TS Jobs Special: స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం
ABN, First Publish Date - 2022-12-21T16:39:27+05:30
దక్కన్ పీఠభూమి, ప్రధానంగా తెలంగాణ(Telangana) ప్రాంతాన్ని సుదీర్ఘకాలం అంటే దాదాపు 224 ఏళ్లు(1724-1948) వరకు పరిపాలించిన ఆస్‌ఫజాహీ పాలన ఒకవైపు... ప్రజా పోరాటాలు
తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం
దక్కన్ పీఠభూమి, ప్రధానంగా తెలంగాణ(Telangana) ప్రాంతాన్ని సుదీర్ఘకాలం అంటే దాదాపు 224 ఏళ్లు(1724-1948) వరకు పరిపాలించిన ఆస్‌ఫజాహీ పాలన ఒకవైపు... ప్రజా పోరాటాలు మరోవైపు ‘ఆపరేషన్ క్యాటర్ పిల్లర్’ ఫలితంగా అంతరించాయి. యూనియన్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో జనరల్ జె.ఎన్.చౌధురి 1948 సెప్టెంబరు 18 నుంచి రాజ్య మిలిటరీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ సమయంలోనే సాధారణ పరిపలన బాధ్యతలను ఐసీఎస్ అధికారి డి.ఎస్.బాంగ్లే చేపట్టారు.
నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ యూఎన్‌ఓలో వేసిన తన పిటిషన్‌ను 1948 సెప్టెంబరు 22న ఉపసంహరించుకున్నారు. 1948 నవంబరు 24న హైదరాబాద్‌లో భారత రాజ్యాంగమే అమలవుతుందని ప్రకటించారు. రాజరిక, ఫ్యూడల్ పరిపాలన స్థానంలో నూతన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు దారులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ రాష్ట్రం(Hyderabad State)లో నవశకం ఆరంభమైంది.
మిలిటరీ గవర్నర్ పాలనలో హైదరాబాద్
మిలిటరీ గవర్నర్ జయంత్‌నాథ్ చౌధురి, పౌరపరిపాలన అధికారి డి.ఎ్‌స.బాంగ్లే ఆధ్వర్యంలో నూతన పాలన ఆరంభమైంది. వీరికి పాలనలో సహాయం కోసం డాక్టర్ ప్రధాన్, నవాబ్‌యార్ జంగ్, రాజు దొంతిరాజ్, సి.వి.ఎస్.రావు, సి.హెచ్.కృష్ణారావు నియమితులయ్యారు.
వి.పి.మీనన్ రాసిన ‘ద స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్’ పుస్తకం ప్రకారం 1950 నాటికే హైదరాబాద్ స్వయం పోషక రాష్ట్రం. మిగతా భారతదేశ రాష్ట్రాల కన్నా స్వయం ఉన్నతిని సాధించిన రాష్ట్రం. ఈ విషయాన్నే 1950లో నియమించిన ప్రముఖ ఆర్థికవేత్త గోర్వాల కమిటీ ధ్రువీకరించింది. మరింత అభివృద్ధికి సూచనలు చేసింది. ఆ మేరకు మిలిటరీ గవర్నర్ పాలన కొన్ని నిర్ణయాలు చేసింది. అవి...
16 జిల్లాలకు నూతన పరిపాలన అధికారులను నియమించింది.
నిజాం కరెన్సీ ‘హాలిసిక్క’ను రద్దుచేసి భారతీయ కరెన్సీని అమల్లోకి తెచ్చింది.
శుక్రవారం బదులుగా ఆదివారం సెలవుదినంగా ప్రకటించింది.
జాగిర్దార్ వ్యవస్థను రద్దు చేశారు.
అయితే మిలిటరీ గవర్నర్ జనరల్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయన్న విమర్శ ఉంది. ప్రధానంగా సూర్యాపేట, మధిర, జనగామ కేంద్రాలుగా ఉద్భవించిన వీరోచిత తెలంగాణ సాయుధ పోరాట యోధుల పట్ల కర్కశంగా వ్యవహరించిందనే వాదన ఉంది. దాదాపు నాలుగు వేల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల బలిదానం ఈ కాలంలోనే జరిగింది.ఉద్యోగుల తొలగింపులో ముల్కీలకు అన్యాయం జరిగిందనే విమర్శ కూడా ఉంది.
భారత యూనియన్‌లో హైదరాబాద్ విలీనం అనంతరం ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఉద్యోగుల పరాయీకరణ. హైదరాబాద్ రాష్ట్రంలోని ఉద్యోగుల రక్షణ కోసం ఏర్పడ్డ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ‘‘హైదరాబాద్ సర్కారీ ములాజీం యూనియన్’’ దీని అధ్యక్షుడు అబ్దుల్ గఫార్. తరువాత కాలంలో ఈ యూనియన్ టిఎన్‌జీవోగా మారింది.
భారత్ రిపబ్లిక్‌లో హైదరాబాద్ రాష్ట్రం
భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ రిపబ్లిక్ దేశంగా మారింది. ఈ ప్రభావం హైదరాబాద్ రాష్ట్రంపై పడింది. హైదరాబాద్‌కు నూతన పరిపాలన అధికారిగా ఐసీఎస్ అధికారి ముల్లార్ - కౌడింగ్ వెల్లోడి నియమితులయ్యాడు. 1950 జూన్ 12న నూతన మంత్రి వర్గాన్ని వెల్లోడి ఏర్పాటు చేశాడు. 16 జిల్లాలకు చెందిన ప్రముఖులను మంత్రులుగా నియమించాడు. బూర్గుల రామకృష్ణారావు, విద్యాలంకర్, పూల్‌చంద్ గాంధీ, వల్లూరి బసవరాజు, నవాబ్‌యార్ జంగ్, ఎం.శేషాద్రి, సి.వి.ఎస్.రావు ఈ మంత్రివర్గంలో ఉన్నారు.
అయితే వెల్లోడి పరిపాలన కాలంలో స్థానిక ఉద్యోగాల్లో ముల్కీలకు అన్యాయం జరిగింది. అత్యధిక ఉద్యోగ వలసలు ఈ కాలంలోనే నమోదయ్యాయి. వీరి పాలనలో...
ఉర్దూ మీడియంలో చదివి ఇంగ్లీష్ రాని ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. నిజాం రాజ్యంలో ఉర్దూ అధికార భాషగా ఉండటం వల్ల మతాలకు అతీతంగా అందరూ ఉర్దూలోనే చదువుకునేవారు. ఈ నిర్ణయం వల్ల ముల్కీలకు తీవ్ర వేదన మిగిలింది.
మద్రాస్ రాష్ట్రం నుంచి గణనీయమైన సంఖ్యలో ప్రమోషన్లు ఇచ్చి ఉద్యోగులను హైదరాబాద్ తరలించారు.
ఆధునీకరణ పేరుతో ఉర్దూ భాషలోని రికార్డులన్నీ ఇంగ్లీష్‌లోకి మార్చారు. ఈ క్రమంలో అనేక అక్రమాలు జరిగాయనే అభిప్రాయం నెలకొంది.
ముల్కీ నిబంధనల్లోని పుట్టుకతో స్థానికత, 15 సంవత్సరాల నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు అనే ఉత్తర్వులు జారీ చేశారు.
ఎవాక్యూ ప్రాపర్టీ అంటే యజమానులు లేని భూమిని అధికారుల విచక్షణకు వదిలేశారు. వాస్తవంగా దేశవిభజన సందర్భంలో హైదరాబాద్ నగరంలోని కొంతమంది కులీనులు పాకిస్థాన్‌కు వలస పోవడంతో ఈ భూమిని సేకరించారు.
భారత యూనియన్‌లో హైదరాబాద్ విలీనం అనంతరం ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఉద్యోగుల పరాయీకరణ. విలీనం అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలోని ఉద్యోగుల రక్షణ కోసం ఏర్పడ్డ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ‘హైదరాబాద్ సర్కారీ ములాజీం యూనియన్’. దీని అధ్యక్షుడు అబ్దుల్ గఫార్. తరవాత కాలంలో ఈ యూనియన్ టీఎన్‌జీవోగా మారింది.
తొలి ఓటింగ్ - తొలి ప్రజా ప్రభుత్వం
వాస్తవానికి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం, రాజ్యాంగ పరిషత్ ఆధారంగా నెహ్రూ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కోసం 1952లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు.
హైదరాబాద్ రాష్ట్రంలో ఈ ఎన్నికలను భారత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే నిర్వహించారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా, వీటిలో తెలంగాణ జిల్లాల్లో 95, దక్కన్ మరట్వాడలో 44, దక్కన్ కన్నడలో 36 ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండటం వల్ల పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీ చేశారు. మొదటి అనుభవమైనప్పటికీ అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్, పీడీఎఫ్ మధ్య హోరా హోరీగా పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 93, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ 42, సోషలిస్టు పార్టీ 5, ఇండిపెండెంట్లు 14 స్థానాలను గెలుచుకున్నారు. అయితే తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ-41, పీడీఎఫ్ 36 స్థానాలు సాధించాయి. భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకున్న పీడీఎఫ్ అభ్యర్థి రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీగా చరిత్ర సృష్టించాడు.
అత్యధిక స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు 1952 మార్చి 6న 13 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. రాజ్ ప్రముఖ్‌గా గుర్తింపు పొందిన ఏడవ నిజాం బూర్గులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించాడు.
బూర్గుల ప్రభుత్వ నిర్ణయాలు
జాగీర్ల రద్దును ధ్రువీకరించడం
కౌలుదారీ చట్టాన్ని అమల్లోకి తేవడం
ఇనాం భూముల రద్దు
1953 అక్టోబరులో ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడం
1955 జూలై 1న అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేయడం
1955 డిసెంబరు 10న నందికొండ(నాగార్జున సాగర్) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం
మాతృ భాషలో విద్యా బోధన ప్రవేశపెట్టడం(ఈ విధానాన్ని ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం హైదరాబాద్)
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు ప్రధానంగా గ్రూప్-1 స్థాయి పరీక్ష కోసం సంసిద్ధం అవుతున్న ఉద్యోగార్థులు హైదరాబాద్ రాజ్యం, రాష్ట్రంగా మారిన ప్రక్రియ, రాజకీయ పరిణామాలు, పరిపాలన మార్పులు, ముల్కీలపై, ప్రభుత్వ విధానాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ నేపథ్యంలోనే సాలార్‌జంగ్ నుంచి బూర్గుల రామకృష్ణారావు పరిపాలన విధానాల పరిణామక్రమాన్ని గుర్తించగలగాలి.
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్ డైరెక్టర్,
5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్
Updated Date - 2022-12-21T16:49:17+05:30 IST