100కు పైగా భారతీయ భాషల్లో ఇంటర్నెట్ సెర్చ్
ABN, First Publish Date - 2022-12-20T01:57:08+05:30
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్.. 100కు పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి..
అందుబాటులోకి తేనున్న గూగుల్
కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్.. 100కు పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. గూగుల్ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో సాంకేతికంగా అద్భుతమైన మార్పులొస్తున్నాయని, దేశంలోని చిన్న వ్యాపారాలు, స్టార్ట్‌పలకు గూగుల్ మద్దతిస్తోందని భారత పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కంపెనీ కార్యక్రమంలో పిచాయ్ పేర్కొన్నారు. అంతేకాదు, కంపెనీ సైబర్ సెక్యూరిటీలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విద్య, నైపుణ్య శిక్షణ అందిస్తోందని, వ్యవసాయం మరియు హెల్త్‌కేర్ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అందిస్తోందన్నారు. ‘‘పదేళ్లలో 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) పురోగతిని సమీక్షించడంతో పాటు భారత డిజిటల్ భవిష్యత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త మార్గాల్లో మేమందిస్తున్న తోడ్పాటును ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చాన’’ని పిచాయ్ తన బ్లాగ్‌లో ప్రస్తావించారు. ఇందులో భాగంగా వందకు పైగా భారత భాషల్లో వాయిస్, టెక్ట్స్ సెర్చ్‌కు వీలుకల్పించేందుకు సింగిల్, యూనిఫైడ్ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచంలో అధికంగా మాట్లాడే 1,000 భాషల్లో ఆన్‌లైన్ సెర్చ్‌కు అవకాశం కల్పించడంతో పాటు ప్రజలు తమ స్థానిక భాషలోనే విజ్ఞాన సముపార్జన, సమాచార సేకరణకు అవకాశం కల్పించాలన్న ప్రయత్నంలో భాగంగానే భారత్‌లో వందకు భాషల్లో సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వచ్చే 5-7 ఏళ్లలో భారత్‌లో 1,000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.75,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ 2020 జూలైలో ప్రకటించింది.
ప్రధాని మోదీ, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ
భారత పర్యటనలో భాగంగా సుందర్ పిచాయ్ ప్రధాని మోదీ, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. కాగా, ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పిచాయ్‌తో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కన్పిస్తున్న వేగవంత వృద్ధికి ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా లక్ష్యాలు దోహదపడ్డాయన్నారు. వచ్చే ఏడాదిలో జీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రపంచంతో భారత్ అనుభవాలను పంచుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు.
అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో డిజిలాకర్ యాప్
నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఈజీడీ)తో జట్టుకట్టినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా త్వరలో అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో డిజిలాకర్ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌గా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. గూగుల్ తన ఫైల్స్ యాప్‌తో అనుసంధానించనుంది. ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను డిజిటల్ రూపంలో దాచుకునేందుకు వీలుగా డిజిలాకర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు.
Updated Date - 2022-12-20T06:51:12+05:30 IST