UG students: ఇదేం న్యాయం..?
ABN, First Publish Date - 2022-11-12T12:54:50+05:30
నిజాం కళాశాల విద్యార్థినుల విషయంలో అధికారుల తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే వసతి ఉన్న పీజీ
యూజీ విద్యార్థినులపై వివక్ష
కొత్తగా హాస్టల్ నిర్మించినా కేటాయింపులేదు
మంత్రి కేటీఆర్ సూచించినా అధికారుల కిరికిరి
పూర్తిస్థాయిలో వసతి కల్పించాలని ఆందోళనలు
హైదరాబాద్ సిటీ: నిజాం కళాశాల విద్యార్థినుల విషయంలో అధికారుల తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే వసతి ఉన్న పీజీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. తమకు సదుపాయం లేదంటూ రోడ్డెక్కిన విద్యార్థినుల విషయంలో బెదిరింపు ధోరణి అవలంభించడం విమర్శలకు తావిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో రాష్ట్రంలోనే టాప్‌గా నిలిచిన నిజాం కాలేజీలో నిర్మించిన హాస్టల్ భవనంలో వసతి కోసం కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నా.. ఫలితం దక్కడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రితో పాటు ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి సైతం చదువుకున్న కాలేజీలో గ్రామీణ విద్యార్థినులకుహాస్టల్ సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం కల్పించకుండా వివక్ష కొనసాగిస్తున్నారు. సమస్యను ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్తే పోలీసులను పిలిపించి దౌర్జన్యం చేయించారని, విధి లేక ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజాం కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులున్నాయి. యూజీలో 22 డిపార్ట్‌మెంట్లున్నాయి. ఒక్కో గ్రూపులో 30 నుంచి 60 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. ఈ సీట్లను ఏటా దోస్త్ ద్వారా భర్తీ చేస్తున్నారు. పీజీ సీట్లను పీజీసెట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. పీజీసెట్‌లో టాప్ ర్యాంకు వచ్చిన వారు, ఇంటర్‌లో 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే సీట్లు దక్కుతాయి. నిజాం, ఉస్మానియా పీజీ విద్యార్థినులకు కూడా నిజాం కాలేజీలోనే హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నారు. యూజీ బాలురు రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థులకు సెకండియర్ నుంచి హాస్టల్ సదుపాయం ఉంది. కానీ, యూజీ బాలికలకు రెగ్యులర్ కోర్సులు చదివినా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చదివినా హాస్టల్ సదుపాయం లేదు.
విద్యార్థినుల విజ్ఞప్తితో..
హాస్టల్ సదుపాయం లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను కొన్నేళ్లుగా విద్యార్థినులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం రూ.8.30 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణ పనులను హెచ్‌ఎండీఏ చేపట్టింది. గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కొవిడ్-19 కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. 71 గదులతో భవననాన్ని నిర్మించగా, ఒక్కో గది సుమారు 200 చదరపు అడుగులతో ఉంది. ఒక్కో గది నలుగురు విద్యార్థినులకు కేటాయిస్తే 284 మందికి సదుపాయం కల్పించేలా నిర్మించారు. 52 వెస్ట్రన్ టాయిలెట్స్, 49 స్నానపు గదులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మార్చిలో మంత్రి కేటీఆర్ హాస్టల్‌ను ప్రారంభించినా, ఇప్పటి వరకు విద్యార్థినులకు కేటాయించలేదు.
పార్ట్‌టైమ్ పని చేస్తే కానీ..
యూజీ విద్యార్థినులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నారు. కొందరు సంక్షేమ హాస్టళ్లలో వసతి పొందున్నారు. సంక్షేమ హాస్టళ్లూ నిజాం కళాశాలకు దూరంగా ఉండడంతో.. మెజార్టీ విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో నెలకు రూ.5 వేల నుంచి రూ.7వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇతరత్రా ఫీజులు మరో రెండు, మూడు వేల వరకు ఉంటాయి. నిజాం కాలేజీలో చదివే వారు అత్యధికం గ్రామీణ ప్రాంత విద్యార్థులు కావడంతో నెలకు రూ.8వేల వరకు ఖర్చులు చెల్లించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో పార్ట్‌టైమ్‌లో పని చేస్తూ చదువులు కొనసాగిస్తున్నారు.
సరిపోయే పరిస్థితి లేదు.. కానీ..
నిజాం కాలేజీలో ప్రస్తుతం యూజీ విద్యార్థినుల్లో మొదటి సంవత్సరం వారిని మినహాయిస్తే రెగ్యులర్, సెల్ఫ్ పైనాన్స్ కోర్సుల విద్యార్థినులు 604 మంది ఉన్నారు. సెకండియర్ విద్యార్థినులు 248 కాగా, ఫైనలియర్ 247, బీబీఏ, బీసీఏ విద్యార్థినులు 109 మంది ఉన్నారు. హాస్టల్ సదు పాయం కావాల్సిన వారు 350 మంది వరకు ఉంటారు. కొత్తగా ప్రారంభించిన హాస్టల్‌ను పూర్తిగా యూజీ విద్యార్థినులకు కేటాయించినా సరిపోయే పరిస్థితులు లేవు. అయితే.. కొత్తగా నిర్మించిన హాస్టల్‌ను యూజీ విద్యార్థినులకు గాకుండా పీజీలకు కేటాయించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు యూజీ విద్యార్థినులకు సమాచారం అందింది. ఏళ్ల తరబడి హాస్టల్ లేని వారిని వదిలేసి ఇప్పటికే ఓయూలో వసతి పొందుతున్న వారికి కేటాయిచేందుకు చర్యలు తీసుకోవడంపై యూజీ విద్యార్థినులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. పైగా విద్యాశాఖకు యూజీ విద్యార్థినుల సామర్థ్యం, తదితర వివరాలపై ప్రిన్సిపాల్, వీసీలు తప్పుడు నివేదిక అందించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్ తీరుపై నిలదీస్తే పోలీసులను రప్పించి, విద్యార్థినులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. యూజీ విద్యార్థినుల హాస్టల్‌ను వారికే కేటాయిస్తే వివాదం ఉండేది కాదు. అందుకు విరుద్ధంగా ప్రిన్సిపాల్, ఓయూ వీసీలు నిర్ణయం తీసుకోవడంతో ఆందోళనలు చేపట్టాల్సి వచ్చిందని విద్యార్థినులు చెబుతున్నారు.
కేటీఆర్ ట్వీట్..
విద్యార్థుల కోరిక మేరకు హాస్టల్ నిర్మించి అప్పగించాం. ఇది అంత తీవ్రమైన సమస్య కాదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలి.
ప్రస్తుత పరిస్థితి : వారం రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి చర్చలు నిర్వహించారు. ఆందోళన విరమించుకోక పోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిజాం కాలేజీ విద్యార్థినులతో చర్చలు జరిపి పీజీలకు, యూజీలకు 50 శాతం చొప్పున కేటాయిస్తామని, కొత్త హాస్టల్‌పై మరో అంతస్తును ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కానీ మంత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో అదనపు అంతస్తు నిర్మించి పూర్తి స్థాయిలో కేటాయిస్తామనే వివరాలు లేవు. యూజీలకు పూర్తిస్థాయిలో హాస్టల్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టడం లేదు. దాంతో ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థినులు చెబుతున్నారు.
అవసరం లేదంటున్నా..
పీజీ విద్యార్థినులు తమకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికే కేటాయించిన హాస్టల్‌తో ఇబ్బందులు లేవని, పోటీ పరీక్షల సన్నద్ధం నేపథ్యంలో తమకు ఓయూలోనే వసతి కొనసాగించాలని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళారు. వినతిపత్రం కూడా అందించారు. అయినా ఓయూలోని నిజాం పీజీ విద్యార్థినుల వసతిని నిజాం కాలేజీలోని హాస్టల్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది పీజీ విద్యార్థినులు ఓయూ హాస్టళ్లను వదల్లేదు. ఒక్కరిద్దరు మాత్రమే ఇటీవల బ్యాగులు తీసుకొని వచ్చి మళ్లీ వెనుదిరిగి వెళ్ళిపోయారు. పీజీ విద్యార్థులు నిజాం కాలేజీ హాస్టల్‌లో ఉండలేమని, ఓయూలోనే వసతి కొనసాగించాలని కోరుతున్నా, సగం వారికి కేటాయించడం పట్ల యూజీ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినులు సంధిస్తున్న ప్రశ్నలివే..
ఐదేళ్ల క్రితం నిజాం కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ యూజీ విద్యార్థినుల కోసమని హాస్టల్ ప్రకటిస్తే, ఇప్పుడెందుకు మార్పులు చేపట్టారు.?
గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఆసరా ఉండేందుకు మంత్రి కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలిస్తే విద్యాశాఖ అధికారులు భిన్నమైన ధోరణికి గల కారణాలేంటి?
పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న పీజీలు, నిజాం కాలేజీలో హాస్టల్ వసతి వద్ధంటున్నా పట్టుబట్టి మరీ వారికి కేటాయించడమేంటి?
పీజీలకు 50 శాతం, యూజీలకు 50 శాతం కేటాయిస్తే మిగతా వారి పరిస్థితేంటి?
వసతి కావాలని విద్యార్థినులు ఆందోళన చేస్తున్న వేళ మంత్రి కేటీఆర్ స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోమన్న తర్వాత కూడా ఇన్ని తిరకాసులెందుకు?
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరితే క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరించడమేంటి?
డబ్బులు పెట్టి బయట ఉండలేకే..
నిజాం కాలేజీలో పీజీ కంటే యూజీ విద్యార్థులు అధికం. ఇన్ని సంవత్సరాలు హాస్టల్ కోసం ఎదురుచూస్తున్నాం. మమ్మల్ని ఇంకెన్ని రోజులు పక్కన పెడతారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినం. డబ్బులు పెట్టి ప్రైవేటు హాసళ్లలో ఉండలేక ఆందోళన చేస్తున్నాం.
- రక్షిత, యూజీ సెకండియర్.
ఇంకెన్ని రోజులు బయట ఉండాలి..
కొత్త హాస్టల్ పీజీకి, యూజీకి సగం, సగం అంటే మాకు సరిపోదు. వారికీ సరిపోదు. వద్దని పీజీ విద్యార్థినులు అంటుంటే వారికి ఎందుకిస్తున్నారు, ఇంకెన్ని రోజులు మేం బయట ఉండాలి?
- అభినయ, యూజీ ఫైనలియర్
Updated Date - 2022-11-12T13:02:39+05:30 IST