Munugode By Election: ‘మునుగోడు‘ వెలవెల
ABN, First Publish Date - 2022-11-05T21:40:17+05:30
నిన్న, మొన్నటి వరకు కళకళలాడిన మునుగోడు (Munugode) పల్లెలు, పట్టణాలు మూగబోయాయి.
నల్లగొండ: నిన్న, మొన్నటి వరకు కళకళలాడిన మునుగోడు (Munugode) పల్లెలు, పట్టణాలు మూగబోయాయి. ఖరీదైన కార్లతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లతో, కళాకారుల డప్పుచప్పులు, కోలాటాలు, నృత్యాలు ఏ పల్లె చూసినా జనమంతా రోడ్లపైనే ఏదో ఉద్యమానికి బయల్దేరుతున్న విధంగా గ్రామాల్లో మహిళలు ఏదో ఒక పార్టీ జెండా పట్టుకుని పెద్ద సంఖ్యలో వరుసగా నిలబడి ర్యాలీగా వెళ్లడం కనిపించేది. తాము పట్టుకున్న పార్టీ జెండాతో తమ అభ్యర్థిని గెలిపించాలంటూ నినాదాలు ఇస్తుండేవారు. ఆ గుంపు కొద్దిగా కదలగానే అదే గ్రామంలో మరో గుంపు ఇంకో పార్టీ జెండాతో ర్యాలీగా బయల్దేరుతుండేవారు. ఒక్కో గుంపులో 50 నుంచి 100 మంది వరకు పాల్గొంటూ నినాదాలతో ముందుకు సాగుతుండేవారు. ఇళ్లకు తాళాలు వేసి ఊరంతా ఆడ, మగ అనే తేడా లేకుండా కలియతిరిగేవారు.
ఉదయం 7గంటల కల్లా సిద్ధమై ఇంటిల్లిపాది రోడ్డెక్కితే పార్టీ నేతలు ఏర్పాటు చేసిన టిఫిన్, టీ తీసుకున్న అనంతరం ర్యాలీ నిర్వహించి మధ్యాహ్నం చక్కటి భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ సాయ్రంతం ముమ్మరంగా ప్రచారం చేసేవారు. రాత్రి అయితే మగవారికి మందు పోసేవారు. ఆలుమగల చేతికి రోజు టెంచన్‌గా చేతిలో డబ్బులు పడేది. ఇంటింటికీ నేతల రాకతో పాటు జెండాలతో పండుగ వాతావరణం నెలకొని ఉండేది. రాత్రి 8గంటలు కాగానే గాఢ నిద్రలోకి వెళ్లే పల్లెలు అర్ధరాత్రి అయినా కూడా ఆయా పల్లెల్లో రాజకీయ వాతావరణం కనిపించేది. ఎక్కడ చూసినా లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్న సందర్భాలు ఉండేవి. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ అదనంగా 250 బస్సులు నడపగా సుమారు రూ.2కోట్ల ఆదాయం సమకూరింది. కాగా, ఉప ఎన్నిక పోలింగ్ ముగియడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఆ దృశ్యాలు నేడు కనుమరుగయ్యాయి.
Updated Date - 2022-11-05T21:40:19+05:30 IST