China : చైనాలో నిరసన గళాల నిరోధం ఖర్చు తడిసిమోపెడు
ABN, First Publish Date - 2022-12-03T13:26:26+05:30
తీవ్ర అణచివేత విధానాల నుంచి విముక్తి కోసం చైనా ప్రజలు తీవ్రంగా తపిస్తున్నారు.
బీజింగ్ : తీవ్ర అణచివేత విధానాల నుంచి విముక్తి కోసం చైనా ప్రజలు తీవ్రంగా తపిస్తున్నారు. కోవిడ్-19 (Covid) మహమ్మారి నిరోధం కోసం అమలు చేస్తున్న కఠిన నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అసమ్మతిపై ఉక్కుపాదం మోపే రాజకీయ విధానాలను రద్దు చేయాలని, తమ భావాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ కల్పించాలని కోరుతున్నారు. తమకు నియంతలు అక్కర్లేదని, జీ జిన్‌పింగ్ దేశాధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం దేశ రక్షణ కోసం కన్నా ఈ నిరసన గళాలను అణచివేసేందుకే ఎక్కువ ఖర్చు చేస్తోంది.
జీ జిన్‌పింగ్ (Xi Jinping) నేతృత్వంలోని కమ్యూనిస్టు పాలనపై ఇటీవల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి, కోవిడ్ ఆంక్షలను కొంత వరకు సడలించింది. అయితే ప్రజలు దీనితో సంతృప్తి చెందడం లేదు, నిరసనను సీసాలో పెట్టి బిగించడంతో ప్రస్ట్రేషన్ పెల్లుబుకుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతపై అమానుషంగా విరుచుకుపడుతున్న విధానాలపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎంత కఠినంగా ఉంటున్నాయంటే, కొన్నిచోట్ల ప్రజల మొబైల్ ఫోన్లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. నిషిద్ధ యాప్‌లను వాడుతున్నారా? నిరసనలకు మద్దతిచ్చే యాప్‌లను వాడుతున్నారా? ఎలాంటి ఫొటోలు, మెసేజ్‌లు ఉన్నాయి? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపినప్పటికీ, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రజల అశాంతికి మరింత ఆజ్యం పోసినట్లవుతోంది.
ప్రజా భద్రత కోసం భారీ ఖర్చు
అసమ్మతిని ఎంత మాత్రం సహించని కమ్యూనిస్టు ప్రభుత్వం నిరసన గళాలను అణచివేసేందుకు భారీగా ఖర్చు చేస్తోంది. ప్రజా భద్రత పేరుతో ఈ నిధులను విడుదల చేస్తోంది. 2020లో దాదాపు 210 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. గత దశాబ్దంలో ఈ పద్దు క్రింద ఖర్చు చేసిన సొమ్ము కన్నా ఇది మూడు రెట్లు అధికం. దేశ రక్షణ కోసం 2020లో ఖర్చు చేసిన దాని కన్నా ఏడు శాతం ఎక్కువ. 2010 నుంచి సైన్యం కోసం చేసే ఖర్చు కన్నా పబ్లిక్ సేఫ్టీ కోసం చేసే వ్యయం ఎక్కువగా ఉంటోందని నివేదికలు చెప్తున్నాయి. గ్వాంగ్‌డోంగ్, జియాంగ్సు, జింజియాంగ్ ప్రావిన్స్‌లలో అత్యధికంగా ఖర్చు చేయవలసి వస్తోంది. వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్న చైనా ప్రభుత్వంపై పెరుగుతున్న నిరసనకు ఈ నిదుల వ్యయమే గొప్ప ఉదాహరణ.
Updated Date - 2022-12-03T13:26:31+05:30 IST