10మంది నిరసనకారులను కాల్చేశారు
ABN, First Publish Date - 2022-11-06T03:19:02+05:30
ఇరాన్‌లో నిరసకారులను కాల్చి చంపడంపై మానవహక్కుల సంస్థలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి.
ఇరాన్ పోలీసులపై మానవ హక్కుల సంస్థల ఆరోపణలు
టెహ్రాన్, నవంబరు 5: ఇరాన్‌లో నిరసకారులను కాల్చి చంపడంపై మానవహక్కుల సంస్థలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. ఆందోళనకారులపై ఇరాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలపై పోలీసులు కాల్పులు జరిపినట్లు అమ్నెస్టీ తెలిపింది. ఈ కాల్పుల్లో కొంతమంది పిల్లలు సహా పది మంది ప్రాణాలు కోల్పోయారని భారీ సంఖ్యలో పౌరులు గాయపడ్డారని పేర్కొంది. ఖాష్‌లోని ప్రభుత్వ భవనాలపై నుంచి భద్రతా బలగాలు పౌరులపైకి నేరుగా కాల్పులు జరిగాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. దీనికి సంబంధించి రక్తపు గాయాలతో ఉన్న బాధితుల వీడియోలను నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ మానవ హక్కుల సంస్థ విడుదల చేసింది. పౌరులను చంపాలన్న లక్ష్యంతో భద్రతా బలగాలు వారిపైకి కాల్పులు జరిపాయని లండన్ కేంద్రంగా పనిచేసే బలూచ్ ఉద్యమకారుల సంస్థ ప్రకటించింది. ఇదే కాల్పులు, నిరసనలపై ఇరాన్ అధికారిక మీడియా కూడా స్పందించింది. నిరసనకారులు విసిరిన రాళ్లతో చాలామంది పోలీసులు గాయపడ్డారని దాంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని కథనాలను ప్రసారం చేసింది.
Updated Date - 2022-11-06T03:19:04+05:30 IST