AAP Leader Jain : సత్యేందర్ జైన్‌ను ఉంచిన జైలు సెల్ సిబ్బంది బదిలీ
ABN, First Publish Date - 2022-11-17T15:49:17+05:30
ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత సత్యేందర్ జైన్ (Satyendar Jain)ను ఉంచిన తీహార్ జైలు సెల్
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత సత్యేందర్ జైన్ (Satyendar Jain)ను ఉంచిన తీహార్ జైలు సెల్ వద్ద విధులు నిర్వహిస్తున్న 12 మంది సిబ్బందిని బదిలీ చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి జైన్‌కు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో జైలు అధికారి అజిత్ కుమార్‌ను సోమవారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
జాతీయ మీడియా గురువారం తెలిపిన వివరాల ప్రకారం, తీహార్ జైలులో సత్యేందర్ జైన్‌ను ఉంచిన సెల్ వద్ద విధులను నిర్వహిస్తున్న 12 మంది సిబ్బందిని బదిలీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. వీరంతా జైన్‌కు భద్రత కల్పిస్తున్న, సెల్ వద్ద విధులు నిర్వహిస్తున్నవారేనని చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కడంలో వీరి పాత్రపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
జైన్‌కు ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై నివేదికను సమర్పించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత నెలలో కోరింది. జైలు అధికారుల ప్రమేయంతోనే ఆయనకు ఈ సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ జైలులో జైన్ అత్యంత విలాసవంతంగా గడుపుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఆయనకు ముఖం, తల, కాళ్ళకు మసాజ్ చేస్తున్నారని తెలిపింది. ఆయనకు పండ్లు, సలాడ్స్ అందుతున్నాయని, కుటుంబ సభ్యులతోపాటు ఆయనపై నమోదైన ఆరోపణలకు సంబంధించిన కేసులో సాక్షులను కూడా ఆయన కలుస్తున్నారని తెలిపింది.
జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్‌ను ఇటీవల బదిలీ చేసి, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. తీహార్ జైలు అధికార ప్రతినిధిగా ధీరజ్ మాథుర్‌ను నియమించారు.
సత్యేందర్ జైన్, ఆయన సతీమణి పూనమ్ జైన్ 2015 నుంచి 2017 మధ్య కాలంలో రూ.1.47 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) 2017లో కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈ ఏడాది మే నెలలో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కోసం ఆయన బూటకపు కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపించింది.
ఇదిలావుండగా, జైన్ అరెస్ట్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటుగా స్పందించింది. హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం తమ పార్టీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించింది.
Updated Date - 2022-11-17T15:49:25+05:30 IST