ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానా కాలం.. జర భద్రం! జలుబు, దగ్గు వేధిస్తే..!

ABN, First Publish Date - 2022-07-12T16:28:19+05:30

వానలు దంచేస్తున్నాయి. ఈ కాలంలోని చల్లని వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఏమరుపాటుగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వానలు దంచేస్తున్నాయి. ఈ కాలంలోని చల్లని వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఏమరుపాటుగా ఉంటే అనారోగ్యాలనూ తెచ్చి పెడుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తదనుగుణంగా జాగ్రత్తగా నడుచుకోవాలి. 


వానాకాలం ప్రభావం మూలంగా త్రిదోషాల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ ఉంటాయి. మరీముఖ్యంగా ఈ కాలంలో  వాత, పిత్త దోషాలు కలిగిన వారికి వివిధ రకాల రుగ్మతలు తిరగబెడుతూ ఉంటాయి.


వాత: వర్షాకాలంలోని ఆమ్లసహిత వాతావరణం మూలంగా, వాతం పెరిగి, జీర్ణశక్తి సన్నగిల్లుతుంది.

పిత్త: వానాకాలంలో క్షీణించిన జీర్ణశక్తి మూలంగా వేడి పెరగడంతో పాటు, పిత్తం కూడా పెరుగుతుంది. వానాకాలం చల్లని వాతావరణంతో పాటు, ఆ లక్షణాలు ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాయి.


కాబట్టి వర్ష రుతువులో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం మూలంగా ఈ కాలంలో కొన్ని రకాల సమస్యలు విపరీతంగా వేధిస్తాయి. కాబట్టి వాతం, పిత్తాలను సమతుల్యం చేసే ఆహారపుటలవాట్లు, జీవనశైలి మార్పులను స్వాగతించాలి. లేదంటే వర్ష రుతువులో వేధించే టైఫాయిడ్‌, కలరా, కామెర్లు, జలుబు, దగ్గు మొదలైన ఇబ్బందులు తప్పవు. ఈ రుగ్మతలు దరి చేరకుండా ఉండాలంటే అభ్యంగనం లేదా నూనెతో మర్దన, స్వేదనం, బస్తి చికిత్సలను క్రమంతప్పక అనుసరించాలి.


జలుబు, దగ్గు వేధిస్తే....

వర్షాకాలం జలుబు, దగ్గు అత్యంత సహజం. ఈ రుగ్మతలను తేలికగా వదిలించుకోవాలంటే....


  • కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు దాల్చినచెక్క పొడి, అర చెంచా తేనెలను కలిపి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.
  • రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. వేడినీళ్లు జలుబు, దగ్గు, గొంతునొప్పులకు కారణమయ్యే వైర్‌సలతో పోరాడే శక్తినిస్తాయి. అలాగే శరీరంలోని ఇన్‌ఫెక్షన్లను బయటకు తోలి, శరీరానికి సరిపడా హైడ్రేషన్‌ను అందిస్తాయి. 
  • రోజుకొక ఉసిరి కాయ తింటూ ఉన్నా కాలేయం ఆరోగ్యం భేషుగ్గా ఉండి, రక్త ప్రసరణ మెరుగై వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ పొందగలుగుతాం!
  • అవిసె గింజలను నీళ్లలో చిక్కబడేవరకూ ఉడికించి, వడకట్టాలి. ఈ కషాయంలో నిమ్మరసం, తేనెలను కలిపి తీసుకున్నా జలుబు, దగ్గులు తగ్గుతాయి.
  • నల్లమిరియాలు, బెల్లం, జీలకర్ర నీళ్లలో మరిగించి, తీసుకున్నా జలుబు, దగ్గు వల్ల పట్టేసిన ఛాతీ వదులై ఊపిరి అందుతుంది.
  • క్యారట్‌ రసం తాగడం వల్ల జలుబు దరి చేరకపోగా, వచ్చిన జలుబు కూడా త్వరగా తగ్గిపోతుంది.


జ్వరాలు బలాదూర్‌

ఆయుర్వేదం జ్వరాలను రెండు రూపాల్లో అంచనా వేస్తుంది. జ్వరాన్ని జ్వరంగానూ లేదా ఇతర రుగ్మతల లక్షణంగానూ పరిగణించి, తదనుగుణ చికిత్స అందిస్తే రుగ్మత అదుపులోకి వస్తుంది. రుతువును బట్టి ఆ కాలంలో వచ్చే జ్వరాలకు ఆయుర్వేదంలో వేర్వేరు పేర్లు ఉన్నాయి. వర్ష రుతువులో వచ్చే జ్వరాలకు ఆయుర్వేదంలో ‘వతజ జ్వరం’ అని పేరు. ఈ జ్వరాలకు ఆయుర్వేదంలో చక్కని చిట్కాలు ఉన్నాయి.


  • గ్లాసుడు నీళ్లలో చిటికెడు దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాలపొడి కలిపి వేడి చేసి, నిమ్మరసం కలుపుకుని తాగితే జ్వరంతోపాటు, గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.
  • జీలకర్ర అద్భుతమైన యాంటీసెప్టిక్‌! జీలకర పొడి కలిపి మరిగించిన నీటిలో తేనె కలుపుకుని తాగితే వర్షాకాల సంబంధ జ్వరాలు తగ్గుముఖం పడతాయి.
  • జ్వరంతో పాటు విపరీతమైన జలుబు, దగ్గు కూడా ఉంటే గోరువెచ్చని తేనెలో పావు చెంచా దాల్చిన చెక్క పొడి కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.


డెంగ్యు జ్వర చికిత్స!

ఆయుర్వేదంలో ఈ జ్వరాన్ని ‘దండక జ్వరం’ అంటారు. ఈ జ్వరం వేధిస్తున్నప్పుడు తేలికగా అరిగే గంజి ఆహారంగా ఇవ్వాలి. తులసి, యాలకులు వేసి కాచిన కషాయాన్ని ఇవ్వాలి. కారాలు, నూనెలు తగ్గించి వండిన ఆహారం ఇవ్వాలి. పునర్వవ మూలికతో తయారైన కషాయంతో డెంగ్యు జ్వరం అదుపులోకి వస్తుంది. అలాగే వ్యాధినిరోధకశక్తిని పెంచడం ద్వారా పరోక్షంగా ఈ జ్వరం తగ్గేలా చేయవచ్చు. కాబట్టి రోగనిరోధశక్తిని పెంచే తులసి నీళ్లను రోజంతా తాగించాలి. అలాగే రోజు మొత్తంలో 10 నుంచి 15 తులసి ఆకులు నమిలించాలి. డెంగ్యు జ్వరాన్ని తగ్గించే ‘ధతుర’ మూలికను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. మెంతి ఆకులతో తయారుచేసిన తేనీరు తాగుతూ, ద్రాక్ష, దానిమ్మ రసాలు తీసుకున్నా డెంగ్యు జ్వరం తగ్గుముఖం పడుతుంది.


ఆయుర్వేద చికిత్సలతో అడ్డుకట్ట 

‘రుతువుల సంగమ సమయంలోనే అన్ని వ్యాధులూ మొదలవుతాయి’ అని చరక సంహితం చెబుతోంది. కాబట్టే వర్ష రుతువు ప్రారంభంలో రుతుసంబంధ రుగ్మతలు మొదలవుతాయి. వాటిని ఆయుర్వేద వైద్యంతో నియంత్రిస్తూనే, సమర్థంగా అదుపులో ఉంచే వీలుంది.


అభ్యంగ: సాధారణంగా మనం ఇంట్లో కూడా తైల మర్దన చేసుకుంటూ ఉంటాం. దీని ప్రధమ ఉద్దేశం రక్తప్రసరణ పెరుగుదల, కండరాలు, చర్మ పటుత్వాలే! మర్దన వల్ల శరీరంలోని మలినాలు కూడా విసర్జితమై శక్తి పెరుగుతుంది. కమ్మని నిద్ర పడుతుంది. ఇలా ఒళ్లంతా నూనె పట్టించి మర్దనా చేసి, సున్ని పిండితో రుద్ది స్నానం చేసే పద్ధతిని ఆయుర్వేదంలో ‘అభ్యంగనం’ అంటారు. ఇది ఎవరైనా చేయొచ్చు. అయితే ఆయుర్వేద చికిత్సలో భాగంగా పూర్వకర్మ అభ్యంగనను మున్ముందు చికిత్సకు శరీరాన్ని సంసిద్ధం చేయడం కోసం చేస్తారు. 

ఉద్వర్తనం: ఈ మర్దన పురుషుల కోసం ఉద్దేశించినది. ఏమాత్రం తడి లేకుండా పూర్తిగా చూర్ణాలతో సాగే ఈ మర్దన సున్నిత చర్మం కలిగి ఉండే మహిళలకు పనికి రాదు. కాబట్టి ఉద్వర్తనం మినహా ఉద్ఘర్షనం, ఉత్సాదనం మర్దనలు మాత్రమే మహిళలకు ఉద్దేశించినవి. పిల్లల చర్మం మరింత సున్నితంగా ఉంటుంది కాబట్టి పూర్తి నూనెలతో సాగే ఉత్సాదనం మర్దన ఒక్కటే వారికి అనుసరించవలసి ఉంటుంది. ఈ చికిత్సతో రక్తప్రసరణ, మెటబాలిక్‌ రేట్‌ (శరీరం శక్తిని ఖర్చు చేసే వేగం), మరీ ముఖ్యంగా కొవ్వు కరిగే వేగం పెరుగుతాయి. 

ఉద్ఘర్షణం: ఇది తడి చూర్ణాలతో చేసే మర్దన. కీళ్ల దగ్గర వృత్తాకారంలో, ఎముకల దగ్గర పొడవుగా సాగే ఈ మర్దన రెండు రకాల మర్దన పద్ధతుల్లో సాగుతుంది. కఫ తత్వ లక్షణాలైన అధిక బరువు, ఒంట్లో నీరు నిల్వ ఉండిపోవడం, నిస్తేజం, రక్తప్రసరణ లోపం ఉన్న వారికి ఉద్ఘర్షణం వల్ల ఫలితం ఉంటుంది. దీర్ఘకాలంలో శరీరంలోని కలుషితాలన్నీ విరిగి రక్తప్రవాహంలో కలుస్తాయి. ఫలితంగా కొవ్వు కూడా కరగడం మొదలు పెడుతుంది. ఉత్సాధనం: వేర్వేరు నూనెల మిశ్రమంతో చేసే మర్దన

శిరోధార: ఈ చికిత్సలో శరీరానికి తైల మర్దన చేసి, ఆ తర్వాత నుదుటి మీద తైలం చుక్కలుగా పడే చికిత్స చేస్తారు. ఇలా నూనె నేరుగా నుదుటి మీద పడడం వల్ల మెదడులోని పిట్యూటరీ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. శిరోధార చికిత్సను క్రమంతప్పక తీసుకుంటే మెదడులో సెరటోనిన్‌, డోపమైన్‌ హార్మోన్లు సక్రమంగా స్రవిస్తాయు. పార్కిన్సన్‌ రుగ్మతలో డోపమైన లెవెల్స్‌ తగ్గుతాయి. అలాంటివాళ్లకి ఈ చికిత్స ఫలితమిస్తుంది. శిరోధార వల్ల కార్టిసాల్‌, సెరటోనిన్‌ స్రావాలు మెరుగవుతాయి. కాబట్టి ఒత్తిడి వల్ల తలెత్తే రుగ్మతలకు ఈ చికిత్స చక్కని ఫలితాలనిస్తుంది. నిద్రలోపం కూడా తొలగుతుంది.

కషాయధార: చూర్ణాలతో తయారైన కషాయాన్ని శరీరం మీద ఒంపి, నొప్పులు, వాపులను తొలగించే చికిత్స ఇది. సమమైన వేడితో ఉన్న కషాయాన్ని శరీరం మీద, రెండు వైపులా ఒకే దిశలో పోస్తూ ఈ చికిత్స చేస్తారు. వాపులు, నొప్పులు ఉన్నప్పుడు ఈ చికిత్స చేయుంచుకోవడం వల్ల కషాయంలోని మూలికలు ఆ నొప్పులకు కారణాలను నేరుగా చేరుకుని చికిత్స చేస్తాయి. ఊపిరితిత్తుల్లో, పొట్టలో నీరు పేరుకుపోయే ఎడిమా సమస్యకూ ఈ చికిత్స చక్కని ఫలితం ఇస్తుంది






కషాయాలతో వర్ష రుతువు రుగ్మతలు దూరం! 

మూలికలు, పత్రాలు, సుగంధద్రవ్యాలతో తయారయ్యే కషాయాలు వర్ష రుతువు వేధించే పలు రుగ్మతలకు దివ్యౌషధంలా పని చేస్తాయి. అవేంటంటే...

రోగనిరోధకశక్తి: ఈ రుతువులో సన్నగిల్లే వ్యాధినిరోధకశక్తిని మెరుగు పరుచుకోవడం కోసం యాలకులు, దాల్చినచెక్క, తెల్ల మిరియాలు వేసిన నీటిని మరిగించి తాగాలి. రుచి సహించకపోతే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ కషాయం ప్రతి రోజూ తీసుకుంటే వ్యాధినిరోధకశక్తి మెరుగ్గా ఉండి, వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

అజీర్తి: వానాకాలం తగ్గే అజీర్తిని సరిచేయడం కోసం నీటిలో వాము, సోంపు వేసి మరిగించి, తేనె కలిపి తీసుకోవాలి. భోజనం చేసిన ప్రతిసారీ ఈ కషాయం తాగుతూ ఉంటే, అజీర్తి సమస్య తలెత్తదు.

సాధారణ జ్వరం: ఏడు తులసి ఆకులు, ఐదు లవంగాలు తీసుకుని దంచాలి. వీటిని మరిగించిన నీటిలో కలిపి, కొద్దిగా సముద్రపు ఉప్పు చేర్చి, రెండు రోజులపాటు రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేస్తే వర్ష రుతు సంబంధ సాధారణ జ్వరాలు తగ్గుతాయి.



Updated Date - 2022-07-12T16:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising