Navy : మరో స్వదేశీ విమాన వాహక నౌక రాబోతోందా?
ABN, First Publish Date - 2022-12-04T13:32:47+05:30
మన దేశంలో తయారైన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (IAC-1 INS Vikrant) పని తీరు
న్యూఢిల్లీ : మన దేశంలో తయారైన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (IAC-1 INS Vikrant) పని తీరు సంతృప్తికరంగా ఉండటంతో మరొకదానిని తయారు చేయాలని భారత నావికా దళం పట్టుబడుతోంది. అయితే ఆర్థిక పరిస్థితిని గుర్తు చేస్తూ సైనిక వ్యవహారాల శాఖ (Department of Military Affairs) ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. అవి : రష్యన్ మేడ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, మన దేశంలో తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్.
డిసెంబరు 4న నావికా దళ దినోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అంతకుముందు రోజు (శనివారం) చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మీడియాతో మాట్లాడారు. ఐఎన్ఎస్ విక్రాంత్ (ఐఏసీ-1) పని తీరు సంతృప్తికరంగా ఉందని, అందువల్ల ఐఏసీ-2 (స్వదేశీ విమాన వాహక నౌక)ను తయారు చేయించాలనే ప్రతిపాదనను నిలిపి ఉంచామని తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ట్రయల్ పెర్ఫార్మెన్స్ పట్ల నావికా దళం సంతృప్తి చెందినట్లు చెప్పారు. ఐఏసీ-2 కోసం ఈ దశలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పరిశీలనకు పంపించలేదని తెలిపారు. ఐఏసీ-1ను తయారు చేయడంలో కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్, ఇతర అనుబంధ పరిశ్రమలు సంపాదించిన అనుభవాన్ని ఉపయోగించుకుని మరొక విమాన వాహక నౌకను తయారు చేయడంపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌ను మన దేశంలోనే తయారు చేయడంతో విమాన వాహక నౌకను స్వదేశంలో తయారు చేసే సామర్థ్యంగల చాలా తక్కువ దేశాల సరసన భారత దేశం కూడా చేరింది. దీనికన్నా పెద్ద నౌకను తయారు చేయాలని మొదట్లో ప్రతిపాదించారు. దాదాపు 50 విమానాలను మోసుకెళ్ళే సామర్థ్యంతో, అత్యాధునిక CATOBAR (కెటాపల్ట్ అసిస్టెడ్ టేక్-ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ) మెకానిజం, న్యూక్లియర్ లేదా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సామర్థ్యంతో నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అయితే నావికా దళం మళ్లీ ఐఎన్ఎస్ విక్రాంత్ సామర్థ్యంతోనే మరొక విమాన వాహక నౌకను తయారు చేయించాలనుకుంటే, అది కూడా దాదాపు 30 విమానాలను మోసుకెళ్ళే సామర్థ్యంతో, గ్యాస్ టర్బయిన్ ప్రొపల్షన్‌తో నిర్మితం కావచ్చు. అయితే ఈ రెండిటికి అయ్యే ఖర్చును పరిశీలించినపుడు కేవలం రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు వరకు తేడా ఉండవచ్చు.
నావికా దళం అధికారులు చెప్తున్నదాని ప్రకారం, మన దేశానికి మూడు విమాన వాహక నౌకలు ఉండాలి. ఒక నౌక రీఫిట్ జరుగుతున్న సమయంలో మిగిలిన రెండూ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. తూర్పు వైపున చైనాపై దృష్టి పెడుతూ ఒక నౌక, మరొకటి పశ్చిమ దిశలో ఉండాలి.
Updated Date - 2022-12-04T13:32:51+05:30 IST