మన ఊరు- మన బడి మార్గదర్శకాలు విడుదల
ABN, First Publish Date - 2022-02-14T00:13:06+05:30
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని పాఠశాలల్లో 33 శాతం అంటే...
అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒకే రంగు
ఈ ఏడాది 181 పాఠశాలల అభివృద్ధి
అత్యధిక సంఖ్యలో విద్యార్థులున్నవి ఎంపిక
ఒకే రోజు నిర్ధేశిత పనులు ప్రారంభం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని పాఠశాలల్లో 33 శాతం అంటే 181 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక నుంచి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒకే రంగు వేయనున్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు రంగువేయడానికి వీలులేదని, నిర్ధేశించిన రంగు మాత్రమే వేయాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు సుమారు 7289 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. పాఠశాలల్లో గల శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి వాటి స్థానంలో కొత్త గదులను నిర్మించడం, ప్రహారీ గోడలు, కిచెన్ షెడ్లు, డైనింగ్ నిర్మాణాలు చేపట్టడం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణాలు, భవనాలకు రంగులు వేయడం, మరమ్మతులు చేయడం, కావాల్సిన ఫర్నీచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్‌బోర్డులు, డైనింగ్ హాల్, డిజిటల్ పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021-22 ఈ విద్యా సంవత్సరం 33 శాతం పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఆయా మండలాలు, పట్టణాల్లో అత్యధిక మంది విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలన్నారు.
మండలానికో ఏజెన్సీ..
పనులు చేసేందుకు గాను ఒక మండలానికి ఒకే ఏజేన్సీని ఏర్పాటు చేయనున్నారు. మొదటి సంవత్సరం గుర్తించిన పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల గురించి అంచనాలు రూపొందించి కలెక్టర్‌కు అందజేయాల్సి ఉంటుంది. గుర్తించినవి సక్రమంగానే ఉన్నాయా, లేదా అని కలెక్టర్, అదనపు కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను ధ్రువీకరించుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రణాళికలు సిద్ధం అయిన తర్వాత చేపట్టాల్సిన పనులను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ప్రారంభించనున్నారు. 30లక్షల రూపాయల వరకు నామినేషన్ పద్ధతిన పనులను కలెక్టర్ ఎవరికైనా కట్టబెట్టవచ్చని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్సీ కాంట్రాక్టర్లు అయితే 10 నుంచి 15శాతం వరకు అడ్వాన్స్‌గా అమౌంట్‌ను ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రతి పాఠశాలల నిర్వహణ కమిటీ రెండు చొప్పున బ్యాంకు ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులను జమ చేయనున్నారు. మరొక ఖాతాలో ప్రజలు, పూర్వ విద్యార్థులు, విద్యాభిమానులు, తదితరులు ఇచ్చే విరాళల సొమ్మును జమచేయాలన్నారు. ఈ ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచి మరిన్ని విరాళాలను ప్రోత్సహించాలన్నారు. ఒక గది నిర్మాణానికి 10 లక్షల విరాళం ఇస్తే ఆ గదికి దాత పేరు పెట్టాలని, 25 లక్షలు ఇస్తే ఆ బ్లాక్‌కు దాత పేరు పెట్టాలని, కోటి రూపాయలు ఇస్తే మొత్తం పాఠశాలకే దాత పేరును పెట్టాలని సూచించింది.
రేపటి నుంచి సమావేశాలు..
పాఠశాలల అభివృద్ధి కోసం ప్రస్తుతానికి ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా కింద ప్రభుత్వం ఇచ్చిన 5 కోట్ల నిధుల్లో 2 కోట్ల నిధులను ఖర్చుచేయనున్నారు. జిల్లా, మండల పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 500 రూపాయల కోట్లు కేటాయించగా, రెండు మాసాల క్రితం 250 కోట్లు ఆయా జిల్లాల జనాభాను బట్టి విడుదల చేసింది. అయితే ఆ నిధులను పాఠశాలల అభివృద్ధికే వినియోగించాలన్నారు. ఇవేగాకుండా నాబార్డు, ఉపాధిహామీ పథకం, ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లను వినియోగించనున్నారు. ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 360 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత, 105 ఉన్నత పాఠశాలలు, మొత్తం 548 పాఠశాలలున్నాయి. వీటిలో 33 శాతం అంటే 181 పాఠశాలలను ఈ విద్యా సంవత్సరంలో పనులను మొదలుపెట్టి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సంసిద్ధం చేయనున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విద్యా, ఆరోగ్య శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తన్నీరు హరీష్ రావులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను, ఎన్‌ఆర్‌ఐలు, పూర్వవిద్యార్థులను భాగస్వాములను చేయాలని, కలెక్టర్లకు పూర్తి బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తుందన్నారు.
Updated Date - 2022-02-14T00:13:06+05:30 IST