Munugode: నెల రోజుల్లో మునుగోడులో భారీగా మద్యం విక్రయాలు... అవాక్కయిన అధికారులు..!
ABN, First Publish Date - 2022-11-05T20:20:32+05:30
మునుగోడు (Munugode) నియోజకవర్గంలోని 7మండలాల్లో గత నెల రోజుల వ్యవధిలో రూ.37.38 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్నికల కమిషన్‌కు నివేదించారు.
మునుగోడు: మునుగోడు (Munugode) నియోజకవర్గంలోని 7మండలాల్లో గత నెల రోజుల వ్యవధిలో రూ.37.38 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. గతేడాది ఇదే నెలలో రూ.28.23కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు నివేదించారు. గతేడాది అక్టోబరుతో పోలిస్తే సుమారు రూ.9కోట్లమేర మద్యం విక్రయాలు పెరిగాయి. నియోజకవర్గం మొత్తంలో ఎన్నికల వేళ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్ మండలంలో రూ.17.31కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా, అత్యల్పంగా నాంపల్లి మండలంలో రూ.3.08కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు నియోజకవర్గానికి వచ్చే క్రమంలో వెంట తెచ్చుకున్న స్కాచ్, సింగిల్ మాల్ట్ మద్యం విలువ రూ.15కోట్ల వరకు ఉండవచ్చని స్థానిక అధికారుల అంచనా. ఓటుకు రూ.4వేల వరకు గిట్టుబాటు అవుతుండటంతో ఓటర్లంతా నేతలను డిమాండ్ చేసే అంశంపైనే శ్రద్ధ పెట్టారు తప్ప.. తక్కువ ఖర్చులో అందుబాటులోకి వచ్చే క్వార్టర్ మద్యం సీసాపై ఈసారి ఓటరు దృష్టి పెట్టలేదు. దీంతో మద్యం అమ్మకాల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదని, పోలింగ్‌కు చివరి మూడు రోజుల్లోనే మద్యం విక్రయాలు పెద్ద మొత్తంలో జరిగాయని అధికారులు తెలిపారు.
గతేడాది అక్టోబరు మాసంలో విక్రయాల మొత్తం రూ.28.23 కోట్లుగా ఉంది. ఆ సమయంలో హైవే వెంట ఉన్న మునుగోడు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు అక్రమ పద్ధతుల్లో మద్యం సరఫరా కావడంతోనే నాటి సేల్స్ అధికంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. గతేడాది అక్టోబరులో ఏపీలో మంచి బ్రాండ్ అందుబాటులో లేకపోవడం, ఎన్నడూ చూడని బ్రాండ్లకు విపరీతమైన ధరలు ఉండటం మూలంగా తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో మద్యం ఆంధ్రాకు తరలిందని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లా ఏపీకి సరిహద్దులో ఉండటం అక్కడి వారు ఈ జిల్లాలో షాపులు దక్కించుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు పడవల్లో కృష్ణానది మీదుగా, ఆర్టీసీ బస్సుల్లో పెద్దఎత్తున మద్యం సరఫరా చేసినట్టు తెలుస్తోంది.
Updated Date - 2022-11-05T20:20:34+05:30 IST