RSS Workers: 2013 నాటి హత్య కేసులో దోషులుగా తేలిన 11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలు
ABN, First Publish Date - 2022-11-14T21:31:06+05:30
ఓ హత్య కేసులో 11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను (RSS workers) దోషులుగా నిర్థారించిన కోర్టు జీవిత ఖైదు విధించింది.
తిరువనంతపురం: ఓ హత్య కేసులో 11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను (RSS workers) దోషులుగా నిర్థారించిన కోర్టు జీవిత ఖైదు విధించింది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని అనవూర్‌లో 2013లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. తాజాగా ఈ కేసులో నెయ్యట్టిన్‌కర అడిషనల్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. హత్య జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత 11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను (RSS workers) దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. నిందితుల్లో కేరళ ఆర్టీసీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకుడు కూడా ఉన్నారు. బాధితుడు నారాయణన్ నాయర్‌ను వీరు కుటుంబ సభ్యుల ముందే దారుణంగా హత్య చేశారు.
నారాయణన్ నాయర్ కుమరుడు శివ ప్రసాద్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ప్రాంతీయ కార్యదర్శిగా ఉండేవారు. శివ ప్రసాద్‌ను చంపే ఉద్దేశంతో 5 నవంబరు 2013లో ఆయుధాలతో వచ్చిన దుండగులు నారాయణన్ ఇంట్లోకి చొరబడ్డారు. వారిని నారాయణన్ నాయర్ అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు భార్య, ఇద్దరు కుమారుల కళ్లెదుటే ఆయనను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శివ ప్రసాద్, ఆయన సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలో జరిగిన రాజకీయ పరమైన గొడవలే హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
దోషుల్లో కేఎస్ఆర్‌టీసీ ఎంప్లాయీస్ సంఘ్ (BMS) రాష్ట్ర కార్యదర్శి వెల్లమ్‌కొల్లి రాజేశ్ (47), ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అనిల్ (32), ప్రేమ్ కుమార్ (36), ప్రసాద్ కుమార్ (35), గిరీశ్ కుమార్ (41), అరుణ్ కుమార్ (36), బైజు (42), సాజి కుమార్ (43), అజయన్ (33), బిను (43), గిరీశ్ (48) ఉన్నారు. నిందితులందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి, ఒకే రకమైన హెయిర్‌స్టైల్‌తో కోర్టుకు వచ్చారు. తమను గుర్తించకుండా సాక్షులను గందరగోళ పరిచేందుకు బట్టతల ఉన్న వారికి విగ్గులు ఇచ్చారు. అయితే, సాక్షలు వారందరినీ గుర్తించారు.
Updated Date - 2022-11-14T22:06:55+05:30 IST