Nepal : నేపాల్‌లో భూకంపం
ABN, First Publish Date - 2022-11-10T05:17:33+05:30
దిగువ హిమాలయాల్లోని నేపాల్, ఉత్తరాఖండ్‌లను భూకంపాలు, భూప్రకంపనలు వణికిస్తున్నాయి.
రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత.. ఉత్తరాఖండ్‌లో ప్రకంపనలు
న్యూఢిల్లీ, డెహ్రాడూన్, కాఠ్మండు, నవంబరు 9: దిగువ హిమాలయాల్లోని నేపాల్, ఉత్తరాఖండ్‌లను భూకంపాలు, భూప్రకంపనలు వణికిస్తున్నాయి. పశ్చిమ నేపాల్‌లోని ధోతి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపం కారణంగా ఇళ్లు కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్‌స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్టు జాతీయ సెస్మాలజీ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్‌కు 90 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో ఈ భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం 10 కిలోమీటర్లలోతున ఉందని వెల్లడించింది. నేపాల్‌లో 24 గంటల వ్యవధిలో సంభవించిన మూడో భూకంపమిది. మంగళవారం రాత్రి 9.07 గంటల సమయంలో 5.7 తీవ్రతతో ఒకసారి, 4.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. తెల్లవారుజామున 1.57 గంటలకు ఒకసారి ఆ తర్వాత 3.15 గంటల సమయంలో ఒకసారి (3.6 తీవ్రత), ఉదయం 6.27 గంటలకు (4.3 తీవ్రతతో) భూప్రకంపనలు సంభవించాయి. ఉత్తరాఖండ్‌లో కూడా ఈ భూప్రకంపనలు తెల్లవార్లూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. దాదాపు 13 జిల్లాల్లో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చి రోడ్లపైనే ఉండిపోయారు. ఉదయం 6.27కు ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఢిల్లీ, వడోదర, విజయవాడల్లోనూ..
ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్, లఖ్‌నవూల్లో కూడా భూమి కనిపించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం భూమి కంపించడం గురించి ట్వీట్ చేశారు. వడోదర (గుజరాత్), సిలిగురి (పశ్చిమబెంగాల్), విజయవాడ (ఆంధ్రప్రదేశ్) వంటి చోట్ల కూడా భూమి కనిపించందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది.
Updated Date - 2022-11-10T05:17:37+05:30 IST