Gujarat Results: కాంగ్రెస్‌కు పొంచి ఉన్న మరో ముప్పు
ABN, First Publish Date - 2022-12-09T15:07:42+05:30
గుజరాత్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలన కాంగ్రెస్ పార్టీకి మరో ముప్పు పొంచి ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ..
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలన కాంగ్రెస్ పార్టీకి మరో ముప్పు పొంచి ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ తగిన సంఖ్యాబలంతో ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా నిస్సహాయంగా చేతులెత్తేయడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాను కూడా 'గ్రాండ్ ఓల్ట్ పార్టీ' కోల్పోనుంది.
గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలు ఉండగా, 10 శాతం సీట్లు సంపాదించుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా (ఎల్‌ఓపీ) దక్కుతుంది. అంటే 18 సీట్లలో గెలుపు తప్పనిసరి. అనూహ్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుని ప్రతిపక్ష హోదాకు కొద్ది దూరంలో ఆగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాలు మాత్రమే గెలుచుకుని ఆ దరిదాపులకు కూడా రాలేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా, కాంగ్రెస్ 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ఐదేళ్లలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నట్టు తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.
ప్రతిపక్ష హోదాను కోల్పోవడం కొత్తేమీ కాదు..
కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ప్రతిపక్ష హోదాను కోల్పోయిన సందర్భాలు లేకపోలేదు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్ష నేతను పార్లమెంటుకు పంపడంలో విఫలమైంది. 2014లో కేవలం 44 సీట్లు గెలుచుకోగా, 2019లో 52 సీట్లతో సరిపెట్టుకుంది. పార్లమెంటుకు ప్రతిపక్ష నేతను పంపాలంటే తప్పనిసరిగా 55 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నేతను లోక్‌సభకు పంపలేకపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేను ప్రతిపక్ష నేతగా పంపాలని కాంగ్రెస్ గతంలో ప్రయత్నించినప్పటికీ నిబంధనలను ఉటంకిస్తూ ఆ ప్రతిపాదనను అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. 1980, 1984లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పని చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత ప్రత్యర్థి పార్టీలకు ప్రతిపక్ష నేత హోదాను నిరాకరించింది.
Updated Date - 2022-12-09T15:14:05+05:30 IST