AAP Vs BJP : ఆప్ నేతకు జైలులో మసాజ్... వీడియో విడుదల చేసిన బీజేపీ...
ABN, First Publish Date - 2022-11-19T11:30:38+05:30
ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత, ఢిల్లీ రాష్ట్ర మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyender Jain)కు జైలులో నిబంధనలకు
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత, ఢిల్లీ రాష్ట్ర మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyender Jain)కు జైలులో నిబంధనలకు విరుద్ధంగా సకల సదుపాయాలు అందుతున్నాయని భారతీయ జనతా పార్టీ (BJP) ఆరోపించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయనకు తీహార్ జైలు సెల్‌లో మసాజ్ చేస్తున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోను శనివారం విడుదల చేసింది.
బీజేపీ నేత షెహజాద్ పూనావాలా శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, సత్యేందర్ జైన్ శిక్షకు బదులుగా జైలులో సంపూర్ణంగా వీవీఐపీ మజాను అనుభవిస్తున్నారా? అని ప్రశ్నించారు. తీహార్ జైలులో మసాజ్ చేయడమా? అని నిలదీశారు. హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఐదు నెలలపాటు బెయిలు పొందని వ్యక్తి హెడ్ మసాజ్ చేయించుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అధికార పరిధిలోని జైలులో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. వసూళ్ళ కోసం, మసాజ్ కోసం అధికార పదవులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కారణంగానే జరుగుతోందన్నారు. అన్ని నిబంధనలను చెత్తబుట్టలోకి విసిరేశారన్నారు. జైలులో వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని, కేజ్రీవాల్ ఈ మంత్రిని సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఆ మంత్రిని పదవి నుంచి తొలగించవద్దా? అని ప్రశ్నించారు. ఇది ఆ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెడుతోందని చెప్పారు.
బీజేపీ శనివారం విడుదల చేసిన వీడియోపై తీహార్ జైలు అధికారులు స్పందిస్తూ, ఇది పాత వీడియో అని చెప్పారు. జైన్‌కు సదుపాయాలు కల్పించిన అధికారులు, సిబ్బందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. జైన్‌కు వీవీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు రావడంతో తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ను ఇటీవల సస్పెంఃడ్ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కూడా గతంలో ఇటువంటి ఆరోపణలు చేసింది. జైలులో తల, వీపు, కాళ్ళు, పాదాలకు మసాజ్ చేయించుకునేందుకు సత్యేందర్ జైన్‌కు అవకాశం కల్పిస్తున్నారని కోర్టుకు తెలిపింది. జైన్ జైలులో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని తెలిపింది. ఆయనకు ప్రత్యేక ఆహారాన్ని కూడా అందజేస్తున్నారని తెలిపింది. ఆయన రకరకాల సదుపాయాలు అనుభవిస్తూ జైలులో లేదా ఆసుపత్రిలో గడుపుతున్నారని పేర్కొంది.
Updated Date - 2022-11-19T11:33:04+05:30 IST