Gujarat polls: అసమ్మతి నేతలకు అమిత్‌షా బుజ్జగింపు
ABN, First Publish Date - 2022-11-15T16:59:19+05:30
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రాని నేతల నుంచి నిరసనలు, ఆగ్రహంతో కూడిన ప్రకటనలు వెలువడుతుండటంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలను...
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రాని నేతల నుంచి నిరసనలు, ఆగ్రహంతో కూడిన ప్రకటనలు వెలువడుతుండటంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలను బీజేపీ చేపట్టింది. అసంతృప్తి నేతలంతా బీజేపీ కుటుంబ సభ్యులేనని, వారికి ప్రేమతో నచ్చజెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం. అసంతృప్తి నేతలతో ముఖాముఖీ మాట్లాడేందుకు కూడా ఆయన వ్యూహరచన చేశారు. కొన్ని సీట్లకు సంబంధించి టిక్కెట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తిగా ఉన్న బీజేపీ కార్యకర్తలు గాంధీనగర్‌లోని కమలం ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు వ్యక్తం చేయడంతో అమిత్‌షా తాజా నిర్ణయం తీసుకున్నారు.
గుజరాత్‌లోని 182 మంది అసెంబ్లీ స్థానాలకు గాను ఇంతవరకూ 160 మంది పేర్లను బీజేపీ ప్రకటించింది. 38 మంది ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలికింది. దీంతో పలువురు నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తులు నెలకొన్నాయి. దీంతో పరిస్థితిని చక్కదిద్ది వారితో చర్చిచేందుకు రాష్ట్ర నేతలతో కూడిన ఒక బృందానికి బీజేపీ ఏర్పాటు చేసింది.
కాగా, గుజరాత్‌లో వరుసగా 27 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండటంతో కొద్దిరోజులుగా ఆ పార్టీ ''టెంటర్ లవింగ్ కేర్'' విధానం అనుసరిస్తోంది. రాష్ట్ర హోం మంత్రి హర్ష సంఘ్వి స్వయంగా నలుగురు బీజేపీ రెబల్స్‌తో మాట్లాడి, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ప్రయత్నం ఫలవంతం కాలేదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ టిక్కెట్టుకు నోచుకుని మధుభాయ్ శ్రీవాస్తవ్ తాజా పరిస్థితిపై మండిపడ్డారు. 20 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ, అమిత్‌షా పట్టుబట్టటంతో పార్టీలోకి వచ్చానని, టిక్కెట్ ఇవ్వకున్నా స్వంతత్ర అభ్యర్థిగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పారు.
మరోవైపు, పార్టీలో అసంతృప్తులు తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న అమిత్‌షా రాష్ట్రంలోని పార్టీ అగ్రనేతలతో సమావేశమై, రెబల్స్‌ను బుజ్జగించేందుకు అనుసరించాల్సిన విధానంపై చర్చలు సాగిస్తున్నారు. చాలాకాలంగా పార్టీలోనే ఉన్న వారిపై (రెబల్స్) కనికర దృష్టితో వ్యవహరించాలని, జాగ్రత్తగా పరిస్థితిని హ్యాండిల్ చేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఆయన ఆదేశాలిచ్చారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకున్నాయి. అనంతరం క్రమంలో కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులు, రాజీనామానాలతో బీజేపీ సంఖ్యాబలం 111కు చేరింది. కాగా, గుజరాత్‌లో రెండు విడతలుగా డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి
Updated Date - 2022-11-15T17:01:39+05:30 IST