ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరేగా వెబ్‌సైట్ మార్పుతో నష్టం ఎక్కువే!

ABN, First Publish Date - 2022-03-08T06:31:21+05:30

‘ఆల్ఫ్ రాంసీ’ ఎవరు అని అడిగితే మునుపటి తరం ఫుట్‌బాల్ క్రీడాభిమానులు ఆయన్ని 1966లో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండు జట్టుకు మేనేజర్ అని చెబుతారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆల్ఫ్ రాంసీ’ ఎవరు అని అడిగితే మునుపటి తరం ఫుట్‌బాల్ క్రీడాభిమానులు ఆయన్ని 1966లో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండు  జట్టుకు మేనేజర్ అని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ గురువులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు మాత్రం– ‘గెలుస్తున్న జట్టును ఎప్పుడూ మార్చకండి’ అనే సూత్రాన్ని చెప్పిన వ్యక్తిగా గుర్తుచేసుకుంటారు. ఈ మాట వెనుక ఆల్ఫ్ రాంసీ ఉద్దేశం జట్టులో సభ్యులను మార్చవద్దని మాత్రమే కాదు, విజయవంతమైన ఎత్తుగడలు, వ్యూహాలను కూడా మార్చవద్దని. అయితే ఈ మౌలిక సూత్రం కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖకు మాత్రం తెలిసినట్టు లేదు. తెలుగు రాష్ట్రాలలో ‘మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం’ (నరేగా) అమలుకు ఇప్పటివరకు వారు ఉపయోగిస్తున్న వెబ్‍సైటును మూసివేసి దేశంలో అన్ని రాష్ట్రాలు వాడుతున్న కేంద్ర వెబ్‌సైటుకు మారమని ఒత్తిడి చేస్తున్నారు.


ఈ ఒత్తిడికి తలొగ్గి ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాలకు పథకం అమలుకు కేంద్ర వెబ్‌సైటుకు మారక తప్పలేదు. ఏపీలో ‘నరేగా’ పథకం అమలు గడచిన సంవత్సరం నవంబరు నెల నుంచి కొత్త వెబ్‌సైటుకు మారింది. తెలంగాణలో పథకం అమలు డిసెంబర్ నెలాఖరు నుంచి మారింది. మాములుగా ఐతే వెబ్‍సైటు చిరునామా మారడంలో పెద్ద విషయం ఏముంది అనిపించొచ్చు. కానీ సూక్ష్మంగా పరికిస్తే ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల్లోని కోట్లాదిమంది నరేగా కార్మికుల భవిష్యత్తును శాసించగలదని అర్థమవుతుంది.


సాధారణంగా ప్రభుత్వ వెబ్‍సైట్ అంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు అందించే సాధనంగా భావిస్తాం. కానీ నరేగా వెబ్‌సైట్ మాత్రం ప్రత్యేకమైంది. ఇది సమాచారాన్ని సందించటంతోపాటు, పథకాన్ని నిర్వేహించే వ్యవస్థగా కూడా పనిచేస్తుంది. పథకం నిర్వహణ, అమలు పర్యవేక్షణకోసం అధికారులు వెబ్‍సైటును వాడుతుంటారు. పథకం అమలులో– పని స్థితి, డిమాండు, అందించిన ఉపాధి, చెల్లించిన వేతనాలు తదితర అంశాల సమాచారాన్ని గురించి ఎవరైనా వెబ్‌సైటు వాడవచ్చు. అలానే ఈ వెబ్‌సైటుకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే నరేగా అమలు నిర్వహణలో భాగంగా అది మొదటి దశ కార్యకలాపాలను నమోదు చేయకుండా రెండవ దశ కార్యకలాపాలు చేపట్టటాన్ని అనుమతించదు.


ఉదాహరణకు కార్మికుల పని వివరాలు ఎక్కించకుండా వారికి వేతనాలు చెల్లించమని కేంద్రాన్ని అభ్యర్థించే ‘ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డరు’ జనరేట్ కాదు. అంటే ఉపాధి పథకం అమలు ప్రక్రియలో ప్రతి అడుగును ప్రతిబింబించేలా వెబ్‌సైటును డిజైన్ చేసారు. అసలు వెబ్‌సైటును పథకం అమలుకు, అమలులో పారదర్శకతకు, జవాబుదారీతనానికి ఉపయోగించుకోవడం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో– అదీ నరేగా పథకం అమలు నుంచే ప్రారంభమైంది. ఏపీ అనుభవం స్ఫూర్తితోనే కేంద్రం జాతీయ స్థాయిలో మిగిలిన రాష్ట్రాల కోసం నరేగా వెబ్‌సైటును రూపొందించింది.


అసలు చర్చలోనికి వెళ్లేముందు– తెలుగు రాష్ట్రాల్లో  ‘నరేగా’కు సంబంధించి ఒక ముఖ్యమైన గణాంకాన్ని చూద్దాం. 2020–21 సంవత్సరానికి నరేగా పథకానికి జాతీయ స్థాయిలో రూ.1.11లక్షల కోట్లు ఖర్చు కాగా, అందులో రూ.15,500 కోట్ల ఖర్చు తెలుగు రాష్ట్రాలలోనే అయ్యింది. అంటే జాతీయ స్థాయిలో నరేగా బడ్జెట్టులో దాదాపు 14శాతం వాటా తెలుగు రాష్ట్రాలదే.


ఇప్పుడు కొత్తగా నరేగా వెబ్‍సైటును మార్చడం వలన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా క్షేత్ర స్థాయిలో పలు మార్పులు జరగబోతున్నాయి. మొదటిది– తెలుగు రాష్ట్రాలకే పరిమితమై, గత పన్నెండేళ్లుగా అమలులో ఉన్న శాశ్వత శ్రమైక్య సంఘాల వ్యవస్థ పెనుమార్పులకు గురి కానుంది. రెండోది– నరేగా కార్మికులకు ప్రతియేటా వేసవి కాలంలో చెల్లిస్తున్న వేసవి అదనపు భృత్యం ఆగిపోనుంది. మూడోది– పనుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛ తగ్గిపోనుంది. నాలుగోది– పని దినాల లెక్కింపు పద్ధతిలో మార్పు జరగబోతుంది. దీనివలన పెద్దఎత్తున కార్మికులు ఆదాయాన్ని కోల్పోతారు.


ముందుగా శ్రమైఖ్య సంఘాల విషయం చూద్దాం. 2009లో ఏపీలో నరేగాలో ఒక్కొక్క గ్రూపులో 20మంది కార్మికులతో ‘శ్రమైక్య సంఘాల’ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసారు. ఇలా నమోదు చేసుకున్న గ్రూపుల ప్రతినిధులతో గ్రామస్థాయిలో నరేగా కార్మికులను ఒక యూనియన్‌గా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసారు. దశలవారీగా రాష్ట్ర స్థాయి యూనియన్ ఏర్పాటు చేయడం లక్ష్యం. ఈ ప్రయోగం ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉప్పునుంతల మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించడం, నరేగా పని ప్రదేశాల నిర్వహణను సులభతరం చేయడం, పథకం అమలులో పారదర్శకతను పెంచడం, నరేగా చట్టంలో కార్మికులకు వాగ్దానం చేసిన హక్కుల సాకారం... ఇవన్నీ ఫెడరేషన్ ప్రక్రియతో సాధ్యమవుతాయని అప్పటి ప్రభుత్వం భావించింది. ఫెడరేషన్ ప్రక్రియ విజయవంతమైందని, కేంద్రం ఈ ప్రక్రియని అన్ని రాష్ట్రాలలో అమలు చేసే ఉద్దేశంతో ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2013లో ప్రకటించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారం లోనికి వచ్చిన ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు ఫెడరేషన్ల ఏర్పాటు విషయంపై ఆసక్తి చూపకపోవడంతో ఒక గొప్ప ఆలోచన సమాధి చేయబడింది. ఇక వెబ్‌సైటు మార్పుతో ఫెడరేషన్ ఆలోచన శాశ్వతంగా కనుమరుగైనట్లే.


ఇక రెండవ విషయానికి వస్తే– ఈ వెబ్‌సైటు మార్పు వలన కార్మికులకు వేసవి భృతి నిలిచిపోతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్మికులు పూర్తి స్థాయిలో పని చేయలేక తక్కువ వేతనాలు రావడం, వేసవి వల్ల కార్మికుల పని హాజరు కూడా తక్కువ ఉండడం దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాలలో 20 నుంచి 30 శాతం వరకూ వేసవి భృతి చెల్లిస్తున్నారు. వేసవి ప్రత్యేక భృతి చెల్లింపు దేశంలో కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. ఇప్పుడిక వెబ్‌సైటు మార్పుతో కార్మికులు వేసవి భృత్యానికి దూరం కాబోతున్నారు.


మూడోది– పని దినాలను లెక్కించే పద్ధతిలో మార్పు. ఏపీలో నరేగా కార్మికుల పని దినాలను వారు ఎన్ని రోజులు పని చేసారన్న ప్రాతిపదికన కాకుండా వారికి వచ్చిన వేతనాల ఆధారంగా లెక్కిస్తున్నారు. 2014 నుంచి అమలులో ఉన్న ఈ పద్ధతి వెబ్‌సైట్‌ మార్పుతో మారిపోనుంది. దీని వలన, ఏపీలో నరేగా కార్మికుల పనిగంటలు పెరిగితే తప్ప, వారి ఆదాయం సాలీనా 35శాతం దాకా తగ్గిపోయే అవకాశం ఉంది. 


అలానే పనుల ఎంపికలో ఇప్పుడున్న స్వేచ్ఛ తగ్గిపోవడం, వెబ్‌సైటులో సాంకేతిక సమస్యలు తలెత్తినపుడు వాటిని పరిష్కరించే యంత్రాంగం స్థానికంగా అందుబాటులో లేకపోవడం తదితర సమస్యలు కేంద్ర వెబ్‌సైటుకు మారడం వల్ల తలెత్తనున్నాయి. అలానే నరేగా కార్మికుల హాజరు పట్టీలను త్వరగా వెబ్‌సైటులోకి ఎక్కించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న తెలుగు రాష్ట్రాలు ఇక ఆ ఘనతకు దూరం కాక తప్పదు. దీని వలన కార్మికులకు వేతన చెల్లింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వెబ్‌సైటు మార్చడం వలన జరగబోయే నష్టాన్ని నివారించడానికి కార్మికుల పని గంటలు పెంచడం, 40 మంది కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేయడం తదితర చర్యలతో రాష్ట్రాలు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాయి. కానీ వాటి వల్ల ప్రయోజనం ప్రశ్నార్థకమే.


అసలు తెలుగు రాష్ట్రాల నరేగా వెబ్‌సైటులో ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏమిటి? కేంద్ర వెబ్‌సైటుకు మారమని అడగడానికి గల కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవడానికి మేము సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించాం. కానీ కేంద్రం నుంచి సంతృప్తికరమైన జవాబు లభించలేదు. ఈ మొత్తం వ్యవహారంలో– మేము పథకం అమలుకు నిధులు సమకూరుస్తున్నాం కాబట్టి ఏమి చేసినా చెల్లుతుందనే ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తుందని అనిపిస్తోంది. ఏదో ఒకటి చేసి తెలుగు రాష్ట్రాలలో నరేగా నిధుల వినియోగాన్ని తగ్గించటమే లక్ష్యంగా కేంద్రం వెబ్‌సైటు మార్పిడికి ఒత్తిడి చేస్తున్నట్టుగా ఉంది.


ఐతే ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల తప్పు అస్సలు లేదనలేం. తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రణాళిక ప్రకారం– రాష్ట్ర ప్రభుత్వాలు పథకం అమలులో పౌర సమాజాన్ని దూరం చేస్తున్నాయి. కార్మికుల యూనియన్లు తయారు చేయడానికి ఉద్దేశించిన ప్రణాళికలను నీరుగార్చాయి. అందువల్లనే– కేంద్రం ఇంత దుస్సాహసానికి పాల్పడినా అడ్డుకునేవారు లేకుండాపోయారు.


‘పథకం అమలులో కీలక పాత్ర పోషించే సంస్థలు పారదర్శకతతో–జవాబుదారీతనంతో పనిచేయడం అవసరం’’ అని పథకం అమలును పర్యవేక్షించే చట్టబద్ధ సంస్థ ‘కేంద్ర ఉపాధి హామీ కౌన్సిల్’ పేర్కొన్న విషయం విస్మరించడం కేంద్రానికి తగదు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని నరేగా చట్టానికి లోబడి తెలుగు రాష్ట్రాలలో పథకం విజయవంతంగా నడవడానికి గల కారణాలను అన్వేషించి వాటిని అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి. అలానే స్థానిక పరిస్థితుల ఆధారంగా పథకం అమలు పద్ధతిని రూపొందించుకోగలిగే స్వేచ్ఛను రాష్ట్రాలకు పూర్తిగా ఇవ్వాలి. ఇదేదో అమలుకు సంబంధించిన సాంకేతిక వ్యవహారంగా మాత్రమేగాక కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, కార్మికుల హక్కుల దృష్టికోణం నుండి చూసినపుడు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నరేగా పథకాన్ని వినియోగించుకుంటున్న 1.5 కోట్ల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.

చక్రధర్ బుద్ధ

పరిశోధకులు, లిబ్టెక్ ఇండియా

Updated Date - 2022-03-08T06:31:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising