IVF: ఐవీఎఫ్ చికిత్స.. అండాలు సేకరిస్తుండగా మహిళ అనూహ్య మరణం
ABN, First Publish Date - 2022-10-27T21:52:48+05:30
ఐవీఎఫ్ చికిత్సీ తీసుకుంటుండగా ఓ యువతి అనూహ్య రీతిలో మరణించింది.
న్యూఢిల్లీ: సంతానం కోసం అలమటిస్తున్న వారికి ఆశాకిరణం ఐవీఎఫ్(IVF). సహజపద్ధతుల్లో సంతానం కోసం ప్రయత్నించి విఫలమైన ఎన్నో జంటలు చివరకు ఐవీఎఫ్ కృతిమ గర్భధారణ పద్ధతిలో తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్నాయి. అయితే.. ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటుండగా ఓ యువతి అనూహ్య రీతిలో మరణించిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలో తాజాగా వెలుగు చూసింది. యువతి నుంచి అండాలు(Egg) సేకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయి ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్(ఓహెచ్ఎస్ఎస్-OHSS) అనే సమస్య బారిన పడి ఆమె మృతిచెందినట్టు పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. యువతి నుంచి అండాలు సేకరించే క్రమంలో వైద్యులు కొన్ని మందులు ఇచ్చారు. అండాల విడుదలకు ఇవి సహకరిస్తాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. ఈ క్రమంలోనే ఆమె ఓహెచ్ఎస్ఎస్ బారినపడ్డట్టు వైద్యులు తెలిపారు. అండాలు సేకరించే క్రమంలో ఓహెచ్ఎస్ఎస్ వల్ల ఒక్కసారిగా ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.
క్షణాల్లో మరణం..
ఓహెచ్ఎస్ఎస్ కారణంగా యువతి ఊపిరితిత్తుల్లో ఒక్కసారిగా నీరు చేరిపోయిందని(Pulmonary Edema) వైద్యులు చెప్పారు. దీంతో ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని పేర్కొన్నారు. కాబట్టి.. ఐవీఎఫ్‌తో వచ్చే సమస్యల గురించి పేషెంట్లకు వైద్యులు పూర్తి అవగాహన కలిగించాలని అభిప్రాయపడ్డారు. అయితే..ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ తీసుకొంటున్న ప్రతిముగ్గురు మహిళల్లో ఒకరికి మాత్రమే ఓహెచ్ఎస్ఎస్ సమస్య తలెత్తుతుందని, ఓహెచ్ఎస్ఎస్ బారినపడ్డ వారిలో అత్యంత అరుదుగా మాత్రమే మరణం సంభవిస్తుందని వైద్యులు వివరించారు.
Updated Date - 2022-10-27T22:11:46+05:30 IST