ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crisis: సంక్షోభంలో కొలువులు

ABN, First Publish Date - 2022-11-21T03:07:29+05:30

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే కొవిడ్‌ దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్‌, రష్యా యుద్ధ ప్రభావం పడింది! కోరలు చాస్తున్న ఆర్థిక మాంద్యానికి తోడు యుద్ధం, పలు దేశాల్లో విపరీత వాతావరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాంద్యం, యుద్ధం దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు

వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న దిగ్గజ కంపెనీలు

11 వేల మందిని తీసేసిన మెటా.. ట్విటర్‌లో 50ు కోత

10 వేల మందికి ఉద్వాసన పలికేందుకు అమెజాన్‌ రెడీ

మైక్రోసాఫ్ట్‌, డిస్నీ, యాపిల్‌ తదితర సంస్థలదీ అదే దారి

ఉద్యోగాలు కోల్పోతున్నవారిలో ఎక్కువగా భారతీయులు

హెచ్‌-1బీ వీసాపై వచ్చిన కొలువు పోతే పరిస్థితి కష్టమే

అరవై రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోకుంటే ఇంటికే

దేశంలో ఆర్థిక మాంద్యం రాదు.. ఆర్థికవేత్త రాజీవ్‌ కుమార్‌

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే కొవిడ్‌ దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్‌, రష్యా యుద్ధ ప్రభావం పడింది! కోరలు చాస్తున్న ఆర్థిక మాంద్యానికి తోడు యుద్ధం, పలు దేశాల్లో విపరీత వాతావరణ పరిస్థితుల వంటివాటి కారణంగా.. దిగ్గజ కంపెనీలు సైతం కుదేలై ఈ ఉత్పాతం నుంచి బయటపడే ప్రయత్నాలు ప్రారంభించాయి. నిత్యం మనం మీడియాలో చూస్తున్న ఉద్యోగుల తొలగింపు వార్తలన్నీ అందులో భాగమే! ఉదాహరణకు.. కొవిడ్‌ కారణంగా అమెరికాను కమ్మేస్తున్న ఆర్థిక మాంద్యం దెబ్బను తట్టుకోవడానికి ఆ దేశ రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. తాను బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ‘ఫెడరల్‌ ఫండ్‌ రేట్‌ (వడ్డీ రేటు)ను పెంచేసింది. సహజంగానే బ్యాంకులన్నీ ఆ భారాన్ని వినియోగదారులపై వేశాయి. వ్యక్తులకు, కంపెనీలకు తాము ఇచ్చిన, ఇస్తున్న రుణాలపై వడ్డీ రేట్లను పెంచేశాయి. ఈ భారాన్ని తట్టుకోవడానికి ఉత్పత్తి ఆధారిత సంస్థలైన మెటా (ఫేస్‌బుక్‌ మాతృసంస్థ), సీగేట్‌, మైక్రోసాఫ్ట్‌ వంటివి ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి.

ఆ దిశగా వాటికి తోచిన మార్గాల్లో ప్రధానమైనది.. ఉద్యోగుల తొలగింపు. ఈ క్రమంలోనే మెటా సంస్థలో 13ు మంది (11 వేల మందికి పైగా) ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ సీఈవో మార్క్‌ జుకెర్‌బెర్గ్‌ ప్రకటించారు. ఈ 11 వేల మందిలో దాదాపు 1000 మంది భారతీయులు.. వారిలో 300-400 మంది భారత్‌లో పనిచేసేవారే. హార్డ్‌డి్‌స్కలను తయారుచేసే సీగేట్‌ టెక్నాలజీస్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 8% మందిని (దాదాపు 3000 మంది) తొలగించే ప్రణాళికల్లో ఉంది. ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా ఖర్చుల నియంత్రణ పేరుతో 10 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధం కావడమే కాక.. కొత్తగా నియామకాలను సైతం కొన్నాళ్లపాటు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. అమెజాన్‌ తొలగించనున్న ఉద్యోగుల్లో ఎక్కువ శాతం భారతీయులు ఉండనున్నట్టు సమాచారం. వాల్ట్‌డిస్నీ, నెట్‌ఫ్లిక్స్‌ వంటి సంస్థలు కూడా ఉద్యోగాల కోతను షురూ చేశాయి. దిగ్గజ కంపెనీలు ఉద్యమస్థాయిలో చేపడుతున్న ఈ ‘ఉద్వాసనల పర్వం’ కారణంగా ఎక్కువగా నష్టపోయేది భారతీయులేనని ఒక అంచనా. ఆయా కంపెనీల వీసాలపై అమెరికాకు, అలాగే ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఇలా ఒక కంపెనీ ద్వారా హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేసేవారిని ్ఛ కంపెనీ తొలగిస్తే.. వారు 60 రోజుల్లోగా మరో సంస్థలో ఉద్యోగం చూసుకోవాలి. లేనిపక్షంలో స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి.

భారతీయులపై మస్క్‌ దండయాత్ర!

ఉద్యోగాల తొలగింపులో పైన పేర్కొన్న కంపెనీలకు భిన్నమైన కథ ట్విటర్‌ది. ‘‘ఇది దండయాత్ర.. మస్క్‌గాడి దండయాత్ర’’ అంటూ 4400 కోట్ల డాలర్ల సొమ్ము ధారపోసి ఈలన్‌ మస్క్‌ ఆ కంపెనీని కొనుగోలు చేసే సమయానికే ట్విటర్‌ నష్టాల్లో ఉంది! దీనికితోడు ట్విటర్‌ను కొనేయడానికి బ్యాంకుల నుంచి మస్క్‌ దూసి తెచ్చిన అప్పులకు వడ్డీల భారం అధికం కావడంతో.. మస్క్‌ ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకున్న ఉద్యోగుల్లో యాభై శాతం మందిని.. అంటే 3,700 మందికిపైగా ఉద్యోగులను చాలా సింపుల్‌గా ఒక్కసారి తీసేయడంతో గగ్గోలు పుట్టింది. వీరిలో భారతీయులు గణనీయంగా ఉన్నారు. టెస్లా కంపెనీ రాకకు భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెడుతోందన్న కోపమో మరేంటోగానీ.. ట్విటర్‌ సంస్థకు భారత్‌లో ఉన్న మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ విభాగాలను మస్క్‌ పూర్తిగా తొలగించివేశారు. ఆ రెండువిభాగాల్లో ఉన్న 230 మంది ఉద్యోగుల్లో 180 మందిని తీసేశారు. మిగతావారిని వేరే విభాగాల్లో సర్దారు. అలాగే.. ట్విటర్‌ తన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు 5500 మందిలో 4400 మందిని తొలగించివేసింది. ఈ పరిణామాల వల్ల ఎక్కువగా నష్టపోయింది భారతీయులే.

ఒక్క కాగ్నిజెంట్‌లోనే..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నవన్నీ ఉత్పత్తి ఆధారిత కంపెనీలే. సేవల ఆధారిత కంపెనీల్లో.. అందునా భారతదేశానికి చెందిన సర్వీస్‌ బేస్డ్‌ కంపెనీల్లో కొతలు తక్కువ. ఉత్పత్తి ఆధారిత సేవలందించే అమెరికన్‌ కంపెనీల్లో టాప్‌-5.. ఫేస్‌బుక్‌ (మెటా), యాపిల్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌. ఈ ఐదింటినీ కలిపి ‘ఫాంగ్‌ (ఎఫ్‌ఏఏఎన్‌జీ)’ కంపెనీలుగా పిలుస్తారు. అలాగే మనదేశం నుంచి సేవలు అందించే ఐదు సర్వీస్‌ బేస్డ్‌ కంపెనీలు.. విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, హెచ్‌సీఎల్‌. ఈ ఐదింటినీ కలిపి.. ‘విచ్‌ (డబ్ల్యూఐటీసీహెచ్‌)’ కంపెనీలుగా వ్యవహరిస్తారు. వీటిలో కాగ్నిజెంట్‌ ఒక్కటే అమెరికన్‌ బహుళజాతి కంపెనీ. అందుకే, ఆ ఒక్క సంస్థే ఇటీవలికాలంలో.. బ్యాగ్రౌండ్‌ చెక్‌ సరిగా లేదన్న నెపంతో, ఫేక్‌ సర్టిఫికెట్లు, ఫేక్‌ రెజ్యూమే సమర్పించారన్న కారణంతో భారతదేశంలోని 12 వేల మంది ఉద్యోగులను తీసేసింది. ఇలా ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ట్విటర్‌ వంటి కంపెనీల్లో పనిచేస్తూ ఉద్వాసనకు గురైనవారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. వారి నుంచి భారతదేశానికి వచ్చే రెమిషన్స్‌ తగ్గుతున్నాయి. ఫలితంగా ఇక్కడున్న వారి కుటుంబాలపైన, వారి వ్యయసామర్థ్యంపైనా... పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జాగ్వార్‌.. బంపర్‌ ఆఫర్‌..

ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉద్యోగాలు కోల్పోతున్న టెకీలకు చేయూత అందించేందుకు వందేళ్ల చరిత్ర గలిగిన ‘జాగ్వార్‌ లాండ్‌రోవర్‌’ సంస్థ ముందుకొచ్చింది. మొదట్లో ఇది బ్రిటిష్‌ ఆటోమేకర్‌ సంస్థ అయినా.. ప్రస్తుతం దీన్ని మన టాటాలే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సంక్షోభం నేపథ్యంలో ఈ సంస్థ ఒక ప్రకటన చేసింది. అదేంటంటే.. సెల్ఫ్‌ డ్రైవింగ్‌, ఎలక్ట్రిఇఫికేషన్‌, మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ విభాగాలకు చెందిన 800 ఉద్యోగాలు తమ సంస్థలో ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇటీవల కోల్పోయిన టెకీలకు ఇస్తామని ప్రకటించింది. ఇలాగే మరిన్ని కంపెనీలు ముందుకొస్తే.. బాధిత టెకీలకు ఉపశమనమే!!

మనదేశ స్టార్ట్‌పలూ..

ఆర్థిక మాంద్యం వల్ల అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఫండింగ్‌ తగ్గిపోయి, నిధుల కొరత ఏర్పడడంతో.. మనదేశానికి చెందిన 44 స్టార్టప్‌ కంపెనీలు ఈ ఏడాది నవంబరు 5 వరకూ 15,708 మంది ఉద్యోగులను తొలగించాయి. వాటిలో.. బైజూస్‌, కార్స్‌24, ఓలా, మీషో, ఉడాన్‌ వంటి యూనికార్న్‌ కంపెనీలు సైతం ఉండడం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోయిన ఈ 15 వేల మందిలో అత్యధికులు విద్యారంగానికి చెందినవారే కావడం గమనార్హం. బైజూస్‌ సహా 14 ఎడ్‌టెక్‌ కంపెనీలు ఈ ఏడాది 6,898 మంది ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఆ తర్వాత.. వినియోగదారుసేవలు, ఈకామర్స్‌ రంగాలకు చెందిన 26 స్టార్టప్‌ కంపెనీలు 13,529 మంది ఉద్యోగులను తీసేశాయి. తాజాగా జొమాటో సంస్థ కూడా దేశవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 3 శాతం మందిని తొలగించడానికి సిద్ధమైంది. ఆ సంస్థ ఉద్యోగుల సంఖ్య 3800 కాగా.. 2020లో కరోనా సమయంలో 520 మందిని తీసేసింది.

ఆరేళ్లుగా అమెజాన్‌లో.. ఇప్పుడు తీసేశారు

ఆరేళ్లుగా నేను అమెజాన్‌లో పనిచేస్తున్నా. ‘అలెక్సా’ను మేమిక్కడ తొలిరోజుల నుంచి చూస్తున్నాం. అంతాబాగుందనుకుంటున్న దశలో.. ఇటీవలే నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. కలల ఉద్యోగాన్ని కోల్పోయినవారి జాబితాలో నేను కూడా చేరాను. అయితే, నేనిక్కడికి హెచ్‌-1బీ వీసా మీద వచ్చాను. ఇప్పుడు సమయం నాకు చాలా ముఖ్యం. అమెజాన్‌లో పనిచేయడానికన్నా ముందు రెండేళ్లు సిమాంటెక్‌లో పనిచేశాను. నాకు ఎనిమిదేళ్ల ఉద్యోగ అనుభవం ఉంది. నాకు ఇప్పుడు అత్యవసరంగా బ్యాక్‌ఎండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం కావాలి.

- రాజ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇంజనీర్‌

(కొత్త ఉద్యోగం కోసం లింక్‌డ్‌ఇన్‌లో పెట్టిన పోస్టు)

తీసేస్తారనుకోలేదు..

మెటా తొలగించిన 11 వేల మంది ఉద్యోగుల్లో నేనూ ఒకడిని అనే విచారకరమైన సమాచారాన్ని దురదృష్టవశాత్తూ ఇటీవలే అందుకున్నాను. తొమ్మిది నెలల క్రితం నేను మెటాలో చేరినప్పటి నుంచీ అత్యంత సమర్థంగా పనిచేసిన నన్ను ఉద్యోగంలోంచి తొలగిస్తారనుకోలేదు. ప్రస్తుతం నేను హెచ్‌-1బీ వీసాపై ఉన్నాను. 16 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాను. త్వరలో మరో ఉద్యోగం వెతుక్కోకుంటే దేశం వదిలి వెళ్లాల్సిందే. నా పిల్లలు ఇక్కడే పుట్టారు. వారికేమో అమెరికా పౌరసత్వం ఉంది.

- రాజ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

(ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కోల్పోవడంతో

లింక్‌డ్‌ఇన్‌లో ఆయన పెట్టిన పోస్టు)

Updated Date - 2022-11-21T11:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising