America : అమెరికా గజగజ
ABN, First Publish Date - 2022-12-24T04:55:38+05:30
అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో మంచు కురుస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. క్రిస్మస్ సీజన్‌లో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోవడంతో ఆందోళన చెందుతున్నారు
విపరీతమైన చలి గాలులు.. హిమపాతం
వేలాది విమాన సర్వీసుల రద్దు
అనేక హైవేలపై రాకపోకల నిలిపివేత
క్రిస్మస్ వేళ ముంచుకొస్తున్న బాంబ్ సైక్లోన్
60% అమెరికన్లపై ప్రభావం: వాతావరణ శాఖ
వాషింగ్టన్, డిసెంబరు 23: అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో మంచు కురుస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. క్రిస్మస్ సీజన్‌లో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అమెరికాలోని దాదాపు సగం రాష్ట్రాల్లో భారీగా మంచు కురవడంతోపాటు చలిగాలులు వీస్తున్నాయి. వాషింగ్టన్ డీసీ, నష్‌విల్లే, లాస్‌ఏంజెలిస్, షికాగో, డల్లాస్, కాన్సాస్, డెన్వర్, మిన్నియపొలిస్, న్యూయార్క్, లాస్‌వెగాస్, అట్లాంటా, బోస్టన్ తదితరనగరాల్లో భారీగా హిమ పాతం కురుస్తోంది. కెనడాలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. క్రిస్మస్ సెలవులకు సిద్ధమవుతున్న అమెరికన్లకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త తెలిపింది. అరుదుగావచ్చి, విధ్వంసం సృష్టించే బాంబ్ సైక్లోన్ తరుముకొస్తోందని హెచ్చరించింది. దీన్ని తక్కువగా అంచ నా వేయొద్దని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారులను హెచ్చరించారు. వాతావరణ శాఖ అధికారులు ‘బాంబ్ సైక్లోన్’గా పేర్కొంటున్న ఈ తీవ్రమైన తుఫాను వల్ల విపరీతమైన చలిగాలులు వీస్తాయి. భారీగా మంచు కురుస్తుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 50డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉం దని అధికారులు తెలిపారు. కాగా బాంబ్ సైక్లోన్ వల్ల వాతావరణ పీడనం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇది అరుదుగా సంభవిస్తుందని, కొన్ని దశాబ్దాలకొకసారి వచ్చి విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సైక్లోన్‌తో నిమిషాల్లో 10 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోతుందన్నారు. బాంబ్ సైక్లోన్ అమెరికాలోని మధ్య, తూర్పు, ఈశాన్యరాష్ట్రాల్లోని సుమారు 13.5 కోట్ల మందిపై పెను ప్రభావం చూపనుంది. ఇప్పటికే 3100 విమాన సర్వీసులను నిలిపేశా రు. చాలా రహదారులపై ప్రయాణాలు నిషేధించారు. షికాగో, కొలరాడో, ఒహైయో, సౌత్ డకోటా తదితర ప్రాంతాల్లో శుక్రవారం మైనస్ 20డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనెక్టికట్, నార్త్ కరోలినా సహా దక్షిణ, మధ్యపశ్చిమ, తూర్పు తీరప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మంది కరెంటుసరఫరాలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపరీత వాతావరణంతో అమెరికాలోని 60 శాతం (20కోట్లప్రజలు)మంది ప్రభావితమవుతారని అంచనా.
Updated Date - 2022-12-24T04:55:39+05:30 IST