నవీన్ రెడ్డి కారు లభ్యం
ABN, First Publish Date - 2022-12-13T03:47:40+05:30
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దంత వైద్యురాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి కారు లభ్యమైంది.
కారులో మద్యం బాటిళ్లు, యువతి దుస్తులు
అతడి ఆచూకీ కోసం సాగుతున్న గాలింపు
ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టు అనుమానం
నవీన్‌పై గతంలోనే రెండు కేసులు నమోదు
ఆదిభట్ల, డిసెంబరు 12: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దంత వైద్యురాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి కారు లభ్యమైంది. నవీన్ ఆ కారును రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద ఓవెంచర్‌లో వదిలి వెళ్లినట్లు సోమవారం సాయంత్రం ఆదిభట్ల పోలీసులు గుర్తించారు. కారులో మద్యం బాటిళ్లు, యువతికి సంబంధించిన దుస్తులు లభ్యమైనట్లు తెలిపారు. నవీన్ రెడ్డి తన కారును అక్కడ వదిలేసి.. పక్కనే ఉన్న ఓయో హోటల్‌లో బస చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హోటల్‌లో బస చేస్తే గదిని బుక్ చేసింది ఎవరు? ఏ వ్యక్తి గుర్తింపు కార్డు ద్వారా అక్కడ బస చేశారు. అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కణ్నుంచీ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఇతర రాష్ట్రాలకు పారి పోయి ఉంటాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నవీన్‌రెడ్డి పరారీలో ఉండి బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నాడా? లేక.. కనపడకుండా పోవడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేదీ పోలీసులు విచారిస్తున్నారు.
కాగా, ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, నిందితుణ్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నవీన్‌రెడ్డిని గాలించడానికి నాలుగు బృందాలు తిరుగుతున్నాయని.. వారిని పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కేసులో 32 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. నవీన్‌రెడ్డిని, అతడి ప్రధాన అనుచరుడైన రూబిన్‌తో పాటు చందు, సిద్దు అనే మరో ఇద్దరిని పట్టుకోవడానికి రాచకొండ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో నాలుగు పోలీసులు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
లొకేషన్ ఆధారంగా పట్టుబడకుండా ఉండేందుకు వారు తమ దగ్గర ఉన్న సిమ్‌లు పూర్తిగా ధ్వంసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, నవీన్‌రెడ్డిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు ఆదిభట్ల పోలీసులు గుర్తించారు. గతంలో అతడిపై వరంగల్ జిల్లా ఇంతియార్ పోలీ్‌సస్టేషన్‌లో 2019లో చీటింగ్, ఐటీ సెక్షన్ల కింద రెండు కేసులు.. హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీ్‌సస్టేషన్‌లో రోడ్డు యాక్సిడెంట్ కేసులు నమోదయినట్లు తెలిపారు. అతడిపై పీడీయాక్టు నమోదు చేయడానికి రాచకొండ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. యువతిని రక్షించిన సమయంలోనే పోలీసులు నవీన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అతడి వద్ద కీలక సమాచారం రాబట్టిన తర్వాతే అరెస్టు చేసినట్లు వెల్లడించే అవకాశం ఉంది.
Updated Date - 2022-12-13T03:47:42+05:30 IST