Money laundering: మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిల్
ABN, First Publish Date - 2022-10-04T21:30:34+05:30
మనీ లాండరింగ్ కేసులో ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు...
ముంబై: మనీ లాండరింగ్ కేసు (Money laundering case)లో ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Anil deshmukh)కు ముంబై హైకోర్టు మంగళవారంనాడు బెయిలు (Bail) మంజూరు చేసింది. అక్టోబర్ 13 నుంచి ఆయన బెయిల్ అమలులోకి వస్తుందని తెలిపింది. ష్యూరిటీగా లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎప్పుడు సమన్లు పంపినా వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆయనను ఆదేశించింది.
మనీ లాండరింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్ ప్రమేయం ఉందనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ గత ఏడాది పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఆయన బెయిలు దరఖాస్తును తోసిపుచ్చింది. పోలీసు అధికారుల బదిలీలు, నియామకాలను ఆయన ప్రభావితం చేసినట్టు సాక్ష్యాలు చెబుతున్నాయని కోర్టు తెలిపింది. కాగా, మహారాష్ట్ర హోం మంత్రిగా ఆయన తన అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ముంబై వ్యాపారవేత్తల నుంచి రూ.4.7 కోట్ల మేరకు అక్రమంగా ముడుపులు తీసుకున్నారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తాన్ని హవాలా మార్గాల్లో తన సొంత ట్రస్టుకు ఆయన బదిలీ చేశాడని ఆరోపిస్తోంది. ఆ మొత్తం వ్యవహారంపై సీబీఐ తొలుత కేసు నమోదు చేయగా, మనీ లాండరింగ్ కోణం నుంచి ఈడీ దర్యాప్తు సాగించింది.
Updated Date - 2022-10-04T21:30:34+05:30 IST