Himachal pradesh: కాంగ్రెస్ అంటే...అస్థిరత, అవినీతి: మోదీ
ABN, First Publish Date - 2022-11-09T14:10:33+05:30
కాంగ్రా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు కొత్త అర్ధాలు చెప్పారు. కాంగ్రెస్ అంటేనే 'అస్థిరత' అని..
కాంగ్రా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు కొత్త అర్ధాలు చెప్పారు. కాంగ్రెస్ అంటేనే 'అస్థిరత' అని, అవినీతి, కుంభకోణాలు ఖాయమని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్‌లో ఎప్పుడూ స్థిరమైన పాలనను కాంగ్రెస్ ఇవ్వలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్‌కు రెండే రెండు రాష్ట్రాలు...రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మిగిలాయని, అక్కడ అభివృద్ధికి సంబంధించిన వార్తలే వినిపించవని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్‌కు ఇవాళ సుస్ధిర ప్రభుత్వం కావాలని, హిమాచల్ ప్రదేశ్‌లో పటిష్ట ప్రభుత్వం ఉంటే, డబుల్ ఇంజన్ పవర్‌తో అన్ని సవాళ్లను అధిగమించి సరికొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. శక్తిపీఠాల భూమి కాంగ్రా అని, భారతదేశ విశ్వాసాలు, ఆధ్యాత్మికతను తెలియజెప్పే యాత్రాస్థలి అని అన్నారు. రాజ్‌నాథ్ నుంచి కాఠ్‌గఢ్ వరకూ బాబా బోలే (శివుడు) మనతోటే ఉన్న అనుభూతి కలుగుతుందని అన్నారు.
5జిపై..
భవిష్యత్తు 5G దేనని ప్రధాని అన్నారు. హిమాచల్ యువత, ప్రజల భవిత 5జితో కొత్త పుంతలు తొక్కునుందని, దీంతో మారుమూల పాఠశాల్లోనూ సిటీల తరహాలో విద్య అందుతుందని చెప్పారు. ఈసారి ఉత్తరాఖండ్‌లో మార్పు చోటుచేసుకుందని, బీజేపీ గెలిచిందని, యూపీలో కూడా 40 ఏళ్ల చరిత్రలో పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి బీజేపీ ఘన విజయం సాధించిందని చెప్పారు. కాగా, నవంబర్ 12 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలాతాలు ప్రకటించనున్నారు.
Updated Date - 2022-11-09T14:10:34+05:30 IST