనే అమెజాన్‌లో ఈ ఉద్యోగాల కోత ప్రక్రియ మొదలుకానున్నట్లు తెలిసింది. బుధవారమే ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ అమెజాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఎట్టకేలకు అమెజాన్ తాజాగా ఈ వార్తలను ధ్రువీకరించింది. ఉద్యోగాల తొలగింపు వాస్తవమేనని స్పష్టం చేసింది. అమెజాన్‌లో ఆర్థికంగా ఏర్పడిన అనిశ్చితి కారణంగా వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
అమెజాన్ తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ లింప్(Senior Vice President of Devices and Services) అమెజాన్‌లో ఉద్యోగాల కోత నిజమేనని ధ్రువీకరించారు. ఇప్పటికే తొలగింపునకు సంబంధించి ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లుగా డేవిడ్ లింప్ తెలిపారు. అమెజాన్‌ను ఉద్యోగం కోల్పోయిన వారికి మరో ఉద్యోగం చూసుకునే విషయంలో సంస్థ అండగా ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. అమెజాన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల అమెజాన్‌లోని Devices & Services విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగం కోల్పోయిన వారు కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు అమెజాన్ రెండు నెలల సమయం ఇచ్చింది. ఒకవేళ.. ఆ రెండు నెలల్లో కూడా కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలో విఫలమైతే అమెజాన్ కొంత ప్యాకేజ్‌ను ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటికే అమెజాన్‌తో పాటు ఫేస్‌బుక్ మాతృ సంస్థ Meta కూడా గత వారం భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్‌లో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులు గత వారం ఉద్యోగం కోల్పోయారు. అంటే దాదాపు 13 శాతం మంది ఉద్యోగులను ఫేస్‌బుక్ యాజమాన్యం ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి పీకేసింది. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం సంస్థ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. ఆదాయం ఆర్జించడంలో విఫలమైన మార్క్ జుకర్‌బర్గ్ వ్యయ భారాన్ని తగ్గించుకునే నిమిత్తం (Cost Costing Measures) ఉద్యోగుల తొలగింపే మార్గమని భావించి అంత మందిని ఒకేసారి ఒక్క మెయిల్‌తో ఉద్యోగాల నుంచి పీకేశారు. మరో సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ కూడా మొత్తం పనిచేస్తున్న 7,500 మంది ఉద్యోగుల్లో 3,700 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఐటీలో మరోసారి మాంద్యం తలెత్తిందేమోనన్న రీతిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తీరు ఆ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగంపై అభద్రతా భావాన్ని రోజురోజుకూ పెంచుతున్న పరిస్థితి. ఉద్యోగుల తొలగింపునకు పాల్పడుతున్న సంస్థలన్నీ ‘వ్యయ భారాన్ని తగ్గించుకునే నిమిత్తం’ అనే ఒక్కమాటతో జాబ్‌ల్లో నుంచి ఉద్యోగులను పీకేస్తున్నాయి.
మరికొన్ని సంస్థలు ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉద్యోగాలను తెచ్చుకున్న వారిపై ఫోకస్ పెట్టాయి. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్(Cognizant) తాజాగా కొందరు ఉద్యోగులను ఇంటికి పంపింది. కొన్ని మేజర్ ఐటీ సంస్థలేమో మూన్‌లైటింగ్‌కు కొందరు ఉద్యోగులు పాల్పడుతున్నారని, అలా తమ సంస్థలో పనిచేస్తూ మరో సంస్థకు పనిచేయడం పాలసీకి విరుద్ధమని అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించామని ప్రకటించాయి. మొత్తంగా చూసుకుంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) రంగంలో గతంలో తలెత్తిన మాంద్యం(Recession) పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఒక్క మెయిల్‌తో ‘ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అనే సమాచారం వస్తుందేమోనన్న భయాందోళన ఐటీ ఉద్యోగుల్లో నెలకొంది. ఫ్రెషర్స్‌లో ఈ భయం మరింత ఎక్కువగా ఉంది. ఐటీ రంగంలోని ప్రముఖ సంస్థలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే తమ సంస్థల పరిస్థితేంటో అని చిన్నాచితకా ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గాబరా పడుతున్నారు. పైగా.. ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియలో ఎక్కువగా నష్టపోతోంది కూడా భారతీయులే కావడం గమనార్హం. ‘ఉద్యోగాల తొలగింపు’ ఎపిసోడ్‌లో అమెజాన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - 2022-11-17T12:52:25+05:30 IST