salary paid: ఒకటినే పడిన వేతనం
ABN, First Publish Date - 2022-11-02T03:59:32+05:30
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందాయి.
యాదాద్రి, నల్లగొండ జిల్లాలకు ప్రత్యేకం
ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆశ్చర్యం
మునుగోడు ఉప ఎన్నికలో మద్దతుకేనా?
రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశం
యాదాద్రి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందాయి. కేవలం ఈ రెండు జిల్లాల్లో పనిచేస్తున్న వారికే వేతనాలు అందడం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఉప ఎన్నికలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల మద్దతు పొందేందుకు ఒకటో తేదీన వేతనాలు అందజేసిందని చర్చించుకుంటున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా ఒకటో తేదీన ఠంచనుగా వేతనాలు అందేవి. మూడేళ్లుగా ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు అందిస్తోంది. రోజుకో రెండు జిల్లాల చొప్పున వేతనాలు అందుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొదటి వారంలో వేతనాలు పడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని జిల్లాల్లో 10వ తేదీ తర్వాత అందుతున్నాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు చెందిన ఉద్యోగులకు నవంబరు ఒకటో తేదీన వేతనాలు అందాయి.
మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అయినట్టు సెల్‌ఫోన్లలో సమాచారం రావడంతో ఇరు జిల్లాల్లోని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. వేతనాలు ఏ రోజు వేస్తారో..? అని ఎదురుచూస్తున్న వారికి ఒకటో తేదీనే ఖాతాల్లో పడిపోవడంతో, ఉద్యోగులంతా ఒకటో తారీఖు వేతనాలు రాక ఎన్నేళ్లు అయిందోనని చర్చించుకుంటున్నారు. మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు.
పలు జిల్లాలకు చెందిన ఉద్యోగులు యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు చెందిన ఉద్యోగులకు ఫోన్లు చేసి వేతనాలు ఒకటో తేదీనే పడ్డాయా? అంటూ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పలు పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేయగా, ఇప్పటికే నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులతో పాటు, సంక్షేమ పథకాలకు చకచకా నిధులు మంజూరు చేస్తోంది. ఉప ఎన్నికతో నియోజకవర్గంలోని పలు సమస్యలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల పెండింగ్ నిధులన్నీ విడుదలయ్యాయి.
Updated Date - 2022-11-02T19:31:05+05:30 IST