America: హిమరికా
ABN, First Publish Date - 2022-12-26T03:34:56+05:30
అమెరికాపై ‘బాంబ్ తుపాను’ మంచు పంజా విసిరింది. హరికేన్‌లను తలపించే ఈదురుగాలులు.. తెరిపిలేకుండా కురుస్తున్న మంచు పౌరులను కకావికలం చేస్తున్నాయి.
అమెరికాలో 28 మంది మృత్యువాత
13 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
అగ్రరాజ్యంలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
మోంటానాలో -45.6 డిగ్రీల సెల్సియస్
ప్రధాన నగరాల్లో -10 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు
రాఖీ-అపలాచియాన్ పర్వత శ్రేణుల మధ్యనున్న
రాష్ట్రాల్లో తీవ్రంగా కురుస్తున్న మంచు
60% జనాభా గజగజ.. 3 లక్షల ఇళ్లల్లో చీకట్లు!
వాషింగ్టన్/టోక్యో, డిసెంబరు 25: అమెరికాపై ‘బాంబ్ తుపాను’ మంచు పంజా విసిరింది. హరికేన్‌లను తలపించే ఈదురుగాలులు.. తెరిపిలేకుండా కురుస్తున్న మంచు పౌరులను కకావికలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని 13 రాష్ట్రాలపై మంచు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో చాలా రాష్ట్రాల్లో అంధకారం అలుముకుంది. తీవ్రస్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు, మంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వేర్వేరు ప్రాంతాల్లో 28 మంది మృత్యువాత పడ్డారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొనే అమెరికాలో.. 60ు మంది ప్రజలు పండుగకు దూరమయ్యారు. విద్యుత్తు కాంతులతో విరాజిల్లే పలు నగరాలు, కరెంటుకు కటకటలాడుతున్నాయి. మెక్సికోలోని శిబిరాల్లోని శరణార్థులు మంచుకు గజగజ వణికిపోతున్నారు. అటు జపాన్‌లో కూడా మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం కడపటి వార్తలందేసరికి మంచు కారణంగా 14 మంది మృతిచెందగా.. 50 మంది గాయాలపాలయ్యారు.
రికార్డుస్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఉత్తర అమెరికాలోని మోంటానా, వ్యోమింగ్ నగరాల్లో శనివారం రాత్రి -45.6 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బోస్టన్, కొలంబస్, లింకన్, న్యూయార్క్, షికాగో, మిషిగాన్ ప్రాంతాల్లో మైనస్ 10 డిగ్రీల కంటే తక్కువలో ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాఖీ-అపలాచియాన్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న ప్రాంతాల్లో కనిష్ఠంగా 10 సెంటీమీటర్ల నుంచి గరిష్ఠంగా 1.07 మీటర్ల మేర మంచు పేరుకుపోయింది. శనివారం సాయంత్రానికి 3లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలకు కరెంటు లేక అంధకారం నెలకొంది. 60ు అమెరికా జనాభా ఇప్పుడు మంచుతో తీవ్ర ప్రభావమైందని, ఇళ్లకే పరిమితమై.. చలి మంటలు వేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని వివరించారు.
అత్యవసర సేవలకు ఆటంకాలు
చలి, మంచు కారణంగా అమెరికా వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో 5,400 దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఆదివారం తెల్లవారు జామున కూడా 1,346 విమానాలను రద్దు చేశారు. రోడ్లపై.. ముఖ్యంగా హైవేలపై పేరుకుపోయిన మంచు కారణంగా సహాయకచర్యలకు తీవ్ర ఆటంకాలేర్పడుతున్నాయి. బఫెలో, మోంటానా నగరాలకు ఎమర్జెన్సీ వాహనాలు చేరుకోలేకపోతున్నాయి. పౌరులు చలి నుంచి కాపాడుకునేందుకు షెల్టర్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
28 మంది మృతి
మంచు తీవ్రత కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో 28 మంది మృతిచెందినట్లు ఎమర్జెన్సీ సేవల విభాగం అధికారులు వెల్లడించారు. ‘‘చాలా చోట్ల మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒహియోలో కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు చనిపోయారు. ఒక్లాహోమాలో ముగ్గురు, కెంటుకిలో మరో ముగ్గురు, న్యూయార్క్‌లో ఇంకో ముగ్గురు చొప్పున మృతిచెందారు. మిస్సోరిలో మంచు కారణంగా ఓ కారు అదుపుతప్పి, పక్కనే ఉన్న గోడను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మరణించారు. లూయీస్ విల్లాలో ఓ అనాథ చలికి బలయ్యాడు’’ అని తెలిపారు.
జపాన్‌లో 14 మంది మృతి
జపాన్‌లోనూ మంచు కారణంగా, మంచువల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారని, మరో 50 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పర్వతప్రాంతమైన ఉత్తర హొక్కైడో నుంచి దక్షిణ ద్వీపాల సముదాయం వరకు తీవ్రంగా మంచు కురుస్తోందని వివరించారు. హొక్కైడోలోని ఎంగారు, యమగాటలోని ఒగుని, గిఫూలోని గుజో ప్రాంతాల్లో ఒక మీటరు నుంచి 1.2 మీటర్ల ఎత్తులో మంచు పేరుకుపోయిందని, దాంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
అమెరికాలో ఉష్ణోగ్రతలు
నగరం/రాష్ట్రం డిగ్రీల్లో
లింకన్ -18
షికాగో -17
మిషిగాన్ -17
ఇండియానా -15
కొలంబస్ -13
బోస్టన్ -10
న్యూయార్క్ -8
అట్లాంట -8
వాషింగ్టన్ -8
Updated Date - 2022-12-26T03:34:57+05:30 IST