Elon Musk: ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్.. మీకు చివరిసారిగా చెబుతున్నా..
ABN, First Publish Date - 2022-12-11T21:14:57+05:30
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) సంస్థలోని ఉద్యోగులకు తాజాగా తీవ్ర హెచ్చరిక చేసినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) సంస్థలోని ఉద్యోగులకు తాజాగా తీవ్ర హెచ్చరిక చేసినట్టు సమాచారం. ట్విటర్‌కు నష్టం కలిగించేలా సంస్థ వివరాలను ఎక్కడా బహిర్గతం చేయకూడదని(Leak) ఆయన హెచ్చరించారట(Warning). ఈ మేరకు సంస్థతో ఉద్యోగులు మొదట్లో కుదుర్చుకున్న నాన్ డిస్‌క్లోజర్ ఒప్పందాన్ని మరోసారి ప్రస్తావిస్తూ ఈమెయిల్(Internal Email) పంపినట్టు తాజాగా బయటకు పొక్కింది. శుక్రవారం ఈ ఈమెయిల్ పంపిన మస్క్, శనివారానికి కల్లా దీనిపై స్పందించాలంటూ ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించారట.
‘‘మీకు చివరి సారిగా చెబుతున్నా.. ఉద్యోగంలో చేరేటప్పుడు సంస్థతో కుదుర్చుకున్న నాన్ డిస్‌క్లోజర్ ఒప్పందాన్ని(Non Disclosure Agreement) మీరు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే దాని పర్యావసానాల పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. ట్విటర్ తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకుని, పరిహారం రాబడుతుంది.’’ అని మస్క్ ఈ మెయిల్‌లో రాసినట్టు సమాచారం. అయితే.. సంస్థకు చెందిన కొద్దిపాటి సమాచారం బహిర్గతమైనా తనకు ఇబ్బంది లేదని మస్క్ పేర్కొన్నట్టు తెలిసింది. కానీ..మీడియాకూ పూర్తి వివరాలను పంపించడం మాత్రం అస్సలు సహించనని మస్క్ తేల్చి చెప్పారట. ‘‘ఇటువంటి చర్యలకు తగిన ఫలితం ఎదుర్కోక తప్పదు’’ అని మస్క్ ఈమెయిల్‌లో పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. పరిమితులు లేని భావప్రకటనా స్వేచ్ఛను ప్రోత్సహిస్తానని తరచూ చెప్పే మస్క్..ట్విటర్ ఉద్యో్గులకు ఇలాంటి ఈమెయిల్ పంపించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
Updated Date - 2022-12-11T21:14:59+05:30 IST