హిపాక్రాటిక్ ప్రమాణానికి బదులు వైద్యవిద్యార్థులతో చరక ప్రమాణం
ABN, First Publish Date - 2022-02-12T15:45:21+05:30
హిపాక్రాటిక్ ఓత్.. వైద్యవిద్యార్థులతో చేయించే ప్రమాణం ఇది! ఆధునిక వైద్య శాస్త్ర పితామహుడుగా భావించే గ్రీకు ఫిలాసఫర్, వైద్యుడు హిపాక్రటీజ్ గుర్తుగా.. వైట్ కోట్ సెరిమనీ జరిగే సమయంలో వైద్య విద్యార్థులంతా వృత్తిధర్మాన్ని సక్రమంగా పాటిస్తామంటూ..
వైద్య కళాశాలలతో ఫిబ్రవరి 7న జరిగిన భేటీలో జాతీయ వైద్య కమిషన్ ప్రతిపాదన?
రెండూ ఉంచాలని సూచించిన శశిథరూర్
విద్యను కాషాయీకరిస్తున్నారు: కేరళ కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: హిపాక్రాటిక్ ఓత్.. వైద్యవిద్యార్థులతో చేయించే ప్రమాణం ఇది! ఆధునిక వైద్య శాస్త్ర పితామహుడుగా భావించే గ్రీకు ఫిలాసఫర్, వైద్యుడు హిపాక్రటీజ్ గుర్తుగా.. వైట్ కోట్ సెరిమనీ జరిగే సమయంలో వైద్య విద్యార్థులంతా వృత్తిధర్మాన్ని సక్రమంగా పాటిస్తామంటూ ఈ ప్రమాణం చేస్తుంటారు. అయితే, దీనికి బదులుగా.. ఆయుర్వేద వైద్య పితామహుడు, మన భారతీయుడు, చరక సంహిత గ్రంథకర్త అయిన చరక మహర్షి పేరిట వైద్యవిద్యార్థులతో ‘చరక్ శపథ్ (చరక ప్రమాణం)’ చేయించాలని ‘జాతీయ వైద్య కమిషన్’ అండర్‌గ్రాడ్యుయేట్ బోర్డు భావిస్తోంది. చరక్ శపథ్ కూడా హిపాక్రటీజ్ ప్రమాణం తరహాలోనే వైద్యుల వృత్తి ధర్మానికి సంబంధించిన ప్రవర్తన నియమావళి. రెండింటి సారాంశం దాదాపుగా ఒకే తరహాలో ఉండడం విశేషం.
గత సోమవారం (ఫిబ్రవరి 7న) వైద్యకళాశాలలతో జరిగిన చర్చలో జాతీయ వైద్య కమిషన్ యూజీ బోర్డు దీనిపై చర్చించినట్టు సమాచారం. దీంతోపాటు.. వైద్యవిద్యార్థులకు పదిరోజుల యోగా కోర్సును కూడా తప్పనిసరి చేసే ప్రతిపాదనపైనా చర్చించినట్టు తెలుస్తోంది. కాగా.. మనదేశంలో వైద్యవిద్యార్థులతో హిపాక్రాటిక్ ప్రమాణానికి బదులుగా ‘చరక ప్రమాణం’ చేయించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. హిపాక్రాటిక్ ప్రమాణాన్ని చరక ప్రమాణంతో మార్పిడి చేయాలనే ప్రతిపాదనపై జాతీయ వైద్య కమిషన్ సభ్యుడు డాక్టర్ మహేశ్ వర్మను సంప్రదించగా.. అలాంటి ప్రతిపాదన ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తమకు ఇంతవరకూ ఎలాంటి నోటిఫికేషన్ అందలేదని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ గౌరవ కార్యదర్శి డాక్టర్ జయేశ్ లేలే తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ అంశంపై స్పందించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్న హిపాక్రాటిక్ ప్రమాణాన్ని ఎత్తివేయడం దేనికి? దానికి బదులుగా చరక ప్రమాణాన్ని కూడా చేయించవచ్చుగా?’’ అని ప్రశ్నించారు. వైద్యవిద్యను కాషాయీకరించే ప్రయత్నంగా ఈ ప్రతిపాదనను కేరళ కాంగ్రెస్ విభాగం అభివర్ణించింది.
Updated Date - 2022-02-12T15:45:21+05:30 IST