Gujarat polls: బీజేపీ మేనిఫెస్టే విడుదల.. ఉమ్మడి పౌరస్మృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన
ABN, First Publish Date - 2022-11-26T14:11:41+05:30
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్..
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat polls) మేనిఫెస్టో (Manifesto)ను భారతీయ జనతా పార్టీ (BJP) శనివారంనాడు విడుదల చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉమ్మడి పౌరస్మృతిని రాష్ట్రంలో అమలు చేస్తామని, మహిళలకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని, రూ.10,000 కోట్లతో అగ్రి-మార్కెటింగ్ ఇన్ఫ్రా, బ్లూ ఎకానమీ ఇండస్ట్రీస్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, ఈడబ్ల్యూఎస్/ఓబీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ వాగ్దానం చేసింది. పేద ప్రజలకు, విద్యకు ప్రత్యేక నిధి కేటాయిస్తామని, ఎయిమ్స్ స్థాయి వైద్య సౌకర్యాల కల్పన, సౌరాష్ట్ర సహా దక్షిణ గుజరాత్‌లో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని హామీ ఇచ్చింది.
మార్పులకు నిలయమైన గడ్డ గుజరాత్ అని జేపీ నడ్డా ఈ సందర్భంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ, ఆయన గుజరాత్ నుంచే తన జర్నీ ప్రారంభించారని చెప్పారు. దేశానికి ఒక రాజకీయ దిశానిర్దేశాన్ని ఇచ్చిన రాష్ట్రం గుజరాత్ అని అన్నారు. గుజరాత్ ప్రగతి కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడల గమ్యస్థానంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్ ఎకానమీకి చేరుస్తామని, టెర్రరిస్టు సంస్థల స్లీపర్ సెల్స్, భారత వ్యతిరేక శక్తులను గుర్తించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే వారి కోసం కఠిన చట్టం తెస్తామని, సంఘ వ్యతిరేక శక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
రెండు దశాబ్దాలుగా గుజరాత్ ప్రజల ప్రమాభిమానాలను బీజేపీ ఎంతగానే చూరగొందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఉత్తుత్తి హామీలు కావని, పీఎం మోదీ నిర్దేశించిన విధంగా రూపొందించిన అభివృద్ధి రోడ్ మ్యాప్ అని అన్నారు. ఇందుకు తాము కట్టుబడి ఉంటామని, అమలుకు సాధ్యమైన హామీలు మాత్రమే తాము ఇస్తామని చెప్పారు.
కాగా, 27 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలన చేసిన బీజేపీ మరోసారి అధికారాన్ని ఆశిస్తుండగా, ఓటర్లు ఈసారి మార్పు కోరుతున్నారనే ప్రచారం కూడా బలంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2002 నుంచి 2014 వరకూ గుజరాత్ అభివృద్ధి నమూనా పేరుతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2014లో ప్రధానిగా ఎన్నికైన తర్వాత కూడా బీజేపీకి చెందిన పలువురు సీఎంలుగా పాలన సాగించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల అనంతరం 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఆప్ పోటీ పడుతోంది. 182 మంది సభ్యుల అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2022-11-26T14:11:44+05:30 IST