ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరా బెన్ ఆవేదన తీరేదెన్నడు?

ABN, First Publish Date - 2022-12-17T01:35:32+05:30

నేనుఒక దారి తప్పిన సంచారిని. ఇరవై రెండు సంవత్సరాల క్రితం భారత్లో నా ఆత్మ స్వగృహాన్ని మళ్లీ కనుగొన్నాను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నేనుఒక దారి తప్పిన సంచారిని. ఇరవై రెండు సంవత్సరాల క్రితం భారత్లో నా ఆత్మ స్వగృహాన్ని మళ్లీ కనుగొన్నాను. చరిత్ర రంగస్థలంపై ప్రదర్శితమవుతున్న ఒక మహోన్నత నాటకాన్ని వీక్షిస్తూ ఒక వినూత్న ప్రేరణ, అపార ఉత్సాహాన్ని పొందాను. బాపూలో ఒక మార్గదర్శకుడిని, హిందూ ధర్మంలో సత్య వచనాన్ని, భారత్లో మాతృమూర్తిని కనుగొన్నాను. ఇరవై రెండు సంవత్సరాల అనంతరం మాతృమూర్తికి ఆమె సొంత బిడ్డలే మానసిక క్షోభ, హృదయ శల్యమూ కలిగిస్తారని, తమను తాము హిందువులుగా పిలుచుకునే వారే సత్య పదాన్ని తూష్ణీకరిస్తారని నేను అప్పుడు ఊహించలేకపోయాను’ – ఈ ఆవేదనను వ్యక్తం చేసిన వారు మీరా బెన్. 1947 నవంబర్ 30 ‘హరిజన్’ సంచికలో ఆమె ఎంతో హృదయావేదనతో ఈ దేశ ప్రజలకు చేసిన ఒక విజ్ఞప్తిలోని మాటలవి.

మీరా బెన్ (1892–1982) అసలు పేరు మెడిలియస్ స్లేడ్. ఒక బ్రిటిష్ అడ్మిరల్ కుమార్తె. గాంధీజీ స్ఫూర్తితో 1925 నవంబర్లో ఆమె మన దేశానికి వచ్చారు. తన ‘బాపూ’తో కలిసి సబర్మతి, సేవాగ్రామ్ ఆశ్రమాలలో నివశించారు. భారత స్వాతంత్ర్యోద్యమానికి మద్దతుగా బ్రిటన్, అమెరికాలలో పర్యటించి ప్రచారం చేశారు. ఆ ఉద్యమ కార్యకర్తగా దేశంలో పలుమార్లు సుదీర్ఘకాలం కారాగారవాసం చేశారు. అస్పృశ్యత నిర్మూలన, ఖాదీకి ప్రోత్సాహం, హిందూ–ముస్లిం సమైక్యత మొదలైన గాంధేయ ఆదర్శాలను ఆమె మనసా వాచా కర్మణా పాటించారు.

దేశ విభజన సందర్భంలో మతోన్మాద అల్లర్లు చెలరేగాయి. రక్తపాతం జరిగింది. ఈ హింసాకాండకు హిందువులు, ముస్లింలు, సిక్కులు ఎంతగా కారకులో అంతగా బాధితులు. మతోన్మాదాన్ని గాంధీ అచంచల ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నారు. 1947 సెప్టెంబర్లో కలకత్తాలో ఆ తీవ్ర పరిస్థితులను ఉపశమింపజేసిన తరువాత ఢిల్లీకి వచ్చారు. అక్కడ పరిస్థితి మరింత మహోగ్రంగా ఉంది. పాకిస్థాన్ నుంచి కాందిశీకులుగా వచ్చిన హిందువులు, సిక్కులు ప్రతీకారాగ్నితో రగిలిపోతున్నారు. ఢిల్లీలో ఇంకా నివశిస్తున్న ముస్లింలపై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్తర భారతావనిలో ముస్లిం మైనారిటీలకు సంపూర్ణ భద్రతను పునరుద్ధరించగలిగితే, పాకిస్థాన్ వెళ్లి అక్కడ ఉండిపోయిన హిందువులు, సిక్కుల రక్షణకై తాను కృషి చేసేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని గాంధీజీ భావించారు. అయితే ఢిల్లీలోనూ, దాని పరిసర ప్రాంతాలలోనూ పరిస్థితులు గాంధీ ఊహించినదానికంటే చాలా విషమంగా ఉన్నాయి. అసలే కోపోద్రిక్తులై ఉన్న హిందువులు, సిక్కులను హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లు హింసాకాండకు పురిగొల్పాయి. భారత్లో మిగిలిపోయిన ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాగ్నులను ప్రజ్వరిల్లింప చేశాయి.

ఆరెస్సెస్ పన్నాగాల గురించి 1947 అక్టోబర్ 24న ఢిల్లీ పోలీస్ నివేదిక ఒకటి ఇలా పేర్కొంది: ‘ముస్లింలను సంపూర్ణంగా నిర్మూలించేందుకు మరోసారి దాడులు, దౌర్జన్యాలకు దిగితేనే గానీ వారు భారత్ నుంచి నిష్క్రమించరని సంఘ్ కార్యకర్తలు విశ్వసిస్తున్నారు.... ఢిల్లీ నుంచి గాంధీ నిష్క్రమణ కోసం వారు వేచి ఉన్నారు. మహాత్ముడు ఢిల్లీలో ఉన్నంతవరకు తాము కార్యాచరణకు దిగడం సాధ్యం కాదని సంఘ్ కార్యకర్తలు భావిస్తున్నారు’. 1947 నవంబర్ 15న ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఒకటి ఇలా పేర్కొంది: ‘రాష్ట్ర్ీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, ముఖ్యంగా పశ్చిమ పంజాబ్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారు, దీపావళి పండుగ తరువాత ఢిల్లీలో మతతత్వ అల్లర్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో ముస్లింలు కనిపించడాన్ని తాము సహించలేకపోతున్నామని వారు అంటున్నారు...’. 1947 అక్టోబర్, నవంబర్ నెలల్లో మీరా బెన్ ఢిల్లీలోనే ఉన్నారు. హిందువులు అంతకంతకూ ముస్లింల పట్ల విద్వేషంతో రగిలిపోవడాన్ని ఆమె గమనించారు. ఇది ఆమెను తీవ్రంగా కలవరపరిచింది. ఎంతో ఆవేదనకు గురిచేసింది. బాధాతప్త హృదయంతో భారతీయులకు, ముఖ్యంగా హిందువులకు ఒక విజ్ఞప్తి చేశారు: ‘ఇందుకేనా మనం స్వాతంత్ర్యం సాధించుకున్నది?’ నవజీవన ధాత్రిగా కాకుండా అంధకార కూపంగా ఈ దేశాన్ని మార్చివేసేందుకే మీరు సిద్ధమవుతున్నారా?’ అని మీరా బెన్ తీక్షణంగా ప్రశ్నించారు.

తమను తాము ‘హిందువులు’గా పిలుచుకుంటున్న మతఛాందసవాదుల అంతిమ లక్ష్యమేమిటి? ఎటువంటి భారతదేశాన్ని వారు సృష్టించదలుచుకున్నారు? ‘హిందూ తీవ్రవాదులు స్వప్నిస్తున్న భారతదేశం, తమను తాము ఆధిక్యులుగా భావించుకునే ప్రజలతో నిండిపోతుంది. మతపరమైన వారి అసహనం యథార్థ హిందూ ధర్మానికి విరుద్ధమైనది. ముస్లింలు అందరినీ వారి పూర్వీకుల నెలవుల నుంచి వెళ్లగొట్టబడతారు. ఈ దేశంలో ముస్లింల ఉనికిని సమూలంగా నిర్మూలించడమే వారి ధ్యేయం. ఇటువంటి పరిస్థితుల్లో ఇతర హిందూయేతరులు కూడా అటువంటి అసహనానికి బాధితులు అవడం జరిగితే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు’ అని మీరా బెన్ తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. ఆమె ఇంకా ఇలా రాశారు: ‘అనివార్యంగా ఏర్పడుతున్న పరిస్థితులను అంగీకరించేందుకు నా మనసు, హృదయమూ తిరస్కరిస్తున్నాయి. హిందూ స్వభావం తొలుత సమతౌల్యాన్ని తిరిగి పొందాలి. మతోన్మాదుల బృందం ఒకటి తమను అంధకారంలోకి నడిపిందన్న సత్యాన్ని వారు గ్రహించాలి. తమకు అపకారం చేస్తున్నవారికి అదే రీతిలో మరింతగా అపకారం చేయడమనేది దేనికీ ఏ విధంగానూ పరిష్కారం కాబోదు. ప్రజలు సంయమనం పాటించాలి. స్థిమితులై తమకు జరుగుతున్నదేమిటనే విషయమై ఆలోచించుకోవాలి. ఉన్మాద ప్రచారం ప్రభావంతో, తమను నైరాశ్య స్థితి నుంచి విముక్తం చేసి, స్వాతంత్ర్య మహోన్నత శిఖరాలపైకి తీసుకువెళ్లిన సమున్నత నాయకులనే తులనాడుతున్నారు. ఆ వివేకశీలురు చెప్పే విషయాలను వినకపోతే స్వాతంత్ర్య శిఖరాల నుంచి అంధకార అగాధాలలోకి జారిపోతారు’ అని మీరా హెచ్చరించారు.

సహచర భారతీయులకు మీరా బెన్ తన విజ్ఞప్తిని 1947 తుది వారాలలో చేశారు. 75 సంవత్సరాల అనంతరం, ఇప్పుడు మనం నివశిస్తున్న దేశానికి కూడా యుక్తమైనదిగా ఆ విజ్ఞప్తి కనిపిస్తున్నది. ‘తమను తాము హిందువులుగా భావించుకున్నవారు సత్యాన్ని తూష్ణీకరిస్తున్నారన్న’ ఆమె వ్యాఖ్య అక్షరక్షరమూ బీజేపీ ఐటి సెల్ కార్యకలాపాలకు పూర్తిగా వర్తిస్తాయి. ‘హిందూ తీవ్రవాదులు స్వప్నిస్తున్న భారతదేశం, తమను తాము ఆధిక్యులుగా భావించుకునే ప్రజలతో నిండిపోతుంది. మత వ్యవహారాలలో వారి అసహనం నిజమైన హిందూ ధర్మానికి విరుద్ధమైనది’ అన్న ఆమె వ్యాఖ్య ప్రస్తుతం మన దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ పక్షం భావజాలాన్ని నిర్దుష్టంగా వర్ణిస్తున్నది. దేశ విభజన జరిగినప్పుడు ‘ముస్లింలు అందరినీ వారి పూర్వీకుల నెలవుల నుంచి కఠినంగా పెకలించివేసి, పాకిస్థాన్కు వెళ్లగొట్టాలని’ హిందూత్వవాదులు అభిలషించారు. ఇప్పుడు వారు తమ ఆకాంక్షను సవరించుకుని భారతీయ పౌరులు అయిన ముస్లింలు అందరూ సకల జీవన రంగాలలోనూ హిందువులపై ఆధారపడి ఉండేందుకు అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

హిందూ మేధ తన సమతౌల్యాన్ని మళ్లీ పొంది హిందువుల మత, రాజకీయ ఆధిక్యతలో తన విశ్వాసాన్ని త్యజిస్తుందా? స్వాతంత్ర్యోద్యమ విలువలకు నిజంగా నిబద్ధమవుతుందా? 1947–48లో అది సాధ్యమయింది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి– గాంధీ నిరశన దీక్ష. 78 ఏళ్ల వృద్ధుడు అసాధారణ నైతిక స్థైర్యం, భౌతిక సాహసంతో నిరశన దీక్షకు ఉపక్రమించి ఢిల్లీ పౌరులు సిగ్గిల్లేలా చేశారు. చేయడమేకాదు మత సామరస్యానికి నిబద్ధమయి ఉండేలా వారిని దృఢ సంకల్పులను చేశారు. రెండు–గాంధీ హత్య. ఈ ఘటన సమస్త హిందువులనూ లజ్జాభరితులను చేసింది. ఆరెస్సెస్, హిందూ మహాసభ లాంటి సంస్థలను తిరస్కరించేలా చేసింది. గాంధీ హత్య మరో పర్యవసానానికీ దారితీసింది. జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్ తమ విభేదాలను విస్మరించి పరస్పర సమన్వయ సహకారాలతో పని చేసేలా వారిని ఏకం చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నెలల్లో ప్రధానమంత్రి, హోం మంత్రి మధ్య సంబంధాలలో తీవ్ర అసహనం చోటు చేసుకున్నది. అయితే తమ అధినేత, మార్గదర్శకుడి విషాదాంతంతో ఇరువురూ తమ విభేదాలను విస్మరించారు. దేశ పాలనలో కలసికట్టుగా వ్యవహరించారు. బీజేపీ ప్రచారకులు ఏమి చెప్పినప్పటికీ, ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఒక చారిత్రక సత్యాన్ని కప్పిపుచ్చలేరు. 1948 నుంచి 1950 దాకా నెహ్రూ, పటేల్లు సన్నిహిత మిత్రులే కానీ ప్రత్యర్థులు కారు. జాతిని సమైక్యపరిచేందుకు, భావి ప్రజాస్వామ్య భారతదేశానికి పటిష్ఠ పునాదులు వేసేందుకు కలసికట్టుగా కృషి చేశారు.

స్వతంత్ర భారతదేశ తొలి సంవత్సరాలలో హిందూత్వ శక్తులను ఓడించడంలో గాంధీ నిరశన దీక్ష, గాంధీ హత్య, నెహ్రూ–పటేల్ల మధ్య ఐక్యత నిర్ణయాత్మక పాత్ర వహించాయి. ఆ సుదూర గతం నుంచి మన వివాదాస్పద వర్తమానానికి ఏమైనా పాఠాలు ఉన్నాయా? 1947–48లో హిందూత్వ భారత రాజ్య వ్యవస్థపై బయట నుంచి దాడి చేసింది. ఇప్పుడు దాని చేతుల్లో సంపూర్ణ రాజ్యాధికారాలు ఉన్నాయి. తన సంకల్పం, ప్రయోజనానికి అనుగుణంగా (సైన్యం, న్యాయవ్యవస్థతో సహా) ప్రతి రాజ్యాంగ సంస్థనూ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏ విషమ పరిస్థితుల, రాజకీయ విపత్తుల, దార్శనిక నాయకత్వాల సమ్మేళనంతో హిందూత్వ శక్తులను అధికారం నుంచి తొలగించడం సాధ్యమవుతుంది? హిందూ మేధ తన సమతౌల్యాన్ని మళ్లీ పొందని పక్షంలో దేశానికి మరోసారి విభజిత, వినాశక భవిష్యత్తు ప్రాప్తించదా? రాబోయే నెలలు, సంవత్సరాలలో ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలపైనే మన రిపబ్లిక్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-12-17T01:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising