Agastyar hill: ఏనుగుల శరణాలయంగా అగస్త్యర్ కొండ ప్రాంతం
ABN, First Publish Date - 2022-08-13T16:22:43+05:30
తిరునల్వేలి(Tirunalveli) జిల్లాలోని అగస్త్యర్ కొండ ప్రాంతాన్ని ఏనుగుల శరణాలయంగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేంద్ర పర్యావ
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 12: తిరునల్వేలి(Tirunalveli) జిల్లాలోని అగస్త్యర్ కొండ ప్రాంతాన్ని ఏనుగుల శరణాలయంగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఉత్తర్వులు జారీచేశారు. తిరునల్వేలి జిల్లా పశ్చిమ కనుమల కొండ ప్రాంతంలో ఉన్న పొదిగై కొండ ప్రాంతం తమిళుల అభివృద్ధికి చిహ్నంగా ఉందని చరిత్ర చెబుతోంది. ఈ కొండ శిఖరంపై అగస్త్యర్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు వసతి లేకపోవడంతో భక్తులు నడిచివెళ్తుంటారు. అయితే అందుకు మూడు రోజులు పడుతుంది. పాపనాశం, కారైయారు నది, పానతీర్థం జలపాతం, పేయారు తదితరాలు దాటి కొండకు చేరుకోవాల్సి ఉంటుంది. 1995 వరకు భక్తులు ఈ ప్రాంతానికి విరివిగా వెళ్లేవారు. కానీ కలక్కాడు ముండన్‌తురై పులుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని 2002 అనంతరం ఈ మార్గంలో భక్తులు వెళ్లడంపై అటవీశాఖ నిషేధం విధించింది. దీంతో భక్తులు కొండ వెనుకవైపున్న తిరువనంతపురం(Thiruvananthapuram) మీదుగా వెళుతున్నారు. 6 వేల చ.కి.మీటర్ల విస్తీర్ణంలో వున్న పొదిగై కొండ ప్రాంతంలో 121 రకాల జంతువులు, 157 రకాల సరీసృపాలున్నాయి. ఈ నేపథ్యంలో అగస్త్యర్ కొండ ప్రాంతాన్ని ఏనుగుల శరణాలయంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దాంతో రాష్ట్రంలో ఏనుగుల శరణాలయాల సంఖ్య ఐదుకు చేరినట్లయింది.
Updated Date - 2022-08-13T16:22:43+05:30 IST