Gujarat polls: రావణుడిలా మీకు 100 తలలున్నాయా?: ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-11-29T16:35:30+05:30
ప్రధాన మంత్రి నరేంద్రమోదీని రావణాసురుడితో పోలుస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా..
అహ్మదాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీని 'రావణాసురుడి'తో పోలుస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా వేడిని పెంచాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. 'గుజరాత్ పుత్రుడిని' పదేపదే కాంగ్రెస్ అవమానిస్తోందంటూ మండిపడింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే తాజా వ్యాఖ్యలు చేశారు.
''మోదీ ప్రధాని. ఆయన పనితీరు పక్కనుంచండి. ఆయన కార్పొరేషన్ ఎన్నికల నుంచి, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, ఎక్కడ చూసినా కనబడుతుంటారు. మీరు అందర్నీ పక్కనపెట్టి మోదీని చూసి ఓటేయమని ఆయన పదేపదే చెబుతుంటారు. అభ్యర్థుల ప్రస్తావన ఉండదు. ఎన్నిసార్లు మేము మిమ్మల్ని చూడాలి? మీకు ఎన్ని రూపాలున్నాయి? మీకు రావణుడిలా 100 తలలు ఉన్నాయా?" అని ఖర్గే ప్రశ్నించడంతో ఎన్నికల ప్రచార సభలో నవ్వులు వెల్లివిరిసాయి. ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులు ప్రధాని మోదీ పేరుతో ఓట్లు అడుగుతుంటారని ఖర్గే పేర్కొంటూ... ''మున్సిపాలిటీలకు మోదీ వచ్చి పనిచేస్తారా? మీకు అవసరమైనప్పుడు ఆయన వచ్చి సాయం చేస్తారా?'' అని ప్రశ్నించారు.
పదేపదే అవమానిస్తారా?: అమిత్ మాలవీయ
గుజరాత్ ఎన్నికల వేడిని తట్టుకోలేకనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాటతూలారని, ప్రధాన మంత్రిని రావణునితో పోల్చారని అమిత్ మాలవీయ ఒక ట్వీట్‌లో ఖండించారు. ఖర్గే మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. 'మౌత్ కా సౌదాగర్' నుంచి 'రావణ్' వరకూ కాంగ్రెస్ అనేక సార్లు విమర్శలు చేస్తూ గుజరాత్‌ను, గుజరాత్ పుత్రుడిని పదేపదే అవమానిస్తోందని అన్నారు. 2002 అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని లక్ష్యంగా చేసుకుని 2007 గుజరాత్ ఎన్నికల ప్రచారంలో సోనియాగాంధీ 'మత్యు బేహారి' (మర్చంట్ ఆఫ్ డెత్) అంటూ ఆయనను సంబోధించారు. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2022-11-29T16:35:31+05:30 IST