Election Symbol: షిండే వర్గానికి రెండు కత్తులు, డాలు గుర్తు
ABN, First Publish Date - 2022-10-11T23:59:43+05:30
ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన వర్గానికి ''రెండు కత్తులు, ఒక డాలు'' గుర్తును ..
న్యూఢిల్లీ: ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన వర్గానికి ''రెండు కత్తులు, ఒక డాలు'' (two swords and a shield) గుర్తును ఎన్నికల సంఘం (election commission) మంగళవారంనాడు కేటాయించింది. అలాగే పార్టీ పేరుగా ''బాలాసాహెబ్ శివసేన'' పేరును ఖరారు చేసింది. షిండే వర్గం సోమవారంనాడు మూడు పేర్లను సూచించగా వాటిని ఈసీ తోసిపుచ్చింది. మంగళవారంనాడు కొత్త జాబితా పంపమని ఆదేశించింది. దీంతో రెండుకత్తులు-డాలు గుర్తుతో పాటు రావిచెట్టు, సూర్యుడు గుర్తులను ఆ వర్గం సూచించింది. కాగా, థాకరే వర్గం సైతం కాగడా గుర్తుతో పాటు, త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు గుర్తును ప్రతిపాదించింది. తమిళనాట ఇప్పటికే డీఎంకేకు ఉదయించే సూర్యుడు గుర్తు ఉంది. ఈ నేపథ్యంలో కాగడా గుర్తును థాకరే వర్గానికి ఈసీ కేటాయించింది.
కాగా, గత వారం శివసేన పేరును ఇటు ఉద్ధవ్ థాకరే, అటు షిండే వర్గం ఉపయోగించుకోరాదంటూ ఈసీ నిషేధం విధించింది. పార్టీ పేరు, గుర్తును స్తంభింపచేసింది. అంథేరి ఈస్ట్ ఉప ఎన్నికల నేపథ్యంలో శివసేన శాశ్వత గుర్తు అయిన ''విల్లు, బాణం'' గుర్తును ఏ వర్గానికి కేటాయించకుండా తాత్కాలికంగా ఈసీ స్తంభింపచేసింది.
Updated Date - 2022-10-11T23:59:43+05:30 IST