Iran: దేశాన్ని మీరు నాశనం చేస్తున్నారు.. వెళ్లిపోండి ఇక్కడి నుంచి: మతపెద్దలపై మహిళల ఫైర్
ABN, First Publish Date - 2022-11-10T20:57:44+05:30
‘ఇది మా దేశం. ఇక్కడ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పడానికి మీరెవరు? ఈ దేశాన్ని మీరే నాశనం చేస్తున్నారు. మూటాముల్లె సర్దుకుని
టెహ్రాన్: ‘ఇది మా దేశం. ఇక్కడ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పడానికి మీరెవరు? ఈ దేశాన్ని మీరే నాశనం చేస్తున్నారు. మూటాముల్లె సర్దుకుని ఇక్కడి నుంచి పొండి’ అంటూ ఇరాన్ (Iran) మతపెద్దల (Clerics)పై మహిళలు విరుచుకుపడుతున్నారు. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో 22 ఏళ్ల మాసా అమిని (Mahsa Amini)ని నైతిక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మరణించడంతో వెల్లువెత్తిన నిరసనలు దేశం మొత్తం పాకిపోయాయి. హిజాబ్ (Hijab)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లను తగలబెట్టారు.
ఇరాన్‌లో నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా, అక్కడి నిరసనకారులు మతపెద్దలతో మాట్లాడుతూ వారిపై విరుచుకుపడుతున్న వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. ఓ మతపెద్ద దుస్తులు సరిగా ధరించాలని మహిళలకు చెప్పగా, ఓ మహిళ తీవ్రంగా స్పందించింది. ‘నీ పని నువ్వు చూసుకో’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. మరో వీడియోలో ఓ మతపెద్ద హిజాబ్ ధరించాలని చెప్పగా ‘‘నాకు ధరించడం ఇష్టం లేదు. మూర్ఖుడా’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరో వీడియోలో.. ‘‘ఇది నా దేశం. హిజాబ్ ఎక్కడ ధరించాలో, ఎక్కడ కూడదో చెప్పడానికి నువ్వెవరు?’’ అని విరుచుకుపడింది. అప్పుడా మతపెద్ద స్పందిస్తూ.. ‘‘ఈ తప్పనిసరి నిబంధన నీకు ఇష్టం లేకుంటే నువ్వు ఇంగ్లండ్ వెళ్లిపోయి మాసి అలినెజాద్‌తో కలిసి ఉండు’’ అని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానికామె స్పందిస్తూ.. మాసి ఉండేది అమెరికాలో అని మతపెద్దకు గుర్తు చేసింది.
2009 ఎన్నికల తర్వాత ఇరాన్ నుంచి పారిపోయిన అసమ్మతి కార్యకర్త అయిన మాసి అలినెజాద్ అమెరికా వెళ్లిపోయి అక్కడ ఆశ్రయం పొందుతోంది. ఆ తర్వాత మరో మహిళ మాట్లాడుతూ.. తానేమీ విదేశాలకు వెళ్లనని, ఇది నా సొంత దేశమని, తానిక్కడ స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాని చెప్పింది. ఓ రైల్వే స్టేషన్‌లో ఇంకో మహిళ మాట్లాడుతూ.. ‘‘మీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు. హిజాబ్ ధరించాలని కానీ, ధరించొద్దని కానీ నాకెవరూ చెప్పలేరు. ముందు మీరు బ్యాగులు సర్దుకుని ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోండి’’ అని గద్దించింది. మహిళ వెంట్రుకలు చూసి మీరు తట్టుకోలేకపోతే అది మీ సమస్య కానీ తమది ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆమె.. దేశాన్ని 40 ఏళ్లుగా నాశనం చేశారని, సూట్‌కేసులు సర్దుకుని వెళ్లిపోవాలని మతపెద్దపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Updated Date - 2022-11-10T21:09:37+05:30 IST