Premalatha: ఈసారి మా ప్రతాపం చూపిస్తాం..
ABN, First Publish Date - 2022-09-15T14:12:16+05:30
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని డీఎండీకే కోశాధికారి ప్రేమలత(Premalatha)
- పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం
- డీఎండీకే కోశాధికారి ప్రేమలత
అడయార్(చెన్నై), సెప్టెంబరు 14: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని డీఎండీకే కోశాధికారి ప్రేమలత(Premalatha) తెలిపారు. అంతేగాక ఈసారి జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. కోయంబేడు సమీపంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రేమలత పార్టీ పతాకాన్ని ఎగురవేసి,500మంది మహిళలకు బిందెలు, చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్వార్ధ రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ డీఎండీకే(DMDK) అన్నారు. అనారోగ్యం కారణంగా ఈ వేడుకలకు పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ హాజరుకాలేకపోతున్నారని, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తల కు శుభాకాంక్షలు తెలిపారన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్న నేపథ్యంలో, గెలుపే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా ప్రచారం చేపట్టనున్నామన్నారు. పార్లమెంటు(Parliament) ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, దీనిపై ఇతర పార్టీల నుంచి సలహాలు తీసుకునే స్థితిలో తాము లేమని ప్రేమలత వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-09-15T14:12:16+05:30 IST