ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ ముఖంతో ఇక్కడ ఓట్లడుగుతారు కేసీఆర్?

ABN, First Publish Date - 2022-10-22T07:35:16+05:30

ఆంధ్రోళ్లు నీళ్ళూ నిధులను దోచేశారన్న భావోద్వేగమే కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ప్రాతిపదికగా నిలిచింది. ఆంధ్రోళ్లను తరిమికొడితేతప్ప తెలంగాణ బాగుపడదనే విధ్వంసకరమైన వాదనను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రోళ్లు నీళ్ళూ నిధులను దోచేశారన్న భావోద్వేగమే కేసీఆర్  తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ప్రాతిపదికగా నిలిచింది. ఆంధ్రోళ్లను తరిమికొడితేతప్ప తెలంగాణ బాగుపడదనే విధ్వంసకరమైన వాదనను ప్రచారంలో పెట్టి ఉండకపోతే తెలంగాణలో కేసీఆర్ రాజకీయంగా జీరో! నిధుల సమస్య రాష్ట్ర విభజన తర్వాత సమసిపోయింది. నీళ్ల వివాదాన్ని మాత్రం కేసీఆర్ తను బలహీనపడినపుడల్లా, ప్రజలకు జవాబు చెప్పుకోలేని ప్రతి సందర్భంలోనూ రగుల్చుతున్నారు. మొన్న సెప్టెంబర్ 29న ఢిల్లీలో విచారణ జరిపిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున చేతన్ పండిట్ (కేంద్ర జల సంఘం మాజీ సభ్యులు) సాక్ష్యం చెబుతూ, ‘తెలంగాణ ఏర్పడే నాటికే 40 శాతం కృష్ణ జలాలను బేసిన్ బయటికి మళ్ళించారు. ఇలాంటి అసమతుల్య పరిస్థితులే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి దారి తీశాయి’ అంటూ కేసీఆర్ మనోగతాన్ని ట్రిబ్యునల్ ముందు వెల్లడించారు. దీని అర్థం రాయలసీమకు కృష్ణ జలాలపై హక్కు లేదని చెప్పడమే!


అంతేకాదు, 2019 ఎన్నికల తర్వాత ఏపీ ముఖ్యమంత్రితో అలాయ్ బలాయ్ సాగిస్తున్న కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పట్ల మాత్రం తన ధోరణి మార్చుకోలేదు. ముఖ్యమంత్రులిద్దరూ లాలూచీ పడి సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారు. తనను అందలమెక్కించిన ఆంధ్రా వ్యతిరేక భావోద్వేగాన్ని కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన తర్వాత వదులుకుంటారో లేదో ఏపీ ప్రజలకు అప్రస్తుతం (వదులుకుంటే పునాదులు కూలిపోతాయి). ఏపీ ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని మాత్రమే చూస్తున్నారు. కేసీఆర్ అడ్డగోలు వైఖరితో నదీ జలాల అంశంలో ఏపీలో మెట్ట ప్రాంతాలకు జరగాల్సిన నష్టం ఏలాగూ జరిగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత నీళ్ల వివాదం చట్టబద్ధంగానో, సామరస్య పూర్వకమైన చర్చలతోనో పరిష్కారమైపోయేదే. కానీ కేసీఆర్ దాన్ని రావణకాష్టం చేశారు. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తనకేదో బలం ఉంటుందని లీకులు వదలిపెడుతూ, కిరాయి మనుషుల చేత అచ్చటచ్చట ఫ్లెక్సీలు పెట్టించుకొంటూ, ఇప్పటికిప్పుడు తెచ్చి పెట్టుకున్న ప్రేమానురాగాలు ఒలక బోస్తే విశ్వసించేందుకు ఏపీ ప్రజలు అమాయకులు కాదు. 


ఒక జాతీయ పార్టీ నేతగా వ్యవహరించదలచిన కేసీఆర్ తనకు ఎన్ని అభిమాన–దురభిమానాలున్నా కనీసం ఈ దేశ రాజ్యాంగాన్నీ తదనుగుణమైన చట్టాలనూ గౌరవించాలి. పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదించి, అమలులో ఉన్న రాష్ట్ర విభజన చట్టాన్ని కేసీఆర్ ఈ ఎనిమిదేళ్ళలో రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపిణీలో గౌరవించిన ఒక్క సందర్భం కూడా లేదు.


రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 85 సబ్ సెక్షన్ 8(ఎ)(1) మేరకు రాష్ట్ర విభజన అనంతరం 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం కింద నియమింపబడిన ట్రిబ్యునల్ తీర్పు మేరకు కృష్ణ నదీ జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని స్పష్టంగా నిర్దేశం ఉంది. కానీ కేసీఆర్ చేసిందేమిటి? ఆంధ్రోళ్లు ముఖ్యమంత్రులుగా ఉండి తెలంగాణకు అన్యాయం చేశారని, అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ అవార్డు లెక్క చేయకుండా ఫిఫ్టీ–ఫిఫ్టీ వాటాతో కృష్ణ జలాలను పంపిణీ చేయాలని అన్ని వేదికల మీదా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణకు కృష్ణ నదీ జలాల పంపకంలో అన్యాయం జరిగి ఉంటే బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య నీటి పంపకం జరిగినప్పుడేననే ఆలోచన కూడా కేసీఆర్‌లో లేదు. ఎగువ రాష్ట్రాల గురించి కించిత్తు పట్టించుకోకుండా, భావోద్వేగం రగిల్చేందుకు ఏపీతోనే తగాదా పెంచుతున్నారు. విభజన చట్టం మేరకు, ప్రస్తుతం అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకొన్నది. చట్టబద్ధత మేరకు బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తెలంగాణ పేచీ కొనసాగిస్తూనే ఉన్నది.


మరో అంశం. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా పంపకం కాకుండా మిగులు నీరు ఉంటే తిరిగి పంపకం చేయాలని, నీటి ఎద్దడి రోజుల్లో నీటి పంపిణీకి ప్రొటొకాల్ నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుకు బాధ్యతను అప్పగించింది. వాస్తవంలో బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి పంపిణీ చేసింది. తదుపరి వచ్చిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు జోలికి వెళ్లలేదు. ఎందుకంటే తను కేటాయించిన నీళ్లు వినియోగంలో ఉంటే ఆ నీటిని తిరిగి పంపిణీ చేయకూడదని పెట్టిన నిబంధన (జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న నిబంధన) మేరకు వ్యవహరించి తుదకు కృష్ణలో 65 శాతం నీటి లభ్యత కింద నికర జలాలు, సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలను లెక్కించి అన్ని రాష్ట్రాల మధ్య బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. కేవలం 150 టియంసిలు క్యారీ ఓవర్ కింద మిగిల్చి కృష్ణలో పంపిణీకి చుక్క నీరు లేకుండా చేసింది. ఈ అంశం ముందుగానే గ్రహించిన కేసీఆర్ ప్రభుత్వం సెక్షన్ 89 కింద విచారణ చేపట్టిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు గొంతెండి పోతున్న రాయలసీమ గొంతు కోసేందుకు తలపడ్డారు. జగన్మాయలో పడిన సీమలో కొందరు ఇంకా మేలుకోకపోవడమే నేటి విషాదం. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు 18 అంశాలతో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి విచారణాంశాలుగా కోరింది. అందులో రాయలసీమకు చెందిన కెసి కెనాలుకు, తుంగభద్ర ఎగువ కాలువ కేటాయింపులకు ఎసరు పెట్టింది. రాయలసీమకు నీటి కేటాయింపులు సరఫరా అంశాలు చర్చకు వచ్చినపుడల్లా కెసిఆర్ ప్రభుత్వం బేసిన్ అంశం తెరపైకి తెస్తోంది. రాయలసీమ కృష్ణ బేసిన్ ఆవల ఉందనే మొండి వాదన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీరాంసాగర్ నుంచి వచ్చే కాకతీయ కాలువ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి బేసిన్ నుంచి కృష్ణ బేసినుకు నీటిని తరలించడమనే జిజ్ఞాస కేసీఆర్‌లో లేకపోవడం కాకతాళీయమేమీ కాదు. తనకు లేని బేసిన్ సమస్య రాయలసీమకు కృష్ణ జలాలు సరఫరా వచ్చేసరికి తెర మీదకు తేవడం ఏ కోవకు చెందిన జాతీయవాదమో కేసీఆర్ చెప్పవలసి ఉంది.


రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ కృష్ణ యాజమాన్య బోర్డుకు పదుల సంఖ్యలో లేఖలు రాసి వుంటారు. మచ్చుకు రెండు మూడు అంశాలు చెప్పి ముగిస్తాను: 1) పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టియంసిలు (19+15) మాత్రమే విడుదల చేయాలని, అంతకు మించి విడుదల చేయకూడదని లేఖ రాశారు. కాగా మరో లేఖలో ఏకంగా హంద్రీనీవా ఎత్తిపోతలు నిలుపుదల చేయాలని, ఇంకో లేఖలో గురు రాఘవేంద్ర ఎత్తిపోతలు నిలుపుదల చేయాలని కోరారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఏపీకి చట్టవిరుద్ధంగా తలపెట్టిన కేసీఆర్ చర్యలు వివరిస్తే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2022-10-22T07:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising