CMRL: నందనంలో సీఎంఆర్‌ఎల్ ప్రధాన కార్యాలయం
ABN, First Publish Date - 2022-10-28T09:33:41+05:30
స్థానిక నందనంలో చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) ప్రధాన కార్యాలయాన్ని గురువారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర గృహ, పురపాలక వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ప్రారంభించారు.
- ప్రారంభించిన సీఎం స్టాలిన్, కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి
పెరంబూర్(చెన్నై), అక్టోబరు 27: స్థానిక నందనంలో చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) ప్రధాన కార్యాలయాన్ని గురువారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర గృహ, పురపాలక వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ప్రారంభించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రించేలా ఏర్పాటుచేసిన మెట్రోరైలు(Metro Rail) పథకంలో ప్రస్తుతం 54.1 కి.మీ మేర మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకంలో రెండో విడతగా 118.9 కి.మీ మేర మెట్రోరైలు మార్గం నిర్మాణపనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం సీఎంఆర్‌ఎల్ కార్యాలయం కోయంబేడు డిపో ప్రాంగణంలోని ‘ఆపరేషన్ కంట్రోల్ సెంటర్’ ప్రాంగణంలో కార్యాలయ నిర్వహణ పనులు జరుగుతున్నాయి. స్థలాభావం కారణంగా విధినిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో నందనం మెట్రో రైల్వేస్టేషన్(Metro Railway Station) సమీపంలోని అన్నాసాలై ప్రాంతంలో రాష్ట్రప్రభుత్వం కేటాయించిన 8.96 ఎకరాల స్థలంలో 3.90 లక్షల చ.అ విస్తీర్ణంలో రూ.365 కోట్ల వ్యయంతో ప్రధాన కార్యాలయ భవనం నిర్మించారు. ఈ భవనాన్ని గురువారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర గృహవసతి, పురపాలక వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో 12 అంతస్తులతో కూడిన ఈ భవనంలో ఆరంతస్తులు సీఎంఆర్‌ఎల్ నిర్వహణకు వినియోగిస్తుండగా, మిగిలిన అంతస్తులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వనున్నారు. ఈ భవనం ముందు సొరంగం తోడే యంత్రం (టనల్ బోరింగ్ యంత్రం) ప్రజల సందర్శనార్ధం ఏర్పాటుచేశారు. అలాగే, ప్రవేశద్వారం వద్ద పురాతన బావి, అందులో నుంచి మహిళలు బిందెలతో నీళ్లు తీసుకెళ్లే నమూనా చిత్రాలు రూపొందించారు. కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎం.సుబ్రమణ్యం, ఎంపీలు తమిళచ్చి తంగపాండ్యన్, గిరిరాజన్, ఎమ్మెల్యే వేలు, చెన్నై కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మహే్‌షకుమార్, రహదారులు, చిన్న హార్బర్ల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రదీప్ యాదవ్, గృహవసతి, నగరాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హితేస్ కుమార్ ఎస్. మక్వానా, సీఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-28T09:33:43+05:30 IST