Gujarat Victory: పెద్దల సభలో అనూహ్యంగా పెరగనున్న బీజేపీ బలం
ABN, First Publish Date - 2022-12-09T13:08:03+05:30
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్ బలాబలాల్లో మార్పులు రానున్నాయా? ఇప్పటికిప్పుడు..
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్ బలాబలాల్లో మార్పులు రానున్నాయా? ఇప్పటికిప్పుడు ఆ ప్రభావం ఉండదనే చెప్పాలి. కానీ, గుజరాత్‌లో బీజేపీ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 156 స్థానాలు ఎగరేసుకుపోవడం మాత్రం రాజ్యసభలో ఆ పార్టీ మరో రికార్డు సాధించేందుకు మార్గం సుగమం చేసింది. గుజరాత్ అసెంబ్లీలో సాధించిన ఘనవిజయం, సంఖ్యాబలం ఆధారంగా 2026 ద్వితీయార్ధం నాటికి గుజరాత్‌కు చెందిన మొత్తం 11 రాజ్యసభ స్థానాలు బీజేపీ ఖాతాలోకి వచ్చి చేరడం ఖాయమనే చెప్పాలి.
ప్రస్తుతం గుజరాత్ నుంచి బీజేపీకి 8 మంది రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్‌కు ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 2024 ఏప్రిల్‌లో ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో సంఖ్యా బలం ఆధారంగా గుజరాత్ నుంచి మరో రెండు సీట్లు బీజేపీ సొంతం చేసుకోగలుగుతుంది. దీంతో బీజేపీ గుజరాత్ రాజ్యసభ సభ్యుల బలం10కి చేరుతుంది. 2026లో జరిగే ఎన్నికలో మరో సీటును కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో మొత్తం రాష్ట్రానికి చెందిన 11 సీట్లు కూడా బీజేపీ ఖాతాలోకి వచ్చి చేరుతాయి.
హిమాచల్ ప్రదేశ్ పరంగా చూసినప్పుడు, ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ సీట్లు బీజేపీకే ఉన్నాయి. వీటిలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సీటు కూడా ఉంది. 2024 ఏప్రిల్‌లో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఆ ప్రకారం 2024లో కాంగ్రెస్ ఒక సీటు పొందగలుగుతుంది. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2026 ఏప్రిల్ నాటికి మరో సీటును కాంగ్రెస్ సొంతం చేసుకోగలుగుతుంది. మూడో సీటు భవిష్యత్ ఏమిటనే వచ్చే అసెంబ్లీ తర్వాతే తేలుతుంది. 2028లో మాత్రమే ఈ సీటుకు ఖాళీ ఏర్పడుతుంది.
Updated Date - 2022-12-09T13:08:05+05:30 IST